సబ్ ఫీచర్

నేలవిడిచి చంద్రన్న సాము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు రోజులు వరసగా నిర్వహించిన కలెక్టర్లు, పోలీసు అధికారుల సదస్సు, ఆ తర్వాత బ్యాంకర్ల సమావేశం తీరు పరిశీలిస్తే ఆయన నేల విడిచి సాము చేస్తున్నారా? అనిపించకమానదు. కలెక్టర్ల సదస్సు తొలిరోజున నగదు రహిత లావాదేవీలు చేసి ఆ అనుభవాలేమిటో తనకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. మర్నాడు ఎంతమంది నగదు రహిత లావాదేవీలు చేశారని అడిగితే సగం మంది మాత్రమే చేతులెత్తారు. అంటే బాబు పడుతున్న కష్టం ఎంతవరకూ ఫలిస్తుందో అర్థమవుతోంది. ఏఐఎస్ అధికారులే సిఎం చెప్పింది చేయకపోతే ఇక సామాన్యులు ఎందుకు పాటిస్తారు? మొత్తానికి చంద్రబాబు అంటే అధికారులకు భయం పోయిందా?
నోరుపారేసుకుంటారన్న మాటే గానీ, టిడిపి ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ల్లో నిజం లేకపోలేదు. ఒక సిఎం అన్నీ తానే చేయనవసరం లేదు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, చివరకు ఆర్డీఓల పనికూడా ఆయనే చేస్తే ఇక ఎవరికి మాత్రం బాధ్యత, జవాబుదారీతనం ఉంటుంది? అన్నీ సిఎం చూసుకుంటారులే అన్న నిర్లిప్తత రాదా? దేశంలో బాబు మాదిరి ఏ సిఎం నిత్యం కష్టపడుతున్న దాఖలాలు లేవు. తెలంగాణ సిఎం కెసిఆర్ అయితే తాను తలచుకుంటే తప్ప మంత్రులకూ ఇంటర్వ్యూలివ్వరు. బాబు మాదిరి తరచూ మీడియా ముందుకు రారు. పబ్లిసిటీ అంటే చెవికోసుకునే ప్రధాని మోదీనే ఎప్పడో తప్ప మీడియా ముందుకు రారు. జయలలిత ఎప్పుడో తప్ప మీడియా సమావేశాలే పెట్టలేదు. నవీన్ పట్నాయక్ డిటో. వరసగా సిఎం పదవికి ఎన్నికవుతున్న రమణ్‌సింగ్ ఎప్పుడూ మీడియాలో కనిపించరు, రోజూ సమీక్షలు పెట్టరు. మరి వీరంతా మాస్ లీడర్లే. బాబులా కష్టపడకపోయినా, మీడియాతో మమేకం కాకున్నా బ్రహ్మాండమైన మెజారిటీలతో ఎలా గెలుస్తున్నారు? అంటే అసలు లోపం ఎక్కడ ఉందో టిడిపి అధినేత విశే్లషించుకోవాలన్నమాట.
తన సంక్షేమ పథకాలకు అనుకున్న స్థాయిలో ప్రచారం, క్రెడిట్ రావడం లేదని, ఆ మేరకు పొగడ్తలు రాకపోయే సరికి తనకు తానే పొగుడుకునే బాబుగారి కొత్త పద్ధతి పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. ఇటీవల ‘క్రిస్మస్ చంద్రన్న కానుక’ల సందర్భంలో ఓ వృద్ధురాలినుద్దేశించి- ‘ నెల నెలా ఒకటో తారీఖునే వెయ్యి రూపాయల పించను ఇస్తున్న నేను మీ కొడుకులంటే బెటర్ కదా?’ అని బాబు ప్రశ్నిస్తే, ఆమె స్పందించకుండా వెళ్లిపోయిన వైనం మీడియాలోనూ వచ్చింది. ప్రధాని స్థాయికి ఎదిగిన చంద్రన్నకు ఇంకా ఇలాంటి పొగడ్తలు అవసరమా? కాపు కార్పొరేషన్ ద్వారా కార్లు, ఆటోలు కొనుగోలు చేస్తున్న లబ్ధిదారులు వాటిపై ముద్రగడ, పవన్ ఫొటోలు మాత్రమే వేసుకుని, నిధులిచ్చిన సిఎం ఫొటో ఎందుకు వేయడం లేదు? అధికారులకు పెత్తనం అప్పగించినందున వారివల్లేమైనా లాభం ఉందా? అంటే అదీలేదు. తమపై పనిభారం మోపి నరకయాతన పెడుతున్నారంటూ అదే అధికారులు మీడియాకు చెబుతున్న వైనం బాబు విజయమా? వైఫల్యమా? అంటే లోపం ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? అదీ అసలు ప్రశ్న! లోపమంతా బాబులోనే అన్నది సొంత పార్టీ నేతల వ్యాఖ్య. మంత్రులకు అధికారాలు ఇవ్వకుండా, వారిపై మింగుడుపడని అధికారులను నియమించి, రోజూ తానే కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడితే మంత్రుల స్థాయిని తానే తగ్గించినట్టు కాదా?
