సబ్ ఫీచర్

చిక్కుముడి విప్పేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక, రాజకీయ శాస్త్రాలు అనునిత్యం ‘ముడి’పడే ఉంటాయి. పాలనా వ్యవహారాలన్నీ ఆర్థిక పరమైన నిర్ణయాలతోనే నిర్వహించాలి. జనం అవసరాలు, సామాజిక వ్యవహారాలు కూడా ‘ద్రవ్య మార్పిడి’తోనే జరుగుతాయి. అయితే, దేశ ప్రజలకు సంబంధించిన ఈ ‘ముడి’ ఎప్పటికీ ‘గోర్డియన్స్ నాట్’లా (చెడ్డ చిక్కుముడి)లా ఉండకూడదు. అవసరమైనపుడు విప్పుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ సందర్భంగా ‘గోర్డియన్స్ నాట్’ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నాడు గ్రీసు దేశంలో గోర్డియన్ అనే మేధావి ఉండేవాడు. ఆయన ఓసారి దారాన్ని తీసుకుని, దాన్ని చిందర వందరగా ముడి వేశాడు. ఆ ‘చిక్కుముడి’ని విప్పిన వ్యక్తి ప్రపంచాన్ని జయించగలడని గోర్డియన్ ప్రకటించాడు. ఎంతోమంది యోధులు, తెలివైన యువకులు దాన్ని విప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మాసిడోనియా యువరాజు, ఆరిస్టాటిల్ శిష్యుడు అయిన అలెగ్జాండర్ ఆ దారపు చిక్కుముడిని చూశాడు. అది చేత్తో విప్పడానికి వీలుకాదని గ్రహించి, కత్తి తీసుకుని ఆ ముడిని కోసేశాడు. ‘అలవికాదని తెలుసు కానీ, యుక్తితో చిక్కుముడిని కోసేశావు.. ఈ ప్రపంచాన్ని జయించగల వీరుడవు నువ్వే..’ అని అలెగ్జాండర్‌ను గోర్డియన్ ప్రశంసించాడట! ఆ తర్వాత అనుకోకుండానే అనేక దేశాలపైకి దండయాత్రలు చేసి అలెగ్జాండర్ వీరుడని అనిపించుకున్నాడు. ఈ చారిత్రక విషయాన్ని పక్కన పెడితే, మన దేశంలో ఇపుడు ఆర్థిక, సామాజిక ‘దారాలు’ చిక్కువీడని పీటముడిగా అల్లుకున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత్‌లో ఓటర్ల తీర్పు మేరకే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి. అయితే, అధికారంలోకి వచ్చిన నేతలు ప్రజల విశ్వాసాన్ని ఏ మేరకు నిలుపుకుంటున్నారన్నది ప్రశ్నార్థకమే. తమ ఆశలను వమ్ము చేస్తూ, తమ ప్రయోజనాలను పట్టించుకోని నేతలను పదవుల నుంచి తప్పించే అధికారం మాత్రం ఓటర్లకు లేదు. అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో నేతలు ఎలా వ్యవహరించినప్పటికీ, ఎన్నికల సమయంలో రాయితీలు, వాగ్దానాలు కుమ్మరిస్తూ అదే నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు భారీగా డబ్బు పంచుతూ వారిని వలలో వేసుకుంటున్నారు. ఆ డబ్బు మాయలో పడి విలువైన ఓటుహక్కును చాలామంది దుర్వినియోగపరుస్తున్నారు. అందుకే ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టగలరో వారే అధికార పగ్గాలు చేపడుతున్నారు. నైపుణ్యం, మేధస్సు, పాలనా దక్షత ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వడం లేదన్నది కఠోర సత్యం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన వారు అధికారంలోకి వచ్చాక తమ పెట్టుబడితో పాటు ఇంకా ఎక్కువగా సంపాదించాలి. ఇది జరగాలంటే ధనార్జన కోసం అన్ని అడ్డమైనదారులనూ వినియోగించుకోవాలి. ప్రస్తుత రాజకీయాల్లో ఇదొక విష వలయం. అందుకే ఆర్థిక, రాజకీయ రంగాలు విడదీయలేనంతగా అల్లుకున్న పెద్ద చిక్కుముడి.
రాజకీయ నాయకులకు వత్తాసు పలికే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం అక్రమాలకు పాల్పడుతూ అవినీతి సొమ్మును వెనకేసుకుంటున్నారు. ఇలా రాజకీయ నాయకుల వద్ద, అవినీతి అధికారుల వద్ద భారీగా నల్లధనం పోగవుతోంది. ఉద్యోగులకు భారీగా జీతభత్యాలను చెల్లిస్తున్నా అనేక ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచాల పేరిట కొందరు అధికారులు, ఉద్యోగులు పోగుచేసుకుంటున్న డబ్బంతా అక్రమార్జనే అవుతుంది. ఇదంతా లెక్కల్లో చూపని ధనమే. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సంపన్న వర్గాల వారు తమ సంపాదనకు లెక్కలు చూపకపోవడంతో వారి వద్ద భారీగా నల్లధనం మూలుగుతోంది. అధిక లాభాలను పొందాలన్న తాపత్రయం అన్ని వర్గాల వారిలోనూ పెరిగిపోతున్నందున అవినీతి సర్వాంతర్యామి అయింది. ధనాన్ని అపరిమితంగా పోగుచేసుకోవడంతో అది ‘నల్లధనం’గా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుశాపంగా మారింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో సామాన్య జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొన్ని సంస్కరణలు అనివార్యమని చెప్పకతప్పదు.
ప్రజా జీవనం మెరుగు పడాలంటే ఆర్థిక వ్యవస్థనే కాదు, రాజకీయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని అరికట్టాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి. ఎన్నికల్లో గెలిచిన నేతలు పలురకాల ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించకుండా కట్టడి చేయాలి. ప్రజల తీర్పుకు విరుద్ధంగా పార్టీ మారే ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించేలా చట్టంలో మార్పులు తేవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్న పార్టీ ఫిరాయింపులను సమూలంగా అరికట్టాలి. జాతీయతా భావం, దేశభక్తి సన్నగిల్లడం వల్లే నేడు రాజకీయాలు లాభసాటి వ్యాపారంలా మారాయి. వ్యక్తిగత లాభాపేక్ష లేనివారినే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబెట్టాలి. ఎన్నికలు ముగిశాక అధికార, విపక్ష పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి జన సంక్షేమంపైనే దృష్టి సారించాలి. అవినీతి, అక్రమాలను నిరోధించే బలమైన మార్గాలు వ్యవస్థీకృతం కావాలి. నాయకులు, రాజకీయ పార్టీలు నిబద్ధతతో వ్యవహరిస్తే దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. ఇవన్నీ ఆచరణలో నిజం కావాలంటే చిత్తశుద్ధి, ధైర్యసాహసాలున్న నాయకులు రాజకీయాల్లోకి రావాలి. పార్టీ, ప్రభుత్వం, పదవుల కన్నా ప్రజాక్షేమమే పరమావధిగా భావించే నేతలు ఇప్పుడు అవసరం. ముందుగా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే అవినీతి, అక్రమాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే- రాజకీయ, ఆర్థిక రంగాల మధ్య ఈ చిక్కుముడిని విప్పేదెవరు?

- మనె్న సత్యనారాయణ 99890 76150