సబ్ ఫీచర్

‘సెల్’ మోజుతో చదువుకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు యువతలోనే ఉన్నాయి. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు- అన్న వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం. అయితే, టెక్నాలజీని తమ చదువు, కెరీర్ కోసం కాకుండా కేవలం కాలక్షేపానికి వినియోగిస్తూ ఎందరో విద్యార్థులు తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్లపై విపరీతమైన వ్యామోహమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఫేస్‌బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సోషల్ మీడియాలో అనునిత్యం విహరిస్తూ చాలామంది యువతీ యువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులోపడి పెడదారి పడుతున్నారు. ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగాలకు గతంలో కంటే ఇపుడు అవకాశాలు దండిగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలనే తేడా లేకుండా చాలాచోట్ల విద్యార్థుల్లో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరవుతూ సినిమాలు, షికార్లు, బైక్ రైడింగ్‌లు, పార్టీల పేరుతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకొందరు క్యాంటీన్లలో, ఏకాంత ప్రదేశాల్లో ప్రేమల పేరిట స్వేచ్ఛగా విహరిస్తూ కబుర్లు చెప్పుకుంటూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. కాలేజీ అధ్యాపకులు ప్రశ్నిస్తే వారిపైకి ఎదురు తిరగడం, తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం సర్వసాధారణమైంది.
నేటి యువత వక్రమార్గం పట్టడానికి ప్రధాన కారణం సెల్‌ఫోన్‌లు. కాలేజీ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి వివిధ రకాల ఆండ్రాయిడ్ ఫోన్‌లను కొనడం, వాటిలో డేటాకార్డులు వేసి, నిత్యం వాట్సాప్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్‌లను వాడడం పరిపాటిగా మారింది. ఇంకొందరైతే స్మార్ట్ఫోన్లలో నీలిచిత్రాలు చూడడం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, చాటింగ్‌ల పేరుతో రాత్రివేళ కాలక్షేపం చేస్తూ తగినంత నిద్రకు దూరమవుతున్నారు. ఫేస్‌బుక్‌లో వివిధ చిత్రాలు, తమ సెల్ఫీలను పోస్టుచేసి తమకు ఎన్ని లైకులు, షేర్‌లు, కామెంట్స్ వచ్చాయో చూసుకోవడం అలవాటుగా మారింది. కొందరైతే కాలేజీలకు వెళ్లినా ఎప్పుడూ ‘నెట్’ ఆన్‌లోనే పెడుతూ అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా పెడచెవిన పెట్టి సెల్‌ఫోన్‌తోనే ఆడుకుంటున్నారు. వివిధ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేస్తూ జీవితం అంటే సెల్‌ఫోనే అని భావిస్తున్నారు. ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని బైక్‌లపై దూసుకుపోతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. బైక్ ప్రమాదాలతో ఇతరులకూ హాని చేస్తున్నారు.
గతంలో ప్రతి ఇంట్లో ఒక సెల్‌ఫోన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరి చేతులలో స్మార్ట్ఫున్లు దర్శనమిస్తున్నాయి. రిలయన్స్ జియో లాంటి కొన్ని నెట్‌వర్క్‌ల యాజమాన్యాలు అపరిమితంగా డేటాను అందిస్తూ ప్రతి ఒక్కరూ నెట్‌సిమ్ వాడేలా అలవాటు చేస్తున్నాయి. విద్యార్థులే కాదు, వివిధ వర్గాల వారు సైతం సెల్‌ఫోన్ కంపెనీలు ఇచ్చే రాయితీలు, ఉచిత డేటాల కోసం ఎగబడడం చూస్తున్నాం. గంటల తరబడి ఫోన్ వాడుతున్నందున చాలామంది విద్యార్థులు కంటి, చెవి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఫోన్లకు దాసోహమైపోతున్న యువతీ యువకులు తమ కుటుంబాలను, పరిసరాలను కూడా పట్టించుకోవడం లేదు. కనీసం వార్తాపత్రికలను చదివేందుకు సైతం వీరికి తీరిక దొరకడం లేదు. విజ్ఞానాన్ని పెంచుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన యువత సెల్‌ఫోన్ మోజులో వ్యసనాలకు బానిసలు కావడం ఆందోళనకర పరిణామం. సెల్‌ఫోన్ల వాడకం మితిమీరుతున్నందున ఆ ప్రభావం మెదడు పనితీరుపై పడుతుందని, మానసిక ప్రవర్తనలోనూ విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

- కామిడి సతీష్‌రెడ్డి