సబ్ ఫీచర్

బోధనా మాధ్యమంగా మాతృభాషే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభాష అంటే స్వంత భాష. సాధారణంగా వ్యక్తులకు తమ తల్లిదండ్రులు మాట్లాడే భాషే మాతృభాష అవుతుంది. శిశువు మరొక భాషా ప్రాంతంలో ఉండి పెరగడం జరిగితే అక్కడి ప్రజల భాష అలవడితే ఆ భాషే ఆ శిశువు మాతృభాష ఆ ప్రాంతపు భాషే అని చెప్పవచ్చును.
పాఠశాలలో విద్యార్థి భాషేతర విషయాలను నేర్చుకొనేటప్పుడు బోధనకు ఉపయోగించే భాషను బోధనా భాషా చెప్పడం జరుగుతుంది. దీనినే బోధనా మాధ్యమం అని కూడా అంటారు. నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావగ్రహణ భావ వ్యక్తీకరణలకు మాతృభాషపైనే ఆధారపడతాడు. ఒకటికంటె ఎక్కువ భాషలు తెలిసిన వ్యక్తి అయినా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు మా తృభాషలోనే ఆలోచిస్తాడు. బోధనా భాషగా ఉండటానికి మాతృభాషే అనుకూలం. పరభాషలుకావు. నేర్చుకొనే విషయం క్రొత్తదీ, బోధనా మాధ్యమం కూడా క్రొత్తదీ అయితే భావకాఠిన్యానికితోడు భాషాకాఠిన్యం కూడా తోడై విద్యార్థికి శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థికి అర్థం కాకుండానే కంఠస్థం చేయవలసి ఉంటుంది.
విద్యావ్యవస్థలో మాతృభాషే మాధ్యమ భాషగా బోధనా భాషగా బోధనావాహికంగా రూపొందాలని అనేక విద్యాసంఘాలు అభిప్రాయపడ్డాయి. 1929వ సంవత్సరం హార్టగ్ కమిటీ నివేదిక, 1936 ఉడ్సు కమిటి నివేదిక 1948వ సంవత్సరం విశ్వవిద్యాలయ విద్యాసంఘం, 1952 సెకండరీ విద్యాసం ఘం, 1986వ సంవత్సరం జాతీయ విద్యావిధానం బోధనా భాషగా మాతృభాష ఉండాలని, దాని ఆవశ్యకతను నొక్కి చెప్పింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి సంవత్సరంలో ఏర్పడిన రాధాకృష్ణన్ కమిటీ నుండి 1964 కొఠారీ కమిషను ఉన్న సంఘాలన్నీ అన్ని దశలలోనూ బోధనా భాషగా మాతృభాషనే ఉపయోగించాలని నొక్కిచెప్పాయి.
రవీంద్రుడు ‘‘పరభాష ద్వారా విద్యాబోధన సోపానాలు లేని సౌధం వంటిది’’ అని అన్నారు. విశ్వవిద్యాలయాలలో తెలుగును బోధనా భాషగా ప్రోత్సహించాలని గ్విన్ సంఘం సిఫార్సు చేసింది. మాతృభాషే బోధనా భాషగా ఉండాలని గాంధీ నొక్కివక్కాణించారు. గాంధీజీ ‘‘నేనే నియంతనైతే మన బాల బాలికలకు పరభాషా మాధ్యమం ద్వారా బోధించడం నిలిపివేస్తాను’’, ఈ దుస్థితికి తక్షణ చికిత్స అవసరం’’ అని కూడా అన్నా రు. విశ్వకవి రవీంద్రుడు, తిలక్, రాజేంద్రప్రసాద్, డా.జాకీర్ హుసేన్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి భావాలనే వ్యక్తం చేసారు.
