సబ్ ఫీచర్

దేశం బాగుపడేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్నేయాసియా దేశాలు 1997లో భయంకరమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా భారీ ద్రవ్యోల్బణంతో 50 బిలియన్ల డాలర్ల లోటు బడ్జెట్‌తో మునిగిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉద్యోగాలు పోయాయి. ప్రజలు రోడ్డునపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి కఠిన షరతులతో అప్పుఇచ్చినా సంక్షోభం తీరలేదు. అప్పుడు అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంపై ప్రజలనుద్దేశించి- ‘మీవద్ద ఎంత బంగారం ఉంటే అంతా ఇచ్చేయండి.. స్వదేశీ వస్తువులే కొనండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక మీరిచ్చిన బంగారం విలువతోబాటు వడ్డీకూడా ఇస్తాం.’ అని విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఆ విజ్ఞప్తికి స్పందించడమే కాదు, అకుంఠిత దీక్షతో, సడలని ఆత్మాభిమానంతో ప్రభుత్వానికి సహకరించారు. తమ బంగారం అంతా ప్రభుత్వానికి ఇచ్చేశారు. విదేశీ వస్తువులు బహిహ్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌హిట్ అయిన ‘టైటానిక్’ సినిమా దక్షిణ కొరియాలో విడుదల అయితే ఎవరూ చూడలేదు!
రెండేళ్లలోనే దక్షిణ కొరియా దశ తిరిగింది. ఇప్పుడది ప్రపంచంలోనే ‘టాప్ టెన్’లో నిలిచి ప్రబల ఆర్థిక శక్తిగా మారింది. శాంసంగ్, హ్యూండాయ్ ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదిగాయి. చరిత్రలో మరికొంచెం వెనక్కివెళితే రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడులతో జపాన్ ఎంతో నష్టపోయింది. భవనాలు కూలిపోయాయి, పరిశ్రమలు నాశనమయ్యాయి. సగం మంది ప్రజలు రోగాలతో, అంగవైకల్యంతో సమస్యల పాలయ్యారు. జపనీయులు యుద్ధంలో ఓడిపోయినా జీవనయానంలో ఓడిపోలేదు. క్రమశిక్షణతో, దేశభక్తితో నూతన జపాన్‌ని ఆవిష్కరించుకున్నారు. ప్రపంచంలో ఆరవ ఆర్థిక శక్తిగా ఎదిగారు.
మరి మనం..?
క్రమశిక్షణకు ఆమడదూరంలో వుంటాం. నియమాలు పట్టించుకోం, దేశాభిమానం సున్నా! పదోక్లాసు చదివే కుర్రాడు లైసెన్స్ లేకపోయినా కారు నడిపి యాక్సిడెంట్ చేసి పారిపోతాడు. కేసులు పెట్టినా ఎలాంటి శిక్ష ఉండదు. అంబులెన్స్ సైరన్ మోగిస్తున్నా దారి వదలం. తినేది, తాగేది, చదివేది, చూసేది, కట్టేది అన్నీ ఫారిన్ సరుకులే. మార్కులు కొనుక్కుంటాం. డిగ్రీలు, ఉద్యోగాలూ కొనుక్కుంటాం. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించే వంచకులను లక్షలు ముట్టచెబుతాం. మోసం జరిగిందని తెలిస్తే తిట్టిపోస్తాం. కానీ, డబ్బులు ఖర్చుపెట్టి ఉద్యోగాలు పొందాలనుకున్న వారిని తప్పుపట్టం. పైగా వారిపై సానుభూతి కురిపిస్తాం. లక్షలు ఖర్చుపెట్టి వాహనాలు, ఆభరణాలు కొంటాం. గృహాలు సమకూర్చుకుంటాం. కానీ, పన్నులు కట్టం. పన్ను పడుతుందని ఏది కొన్నా బిల్లు వద్దంటాం. ఉద్యోగంలో చేరింది మొదలు ఎక్కడ నుంచి ఎంత సొమ్ము లాగవచ్చునో ఆరాతీస్తాం గాని పని నేర్చుకోం, పని చెయ్యం.
హఠాత్తుగా పెద్దనోట్లు రద్దు అనేసరికి కొందరిలో దేశభక్తి ఉబికింది. రద్దుని సమర్ధించారు. నెల రోజుల్లో ఆ దేశభక్తి ఇంకిపోయింది. అలవాటులేని అవపోసన కదా! విమర్శలు మొదలుపెట్టారు. ఎన్ని వెధవ పనులుచేసినా శిక్ష పడకూడదు. కించిత్తు కష్టం కలగకూడదు. మనం సుఖంగా ఉండాలి. ఎదుటివాడు చస్తే మనకేల? బ్యాంకు వద్ద క్యూలో వృద్ధులు చనిపోతున్నారని అంగలారుస్తాం కాని వాళ్లని క్యూ ముందుకు వెళ్లనిద్దామన్న సంస్కారం గాని, మానవత్వం గాని ఉండదు. కాసులకు కక్కుర్తిపడి- రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన సొమ్ముని నల్ల బకాసురులకు అందజేసి సామాన్యులకు మొండి చెయ్యి చూపిస్తారు బ్యాంక్ అధికారులు. మన జేబునిండితే చాలు ఎవరెలా చచ్చినా ఫర్వాలేదు! నీతులు వల్లిస్తాం, చేతగాని ప్రభుత్వమంటూ నిందిస్తాం. నిజం ఆలోచిస్తే- సాటి ప్రజలకు మనమే ద్రోహం చేస్తున్నాం. కొరియన్లు, జపనీయుల అంకితభావం, నిబద్ధతలతో మనకి పోలికా? ఇలాగే ఉంటే దేశమేగతి బాగుపడునోయ్..?

- శుభలక్ష్మి పట్నాయక్