సిఎంగా ఉన్న నేత తన సహచరులను గౌరవించి, గుర్తించకపోతే ఇక అధికారులు ఎందుకు గుర్తిస్తారు? ఆ మధ్య మంత్రి దేవినేని ఉమ వద్దకు ఒక బదిలీ అర్జీ వస్తే దాన్ని చూడమని ఎస్.ఇకి ఇచ్చారు. ఆ అధికారి మాత్రం ‘మంత్రి ఇస్తే వెంటనే చేయాలా? సాధారణ బదిలీలయ్యేవరకూ ఆగాలం’టూ ఆ లేఖను వారం రోజులు తనవద్దే ఉంచేసుకున్నారట! మరో మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి తన శాఖలో ఏ అధికారి నియమితులవుతున్నారో తనకే తెలియదు. ఇలాంటి తీరును చూసిన కొందరు చోటా మోటా జర్నలిస్టుల కులదీపాలు, సిఎం పేరు చెప్పి మంత్రులకు చేరువై, తాము బాబుకు ‘మీ విషయం చెబుతామనే’ వరకూ వెళుతున్న స్థితి. ఇవన్నీ పాలనకు శోభ తెచ్చేవి కావుకదా?
సిఎం మాట శిలాశాసనం. ఒకసారి చెబితే జరిగిపోవలసిందే. మెదక్ జిల్లాలో కేసీఆర్‌పై పోరాడుతున్న ఒక తెదేపా నేత సోదరుడు చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. పాపం ఆయన ప్రతి వారం సిఎంను కలవడం, చంద్రబాబు చెప్పగా ‘సరే’ అని అధికారులు తలూపడం కొన్ని నెలల నుంచి జరుగుతుందే తప్ప ఫలితం కనిపించలేదు. బాబు తాను ఒకసారి చెప్పిన పనులే వందసార్లు సిఎంఓ అధికారులకు గుర్తు చేయాల్సివస్తోంది. సిఎంకు వచ్చిన అర్జీలు తీసుకున్న అధికారులు, మళ్లీ మళ్లీ అర్జీలివ్వాలని అడుగుతుంటే- అది బాబంటే భయం ఉన్నట్లా? పోయినట్లా? తాను పదే పదే చెబితే తప్ప ఫైలు కదపని అధికారులను పెట్టుకుని, సిఎం ఏం సాధిస్తారో అర్థం కాని ప్రశ్న. జెసి దివాకర్ రెడ్డి చెప్పినట్లు అధికారులతో పాలన చేస్తే ఫలితాలు రావు. ఇప్పుడు కాలం మారింది. అవసరాల్లో మార్పు వచ్చింది. సమాజానికి బదులు వ్యక్తిగత లబ్థి చేకూర్చే పద్ధతికి వైఎస్ తెరలేపారు. చంద్రబాబు నిర్ణయాలు సమాజానికి ఉపయోగపడేలా కనిపిస్తే, వైఎస్ నిర్ణయాలు వ్యక్తులకు ప్రయోజనం కలిగించేలా ఉంటాయి. ఇప్పుడు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. పనులు చేస్తుంటేనే గెలుపు అంతంతమాత్రంగా ఉన్న ఈరోజుల్లో పార్టీని మరుగుజ్జును చేసి, అధికారులకు పెత్తనమిస్తే దానివల్ల దెబ్బతినేది తామేనన్నది తెలుగు తమ్ముళ్ల ఆందోళన.
