సబ్ ఫీచర్

ప్రతిజ్ఞలతో ప్రయోజనం శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ కొన్ని విషయాలను పాఠ్యాంశాలలో చేర్చాలని గొప్పగా సూచిస్తుంటారు. నిజానికి పాఠ్యాంశాలను నిర్ణయించడం విద్యావేత్తల పని. ఈమధ్య రాజకీయ వాసనలు గల కొందరు విద్యావేత్తలు సైతం తమకిష్టమైన విషయాలని పాఠ్యపుస్తకాలలో అత్యుత్సాహంతో ప్రవేశపెడుతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు పాఠ్య పుస్తకాలలో ఏది ఉంటే అదే ప్రమాణమని, శ్రేయోదాయకమని భావిస్తారు. కొన్ని విషయాలు ఇపుడు హాస్యాస్పదంగా, ఓ ప్రహసనంలా మారాయ. పాఠశాలల్లో నిత్యం ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయి? నిజంగా ఇవి అమలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భేదాలు, కొట్లాటలు ఉంటాయా? ఇప్పుడు ఇవి దినదినాభివృద్ధి అవుతున్నాయి. ఇలాగే ఉద్యోగస్థులు సైతం అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞలు చేస్తూంటారు. అవి అమలు జరిగితే లంచగొండితనం భూతద్దం పెట్టి వెదికినా కనిపించదు. దేశంలో ఎక్కడ చూసినా లంచగొండులు పట్టుబడుతూనే ఉన్నారు.
ఎవరు ఏ ప్రతిజ్ఞ చేసినా హృదయపూర్వకంగా చేయాలి. చేసే సమయంలో కుడి చేయి హృదయంపై ఉంచి చేయాలి. అలా చేస్తే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌వారి పద్ధతి అని భయపడి చేయి చాచి చేస్తున్నారు. అనగా ఈ ప్రతిజ్ఞను గాలికి వదలివేశానని ఆ చర్య సూచిస్తుంది. హృదయంపై చేయి వేసి చేసినదే ప్రతిజ్ఞ. ఆ విధానం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి సంస్థల సొత్తు కాదు. అలా చేస్తే కాషారుూకరణ అయిపోతుందని సెక్యులర్‌వాదులు అల్లాడిపోవలసిన అవసరం లేదు. ప్రతిజ్ఞల విషయంలో మన గ్రంథాలలో ఎన్నో ఘట్టాలున్నాయి. హరిశ్చంద్రుడు, భీష్ముడు వంటి వారు తమ ఆశయాలకి ఒక్క అడుగు కూడా వెనుకకి వేయలేదు. దానికి కారణం వారి కఠోర నిర్ణయాలే. ఇప్పుడు పాఠశాలలో చేస్తున్న ప్రతిజ్ఞలకి అదనంగా కృతజ్ఞత విషయంలో కూడా ప్రతిజ్ఞ చేయించాలని ఎపి విద్యా శాఖమంత్రి ఇటీవల ప్రకటించారు. నిర్ణయం మంచిదే. కానీ, ఆచరణలోకి రాని ప్రతిజ్ఞలు ఎన్ని చేస్తే ఏం లాభం? ఆచరణ ప్రధానం. అందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉండాలి. మన పాఠ్యపుస్తకాలలో స్వామి వివేకానంద రచనలు ఉండవు. గురుశిష్య సంబంధాలు వివరించే ఉపనిషత్తులలోని సూక్తులు ఉండవు. దానికి కారణం మనది సెక్యులర్ రా జ్యాంగం. అందువలన ఇలాటి మత విషయాలను పిల్లలకు బోధించకూడదు. వ్యక్తిత్వ వికాసానికి ప్రముఖులు పత్రికలలో సూచనలిస్తారు. కొందరు ప్రముఖులను పాఠశాలలకు రప్పించి ఆ విషయంలో ఉపన్యాసాలు ఇప్పిస్తారు. ఇవన్నీ ఎందుకు? వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి వివేకానందుని వంటి మహాపురుషుల రచనలను మించి ఏవీ లేవు. పాఠశాలలో వీటి ప్రసక్తి లేకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లలకు వీటిని గురించి తెలియజేసి చదివించాలి.
పూర్వం ఉపాధ్యాయులు ఆదర్శంగా మెలగటంతో శిష్యులకు వారిపై జీవితాంతం గౌరవభావం ఉండేది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కళా వెంకటరావుగారు ఒక పర్యాయం ఒక హాలులో పెద్ద సభలో ఉన్నారు. రాజకీయ నాయకులతోను, ప్రజలతోను సభ క్రిక్కిరిసిపోయింది. పోలీసు బందోబస్తు గట్టిగా ఉంది. ఆ సమయంలో వెంకటరావుగారికి బాల్యంలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడు అక్కడకు వెళ్ళాడు. ఆయనకు లోనికి వెళ్లేందుకు అనుమతి లభించలేదు. అప్పుడాయన ఎలుగెత్తి శిష్యుని పిలవగానే వెంకటరావుగారు లేచి ఆయన వద్దకు వెళ్లి తన పక్కన కూర్చుండబెట్టుకుని ఎంతో గౌరవించారు. పూర్వం పిల్లలచే దసరా సమయంలో గిలకలు పట్టించేవారు. అప్పుడు ఉపాధ్యాయులను ఊరేగింపుగా పి ల్లలు వారి ఇళ్లకు, బంధువుల ఇళ్ళకు తీసుకువెళ్ళేవారు. కొత్తబట్టలతో, ధనంతో ఉపాధ్యాయులను వారు సత్కరించేవారు. అలాంటి సందర్భంలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలను ఒక ఏరు దాటించవలసి వచ్చింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఐదారుగురు పిల్లలు మరణించారు. ఉపాధ్యాయుడు ఈ సంఘటనకు ఎంతో వ్యధ చెంది ఆ పిల్లల మరణానికి తానే కారణం అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట్టాన్ని ‘కవిసమ్రాట్’ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘వేయిపడగలు’ నవలలో ఒకచోట వివరించారు. ఆనాటి గురువులకు శిష్యులపై అంతటి ప్రేమాభిమానాలుండేవి.
శీలము లేని విద్య నిష్ప్రయోజనమని మన మహనీయులు చెప్పారు. విద్యార్థులకు చదువుకన్నా శీలమే ప్రధానమైనది. నేటి చదువులు శీలానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందువల్లనే తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడం లేదు. గురువులపై తిరగబడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. నేటి గురువుల్లో కొంతమంది వారి ధ్యేయం మరచిపోయారు. కొంతమంది యువకులు కాలేజీలకు చదువుకోసం వెళ్లడం లేదు. మంచి ఉద్యోగాలు లభించాలని మాత్రమే వెడుతున్నారు. ముందు ఈ దుస్థితి తొలగాలి. అశ్లీల సినిమాలు, విచ్చలవిడి మద్యపాన దుకాణాలు, మత్తు పదార్థాల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించలేకపోతోంది. వీటి ప్రభావం యువతపై నేడు విశేషంగా ఉంది. దేశభక్తి, పరోపకారం, పెద్దల పట్ల గౌరవభావం నశించిపోతున్నాయి. పిల్లలు శీలవంతులైనప్పుడు- బడుల్లో ఎలాంటి ప్రతిజ్ఞలు అవసరం లేదు.

- వేదుల సత్యనారాయణ