సబ్ ఫీచర్

ఉద్యమాలతో ఉద్రిక్తతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మేము కూడా వెనుకబడి ఉన్నాం.. మాకూ విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కావాలం’టూ ఇపుడు కొన్ని వర్గాల వారు ఉద్యమాలను ప్రారంభించడం, వాటికి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం లేనిపోని ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు, కొన్ని పార్టీలు అధికారాన్ని కోల్పోయినపుడు ఇలాంటి ఉద్యమాలు పుడుతున్నాయన్నది తిరుగులేని వాస్తవం. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లకు తాము వెనుకబడిపోయామన్న విషయం ఇపుడు కొన్ని కులాలకు గుర్తుకువచ్చినట్లయ్యింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల సౌకర్యం కల్పిస్తామని ఆశలు చూపించడం వల్లనే ఇలాంటి ఉద్యమాలు చోటుచేసుకుంటున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు పదేళ్ల కాలంలో లేని కాపు ఉద్యమం ఇపుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రారంభం కావడం మేధావులు ఆలోచించాల్సిన విషయం. ఒక పార్టీ పాలన సమయంలో కనుమరుగైన ఉద్యమాలు మరో పార్టీ అధికారంలోకి రావడంతో మొదలవుతున్నాయి. దీంతో ఈ ఉద్యమాల వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందన్న విషయం ఎవరికైనా అవగతమవుతుంది. కాపు కులస్థులకు రిజర్వేషన్లు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటూ కాపులు ఉద్యమం ప్రారంభించారు. ఇటీవల ఈ ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, చాలామందిపై పోలీసు కేసులు నమోదు కావడం తెలిసిందే. ఉద్యమంలో హింసాత్మక సంఘటనలకు కారకులెవరు? ఓ కులం వారు ఉద్యమిస్తే అందులో రాజకీయ పార్టీలు, నేతలు జోక్యం చేసుకోవడం ఎందుకు? ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి. మరోవైపు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తాము సహించేది లేదని ఇప్పటికే బిసి జాబితాలో ఉన్నవారు హెచ్చరిస్తున్నారు. కొత్తగా మరికొన్ని కులాలను జాబితాలో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందని కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఎపి ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుండగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో మంజునాథ కమిషన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టిడిపి ఇచ్చిన హామీలు కాపుల్లో సహజంగానే కొత్త ఆశలను చిగురింపజేశాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే సహించేది లేదని బిసి కులస్థులు అంటున్నారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు ఈ ఉద్యమాలు కారణమవుతున్నాయి.
సామాజికంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీలకు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మేధావులు శాస్ర్తియ పద్ధతిలో దూరదృష్టితో ఈ రిజర్వేషన్ల సౌకర్యానికి రూపకల్పన చేశారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాలతో మన రాజకీయ పార్టీలు ఇతర వర్గాలకూ ‘రిజర్వేషన్ల ఎర’ వేసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగానే సమాజంలో కులపరమైన విభజన ఏర్పడింది. కొన్ని పార్టీలు కొన్ని వర్గాలకు పరిమితమవుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని పార్టీలు మతపరమైన రిజర్వేషన్లను కూడా ప్రకటించాయి. ఈ వ్యూహాలన్నీ ఓట్ల యావతోనే అన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి పార్టీలు, నేతల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి. రాజకీయ పార్టీల, నేతల కుత్సిత విధానాలు మారకపోతే సమాజంలో వర్గ వైషమ్యాలు మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా అటు సమాజం, ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థ నష్టపోక తప్పదు. కులాలు, మతాల మధ్య మరింతగా అంతరాలు పెంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునేవారి ఎత్తుగడలను ప్రజలే చిత్తు చేయాలి. ఉద్యమాలు ఉద్రిక్తతలకు దారితీయకుండా అందరూ సంయమనం పాటించాలి.

-వావిలిపల్లి రాజారావు