బాబు మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చినా వ్యక్తిగతంగా ఆయనకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నా ఆయన మానసికంగా ఎప్పుడూ అధికారంలో ఉన్నట్లే భావించేవారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలో- మంత్రులుగా పనిచేసి ఓడిన వారు కూడా అదే భావనలో ఉండేవారు. ఎటొచ్చీ నష్టపోయింది తామేనన్నది పార్టీ శ్రేణుల విశే్లషణ. పార్టీని పట్టించుకోకుండా గంటలపాటు ఫలితమివ్వని సమీక్షలు, అంతూ ఆపూలేని సుదీర్ఘ ప్రసంగాలతో సాధించిన అదనపు ప్రయోజనం ఒక్కటీ కనిపించలేదు. ఇలాంటి వాటివల్లే పాతనేతలతోపాటు, కొత్తగా వచ్చి మంత్రి అయిన రావెల కిశోర్ లాంటి వాళ్లు కూడా లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారేమో? ‘రౌతు మెతక అయితే గుర్రం మూడుకాళ్లతో నడుస్తుందంటే’ ఇదేనేమో? దీన్నిబట్టి చంద్రబాబు నేలవిడిచి సాముచేస్తున్నారని అనుకోవాలి మరి..!
* * *
‘నేను లేస్తే మనిషిని కాన’ని అన్నాడట వెనకటికో మొనగాడు. బిజెపిపై ఒంటికాలితో లేస్తున్న మన అఖిలాంధ్ర ట్విట్టర్ స్టార్ పవన్‌ను చూస్తే అదే గుర్తుకొస్తోంది. ప్రత్యేక హోదా, పెద్దనోట్ల రద్దు, ప్యాకేజీలపై వరసగా ట్వీట్లు సంధిస్తోన్న పవన్ కోపం ఎవరిమీదనో ఎవరికీ అర్థం కాదు. మోదీని పల్లెత్తుమాట అనకుండా బిజెపిని, బాబుకు దెబ్బతెగలకుండా తెదేపా ఎంపీలనూ బంతిపూలతో ఎందుకు కొడుతున్నారో కనీసం ఆయనకైనా తెలిస్తే సంతోషమే. ఎన్నికలకు ఇంకో ఏడాది ఉందనగా అప్పుడు సీన్‌లోకి వచ్చి అద్భుతం సృష్టించాలన్నది పవన్ లక్ష్యం. అప్పటివరకూ వీలైనన్ని సినిమాలు చేసుకుని, ఇప్పటివరకూ ‘కటిక పేదరికం’లో ఉన్న ఆయన నాలుగురాళ్లు వెనకేసుకుని, అప్పుడు రాజకీయాల్లోకి ఫుల్ టైమర్‌గా వస్తారట. సినీనటులు షూటింగ్‌లో గ్యాప్ వస్తే నాలుగైదురోజులు విదేశాలకు వెళ్లి టైంపాస్ చేస్తుంటారు. పవన్ కూడా వీలు చిక్కినపుడల్లా నాలుగైదు టాపిక్‌లు తీసుకుని ట్వీట్లు లాగించేసి ‘నేనూ ఉన్నా’నంటున్నారు. మధ్యలో రాంగోపాల్ వర్మ సినిమా మార్కెట్ ప్రమోషన్‌లా,పొలిటికల్ ప్రమోషన్ ప్రోగ్రాములు పెడుతున్నారు. గతంలో బిజెపి-తెదేపాను గెలిపించాలని చెప్పిన పవన్ ఇప్పుడు వామపక్ష నేతలు నారాయణ,రామకృష్ణలతో పనిచేస్తున్నట్లున్నారు. అంటే తాను లెఫ్టో, రైటో తేల్చుకోలేని గందరగోళంలో ఉన్నారన్నమాట. నిజంగా ప్రజాసమస్యల పరిష్కారానికి ‘కాటమరాయుడు’కు అంత చిత్తశుద్ధి ఉంటే సినిమాలు మానుకుని నేరుగా మైదానంలోకి రావచ్చుకదా? ఇలా అడిగితే- ‘నేను ధ్యానం చేస్తూ కూడా సమస్యల గురించి ఆలోచిస్తున్నానని ఎందుకు అనుకోర’ని గబ్బర్‌సింగ్ సెలవిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పరిస్థితి జగన్‌కు తక్కువ, నారాయణకి ఎక్కువలా ఉంది.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144