సబ్ ఫీచర్

‘అమరావతి’కి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ రూపుదాల్చబోతున్న నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతం ఇప్పుడు ఓ బ్రాండ్ నేమ్‌గా ప్రఖ్యాతి పొందుతోంది. దేశంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో దేశంలోనూ, విదేశాల్లోనూ ఆసక్తి పెరిగింది. అందుకే ఇపుడు అమరావతి ఓ ట్రేడ్ మార్క్ సింబలైపోయింది, ఒక బిజినెస్ మోడల్ అయింది. ఆధునాతన నిర్మాణాలకు, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ముఖ్య కేంద్రం కాబోతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారనుంది. పరమశివుడు అమరేశ్వరునిగా కొలువైన దివ్యధామానికి సమీపంలో ఏర్పాటవుతున్న కొత్త రాజధాని ఇప్పుడు పెట్టుబడిదారులకు కేంద్ర బిందువుగా మారుతోంది.
అలనాడు శాతవాహనుల కాలంలో విరాజిల్లిన అమరావతి ప్రాంతం రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా రూపుదిద్దుకునేందుకు ఇప్పటికే బలమైన పునాదులు పడ్డాయి. ‘అమరావతి వర్థిల్లాలి’ అన్నది ఇప్పుడు ప్రజల మాట. తమ ఆకాంక్షలు తీరేలా ఈ నగరం ఆవిర్భవించాలని నవ్యాంధ్ర వాసులు ఎదురు చూస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు, ఎపిలోని మిగతా జిల్లాల్లోనూ అమరావతి పేరు విన్పిస్తోంది.
ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి ‘అమరావతి’ పేరును జోడిస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతోనో, దేవుళ్ల పేర్లతోనో వ్యాపారాలు మొదలుపెట్టే స్థానికులకు ఇప్పుడు ‘అమరావతి’ పేరును బ్రాండ్ నేమ్‌గా ఉపయోగించుకోవడం అమరావతి క్రేజ్‌ను తెలియజేస్తోంది. కొత్త వ్యాపారానికి కాసులు కురిపిస్తుందని వారు నమ్ముతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 200కుపైగా వ్యాపార నిర్వాహకులు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అమరావతి పేరుతో తమ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, హోటళ్లు, రిసార్టులు, ఆసుపత్రులు, ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ఏవైనా కానివ్వండి.. బ్రాండ్ నేమ్ ఒక్కటే- అమరావతి.
వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా పేరు మాత్రం ‘అమరావతి’ ఉండేలా చూసుకుంటున్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర క్రితం రాజధాని నగరంగా అమరావతి పేరు ప్రకటించముందు చాలామందికి గత చరిత్ర తెలియదు. శాతవాహన రాజుల కాలంలో ఇక్కడో పట్టణం ఉండేదని ఇపుడు తెలుసుకుంటున్నారు. అప్పటి వైభవం ఇపుడు రావాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఇప్పుడు అమరావతి పేరుతో వెలుస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలకు లెక్కే లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజల్లో రాజధాని క్రేజ్ పెరుగుతూ వస్తోంది. దానికి చిహ్నమే అమరావతి పేరుతో వెలుస్తున్న దుకాణాలు. అమరావతి పేరు పెట్టుకోవడంవల్ల తమ వ్యాపారాలకు మంచి మైలేజ్ వస్తుందనే భావనలో స్థానికులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మంచి ఆదరణ పొందింది. ఈ ఫెస్టివల్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులను భారీ డిస్కౌంట్లకు ఇవ్వడంతోపాటు సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఆర్టీసీ అమరావతి పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతోంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం అమరావతి పేరుతో సర్వీసులను నిర్వహిస్తున్నాయి. స్థానికులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ మా రాజధాని పేరుతో మేం వ్యాపారాలు చేస్తే తప్పేంటి? రాజధానికి మరింత ఊతమొస్తుందన్న నమ్మకంతోనే అమరావతి పేరు పెట్టుకున్నామని ప్రజలు చెప్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు అమరావతి పేరు రోజురోజుకూ పాపులర్ అవుతూ వస్తోంది. వెలగపూడిలో తాత్కాలిక రాజధాని అందుబాటులోకి రావడం, శాశ్వత భవనాలకు ఇటీవలే శంకుస్థాపన జరగడంతో రాబోయే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది.

-శివప్రసాద్ లేళ్ల