1986వ సంవత్సరం నాటి జాతీయ విద్యావిధానం మాతృభాషలోనే బోధన జరగాలని అప్పుడే సమగ్ర మానవ వ్యక్తిత్వానికి రూపకల్పన జరుగుతుందనీ చెప్పింది. విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన మాధ్యమంగా ప్రాంతీయ భాషలని వినియోగించినట్లయితే దేశంలో ఉన్న ప్రతిభా వికాసం తరుగుముఖం పడుతుందని కొఠారీ కమిషను చెప్పింది. తల్లిపాలు తాగి పెరిగిన బాలుడికీ దాది పాలు త్రాగి పెరిగిన బాలుడికీ ఎలాంటి భేదముంటుందో స్వభాషలో శాస్త్ధ్య్రాయనం చేసిన వారికీ పర భాషలో జ్ఞానార్జన చేసిన వారికీ అటువంటి భేదమే ఉంటుందని కొమర్రాజు లక్ష్మణరావుగారు అన్నారు.
ఆంగ్ల మాధ్యమంగా బోధన జరుగుతున్న పాఠశాలల్లో చదువుకొన్న విద్యార్థుల భాషా వ్యవహారాన్ని గమనించినట్లయతే విచారం కలుగుతోంది. కొంతకాలానికి కొన్ని తెలుగు మాటలు మరుగునపడిపోయే ప్రమాదమున్న దని ఆందోళన కలుగుతోంది. అట్టి విద్యార్థులతో సంభాషించునప్పుడు ప్రసంగ వశాన కొన్ని తెలుగు మాటలను గాని అంకెలను గాని చెప్పినట్లయతే వాటిని మాతృభాషలో ఏమంటాలో తెలియక తికమకపడుతుం టారు. ఎనిమిది, తొమ్మిది అంకెలు తెలుగులో అన్నప్పుడు వారికి అర్థంకాదు. బొద్దింక అన్న తెలియదు, కాక్రోచ్ అనాలి. సాలీడును చూచిన స్పైడరు అనాలి. పై ఉదాహరణలు మన తెలుగు మాటలను తెలుగు పిల్లలకు తెలియుటలేదని చెప్పడానికి పై ఉదాహరణలు పేర్కొన్నాను. అంకెలను తెలుగులో పలుకడం మన పిల్లలకు (ఇంగ్లీషు మీడియంలో చదివిన వారికి) తెలియదు. తెలుగు పేర్లు తెలియవు. తెలుగు వారములు, తిథులు తెలియవు. డాడీ- మమీ సంస్కృతికి అలవాటుపడి కృత్రిమ వాతావరణములో పెరుగుతున్నారు. ‘‘నాన్న, అమ్మ’’ అను బోధనలోని మాధుర్యాన్ని తల్లిదండ్రులు దూరమవుతున్నారు. ఆంగ్లాన్ని నేర్చుకొనవచ్చు. ఆ భాషను నేర్పునప్పుడు తరగతి గదిలో మాత్రం ఆంగ్ల వాతావరణాన్ని కల్పించవచ్చు. కాని నేటి ప్రయివేటు పాఠశాలల్లోనూ, కానె్వంటులలోనూ పిల్లలు అడుగుపెట్టింది మొదలు నిష్క్రమించేవరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలని నిర్బంధం విధిస్తున్నారు. ఆ బా లలు మాతృభాషలో మాట్లాడినట్లయతే దండిస్తున్నారు. దీనివల్ల తెలుగు భాషను వ్యక్తీకరించడంలో నిత్యం వాడుకలోని పదా లను కూడా మరచి ఆంగ్ల పదాలనే వాడుతున్నారు. ఇట్లాంటివి నేటి టీ.వి. కార్యక్రమాల్లో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు ట్రయి చేస్తాను వంటి పదాలు ఎన్నో వినడానికి వెగటుగా ఉంటాయి. ఇంగ్లీషులోని మాటలు తెలుగులో ప్రవేశించి రూఢమైవున్న వాటిని ఆవిధంగానే వాడుకొనడం సముచితమే కాని అన్ని తెలుగు పదాలను త్యాగం చేయాల్సిన పనిలేదు.
