సబ్ ఫీచర్

మధుర గాన మురళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవయ్యో శతాబ్దపు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్వరబ్రహ్మ నాద బ్రహ్మోపాసన పరిపూర్ణమైంది. త్యాగరాజస్వామి వారి తరువాత అంతటి భావుకతతో కర్ణాటక శాస్ర్తియ సంగీతానికి మాధుర్యాన్ని కల్పించిన గాన మురళి స్వర్గ సంగీత ప్రపంచానికి తరలిపోయింది. స్వర సమ్మోహన లోకాలకు పంచరత్నాల రసజ్ఞతను అందించిన అపూర్వ గాత్రం ఆయనది. ఆ స్వరం అలవోకగా పలికిన ఎన్ని సంగతులు రసికులలో రసానందం చిలికించాయో.. ఆయన గొంతు గంధర్వ గానం చేస్తే.. వాయులీనాన్ని అలవోకగా మీటినవి ఆయన చేతులు. తెలుగు నాట సంగీత సరస్వతి తలపై చూడామణిలా వెలిగిన వాడు.. స్వర సమ్రాట్టు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దివిజ రసజ్ఞులను పరవశింపజేయ మహాప్రస్థానం చేశారు. ఆధునిక సంగీత ప్రపంచంలో, మన కాలంలో సంపూర్ణ వాగ్గేయ కారుడిగా చెప్పుకోదగ్గ విద్వన్మూర్తి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. తెలుగు, తమిళ కన్నడ రాష్ట్రాల్లో గత శతాబ్దంలో అనేక మంది సంగీత విద్వాంసులు అవతరించారు. తమదైన రీతిలో స్వర గానం చేశారు. విశ్వమంతటా భారతీయ సంగీతాన్ని కీర్తి శిఖరాలను అధిరోహింపజేశారు. వీరిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి అనుభూతి వారిది.. ఎవరి భావ వ్యక్తీకరణ వారిది. ఎవరి బాణి వారిది.. కానీ బాలమురళితో ఏ ఒక్కరినీ సాటిగా సరిపోల్చి చూడటం సాధ్యం కాదు. త్యాగరాజస్వామి వారి తరువాత 72 మేళ కర్తల్లోనూ కీర్తనలు రచించిన ఏకైక వాగ్గేయ కారుడు బాలమురళీకృష్ణ మనకాలం వాడని చెప్పుకోవటానికి గర్వపడని తెలుగువాడు ఉండడు. కేవలం ఇతరులు రాసిన కీర్తనలకు జీవం పోయటమే కాకుండా తానే రచించి, వాటికి స్వరాలను సమకూర్చి, సంగీతంలోని జటిలత్వానికి మాధుర్యాన్ని సమకూర్చి అందించిన వాడు బాలమురళీకృష్ణ ఒక్కరే. పాటలు, కీర్తనలు రాయటం అంటే సామాన్యం కాదు. పాట రాగయుక్తంగా రావాలంటే అవసరమైన ఛందో లక్షణాలు తెలిసి ఉండాలి. ఎక్కడ యతి ఉండాలో, ప్రాస ఎక్కడ వాడాలో ఎక్కడ ఏ రకమైన గణాలు పడాలో వాటిని పద్ధతి ప్రకారం అమర్చుకుంటూ వెళ్లాలి. సాధారణంగా కీర్తనల్లో వాడే పెద్ద మాటలు భక్తి రసాన్ని ఒలికిస్తాయి. పాటలో ఒక మెరుపు.. ఒక అద్భుతమైన సాహిత్యం.. ఆ సాహిత్యంలో సజీవంగా నిలిచిన కవిత్వ ఆత్మ, ఆ ఆత్మలోంచి అద్భుతంగా జాలువారిన రాగం, అన్నీ సమపాళ్లలో కలిసి బాలమురళీ కృష్ణ కీర్తనై అవతరించింది. ఒకటా-రెండా ఆయన సృష్టించిన రాగాలు.. లవంగి, రోహిణి, సర్వశ్రీ, పుష్కర గోదావరి, వల్లభి, మహతి, జనసమ్మోదిని, ఓంకారి, త్రిశక్తి... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రాగాలను ఆయన సృజించారో లెక్కలేదు. ఆయన ప్రచురించిన జనకరాగ కృతి మంజరి కర్ణాటక సంగీత ప్రపంచానికి మహోపకారం చేసింది. మొత్తం 72మేళ కర్తల్లో రాసిన కీర్తనలు, వాటి స్వరాలు మృదు మధురంగా వినిపిస్తాయి. మధుర శబ్దాల ప్రయోగం ఆయన కీర్తనలకు మరింత మాధుర్యాన్ని కల్పించాయి. కీర్తనలకు స్వర కల్పన చేయటంలోనూ బాలమురళీకృష్ణ ప్రత్యేకత అద్భుతమైనది. ఏదైనా ఒక కీర్తన ఆయన పాడటం అంటే అంతకు ముందు ఆ కీర్తనను వేరే విద్వాంసులు ఎందరు పాడినా.. ఏదో తెలియని కొత్తదనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతకుముందు లేని మాధుర్యం ఆ పాటలో ఆయన స్వరం ద్వారా వ్యక్తమవుతుంది. ఇతరులు పాడిన రాగమే అయినా అందులో లేని ఒక్క సంగతి అయినా బాలమురళి గాత్రంలో పలుకుతుంది. సదాశివ బ్రహ్మేంద్రుల ‘పిబరే రామరసం’ కీర్తనకు ఒక స్థితి కల్పించిన వాడు బాలమురళి మాత్రమే. భక్త రామదాసు కీర్తనలకు జీవం పోసిన వాడు బాలమురళి. కర్ణాటక సంగీత సరస్వతికి స్వరార్చన చేసిన పూజారి ఆయన. విశ్వమంతటా విశ్వమోహనంగా ఎక్కడో అక్కడ అనుక్షణం వినిపించే ఆ గానం అమరమైంది. ఆయన అమరులకు చేరువైనా.. ఆయన పాట మనతోనే..మనలోనే.. మంత్రముగ్ధంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

చిత్రాలు..
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆస్థాన విద్వాంసుడిగా...
గంగూభాయ్ హంగల్‌కు అభివాదం చేస్తూ...
పండిట్ శివకుమార్‌శర్మతో జుగల్‌బందీ
భీమ్‌సేన్ జోషితో కలిసి....

- కోవెల సంతోష్‌కుమార్