సబ్ ఫీచర్

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు నేపథ్యంలో మన జాతీయగీతం ‘జనగణ మన’పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు ‘జనగణ మన’ విధిగా ఉండాలని, ఆ సమయంలో ప్రేక్షకులెవరూ బయటకు పోకుండా తలుపులు మూసివేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఫలితంగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తోంది. ‘జనగణ మన’కు ఎంతో ఘన చరిత్ర ఉంది. సరిగ్గా 105 ఏళ్ల క్రితం 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని తొలిసారిగా ఆలపించారు. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ‘జనగణ మన’ను జాతీయగీతంగా ఆమోదించింది. ‘విశ్వకవి’, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని రచించి, తానే సంగీత బాణీని సమకూర్చారు.
భారతదేశ ఔన్నత్వం, జాతి జనుల ఆకాంక్షలు మిళితమై ఉన్నందునే ‘జనగణ మన’ మన జాతీయ గీతమైంది. ఈ గీతాన్ని ఠాగూర్ తొలుత తన మాతృభాష బెంగాలీలో రచించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్ థియోసాఫికల్ కళాశాలను 1919లో సందర్శించిన సందర్భంగా ఆయన ‘జనగణ మన’ను ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. తన స్నేహితుడైన థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ జెహెచ్ కజిన్స్ కోరిక మేరకు ఠాగూర్ ఆ కళాశాల విద్యార్థులకు ‘జనగణ మన’ బాణీని నేర్పించి వారి చేత పాడించారు.
1861 మే 7న జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్‌కు చిన్నతనం నుంచి ప్రకృతి పట్ల, పుస్తకాల పట్ల ఎంతో మమకారం. సాహిత్య సేద్యంలో నిమగ్నమై ఉన్నా జాతీయతా భావాలను తన మదినిండా నింపుకున్నారు. బ్రిటిష్ పాలకులు బాలగంగాధర్ తిలక్‌ను నిర్బంధించినపుడు ఠాగూర్ తన నిరసన గళం వినిపించారు. సంపన్నులైనా పట్టు వస్త్రాలను పక్కనపెట్టి శ్రామికుడు నివసించే కటిక నేలపైనే నడక సాగించాలని సూచించిన సామాజికవాది ఠాగూర్. కలకత్తాలో ‘శాంతి నికేతన్’ను స్థాపించి విద్యారంగ వికాసానికి విశేష కృషి చేసిన ఆయన 1941 ఆగస్టు7న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. తాను లేకున్నా, జాతిజనులు పాడుకునేందుకు ‘జనగణ మన’ గీతాన్ని అందించారు. దేశ ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం ‘జనగణ మన’. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను మనం పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు, సమావేశాలు జరిగినపుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి. దీన్ని ఆలపించడం అంటే- కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందని అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవ భావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయగీతంగా గుర్తించారు.

- సూరం అనిల్