బహుభాషాభ్యసనం బాలలకు భారం అనుకోవడం సముచితం కాదు. హాలండు పాఠశాలల్లో నాలుగు, స్విట్జర్లాండు దేశంలో మూడు భాషలు నేర్పబడుతున్నాయి. రష్యా లో కూడా బహుభాషాభ్యసనం ఉంది. భాషలను నేర్చుకోవడంలోను, నేర్పడంలోనూ తప్పులేదు, కాని వేలంవెర్రిగా వ్యామోహం పెంచుకోవడం, మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే దోషం.
ఈనాడు గొప్ప భాషగా, ప్రపంచ భాషగా కీర్తింపబడుచున్న ఇంగ్లీషు పరిస్థితి ఒకప్పుడు ఎలాగ ఉండేదో చూద్దాం. తెలుగులో కవిత్రయం వారు కావ్యసృష్టి చేస్తున్న కాలంలో ఇంగ్లీషు రూపకల్పన కాలేదు. పాఠశాలల్లో క్రీ.శ.1350వ సంవత్సరంలో ప్రవేశపెట్టేదాకా ఇంగ్లీషు దేశవాళీ సరుకుగా చిన్నచూపు చూపబడింది. 14వ శతాబ్దం ఆఖరున మాత్రమే ఇంగ్లీషు భాషకు స్వదేశంలో పార్లమెంటు ప్రవేశం లభించింది. నేడు మన ఇంగ్లీషు వ్యామోహం లాగే నాడు వాళ్ళ దేశంలో ఫ్రెంచి, లాటిన్ భాషలు వ్యామోహం ఉండేది. నేటి మన ప్రాంతీయ భాషల స్థితిలోనే మూడు, నాలుగు వందల ఏండ్ల క్రిందట ఇంగ్లీషు పరిస్థితి ఉండేది. ఆంగ్ల భాషను ఆశ్రయించుకుని అద్భుత రచనలు చేసిన మహారచయితలూ, మాతృభాషాభిమానులై లోకం నలుమూలలా వ్యాపించిన ఆంగ్లేయులూ ఇరుకు భావాలు, భాషా నియంత్రణలూ విడనాడి స్వేచ్ఛగా తమ భాషను ఎదగనిచ్చిన దృక్పథం వంటివి ఆ భాషా ఔన్నత్యానికి తోడ్పడ్డాయి. ఆంగ్ల భాషలో నేడు మనకు ఫ్రెంచి, అరబ్బీ మొదలైన భాషల నుండి వచ్చి న పదాలు ఆయా భాషలకు తద్భవాలో అనుకృతులో అని గమనించగలం. ఇంగ్లీషులో ఇంగ్లీషుపాలు ఎంత తక్కువో గమనిస్తే ఆశ్చ ర్యం వేస్తుంది. ఉదాహరణకు సిరఫ్, సోఫా, షుగర్ వంటివి ఇంగ్లీషులో వాడబడుతున్న అరబ్బీ పదాలని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
అదేవిధంగా ఏ భాషైనా కలకాలం నిలవాలంటే, ఎప్పటికప్పుడు ఇతర భాషా పదాలను కూడా తనలో ఇముడ్చుకోగలగాలి. కేవలం ఈ కారణంగానే ఇంగ్లీషు ప్రపం భాష గా మనగలుగుతోంది. మరి అదే ప్రపం చంలో అత్యధికులు మాట్లాడే చైనా భాష ఎందుకు అంతటి ప్రాచుర్యం పొంద లేకపో తున్నది? ఇందుకు భౌగోళిక, రాజకీయ, భాషారమైన అనేక కారణాలుండవచ్చు. కానీ భాష మనుగడకు మాత్రం మార్పులు అవసరం.

- ముడుంబ వేణుగోపాలాచార్యులు