సబ్ ఫీచర్

పన్ను రాయతీ.. రాజధాని రైతుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికి, రైతుకూ వుండే అనుబంధం భూమిని దునే్నవారికి తెలుస్తుంది. రైతు కుటుంబాలకి, అటువంటివారితో కూడిన సమాజానికే తెలుస్తుంది. సిద్ధాంతాలు చెబుతూ ఉపన్యాసాలిచ్చేవారికి, గణాంకాలు చెప్పేవారికీ తెలియకపోవచ్చు. ప్రాచీనకాలం నుంచీ భారతదేశంలో రైతులు తమకున్న భూమిని పెంచుకోడానికే ప్రయత్నించారు. ఒక రైతుకు ఒక ఎకరం పొలముంటే, తినీ తినక పొదుపు చేసి మరో ఎకరం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో మొత్తం కుటుంబమే ఎన్నో అవసరాలను త్యాగం చేస్తుంది. ఏదో ఆర్థిక ఇబ్బంది, తప్పనిసరి అవసరమూ కలిగితే తప్ప రైతులు భూమిని అమ్ముకోరు, విడిచిపెట్టరు. ఇటువంటి అనుబంధం, క్రమశిక్షణ రైతు సమాజంలో వుంది కనుకనే అన్ని ఇతర వృత్తులవారికీ సరిపడినంత ఆహార ధాన్యాలను పండించి సమకూరుస్తున్నారు రైతులు.
ఇంతటి అనుబంధం కలిగిన పొలాలను- సుమారు 32 వేల ఎకరాల భూమిని- నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం, అమరావతి ప్రాంతానికి చెందిన కొన్ని వేల రైతు కుటుంబాల వారు ప్రభుత్వానికి పెద్దమనసుతో అందజేశారు. ‘ఎకరానికి ఎంత ధర ఇస్తారు?’ అని అడగలేదు. ఎన్నో తరాల నుంచి అనువంశికంగా వస్తున్న వ్యవసాయ సంస్కృతిని పక్కకుపెట్టి, సెంటు పొలాన్ని కూడా మిగల్చుకోకుండా ఆంధ్ర రాజధాని నిర్మాణానికిచ్చేశారు. రాజధాని కోసం ఆ భూములవసరమని ఏపి ముఖ్యమంత్రి వారికి చెప్పారు. మంచి ధరకు కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెప్పారు. ఆ భూములకు ప్రతిఫలంగా డబ్బు ఇవ్వలేమని అన్నారు. వారిచ్చిన భూముల నుండే ఎకరానికి 125 గజాల స్థలాన్ని వారికి కేటాయిస్తామన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యేటప్పటికి ఆ స్థలాల ధరలు బాగా పెరుగుతాయని, ఆ విధంగా వారికి లబ్ధి చేకూరుతుందని నచ్చచెప్పారు. ముఖ్యమంత్రి, ఇతర నాయకుల మాటలపై నమ్మకముంచి, ఎటువంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ముందుగా తీసుకోకుండానే 32 వేల ఎకరాల భూమిని రైతు కుటుంబాల వారు ప్రభుత్వానికి అందజేశారు.
అప్పటికే రాజధాని ప్రాంతంలో భూములు చాలా ఎక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలవారు ఇవ్వవద్దని ప్రేరేపించినా కూడా రాజధాని కోసం ప్రభుత్వం మీద నమ్మకంతో వారు తమ భూములనిచ్చేశారు. అలా ఇచ్చారు కనుకనే ఇప్పుడక్కడ రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఈ భూములు కృష్ణానదీ తీరంలో ఉన్నాయి. వాటిలో రైతులు ఏడాదికి రెండు, మూడు పంటలు వేసేవారు. ఆహార ధాన్యాలతోపాటు, కూరగాయలు, వ్యాణిజ్య పంటలూ సాగుచేసేవారు. రైతులకు ఆ భూములమీద ఎవరి స్థాయిని బట్టి వారికి సరిపడినంత ఆదాయం వచ్చేది. ఇలాంటి వితరణతో, భారీతనంతో పొలాలనిచ్చిన రైతులు, వారికి కేటాయించిన స్థలాలను అమ్ముకున్నపుడుగాని, కుటుంబంలోనే పంపకాలు జరుపుకున్నపుడు గాని, ఇతర లావాదేవీలపై కాని కేపిటల్ గెయిన్స్ టాక్సు (మూలధనం మీద వచ్చే లాభం మీద వేసే పన్ను) వేయవద్దని రైతులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను గతంలోనే కోరారు. ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతులు సమర్పించాలనుకున్నారు. ఇది చాలా న్యాయమైన కోరిక. దేశం కోసం తమ భూములను, పారంపర్యంగా వస్తున్న వ్యవసాయ వృత్తిని త్యాగం చేసిన ఆ రైతు కుటుంబాలపై ఇలాంటి పన్ను ఏ రూపంలో, ఏ పద్ధతిలో వేసినా అది అన్యాయమే అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి అటువంటి పన్నులేవీ పడకుండా చూస్తానని రైతులకు హామీనిచ్చారు.
అందుకనుగుణంగానే ఈ నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి అమరావతి ప్రాంత రైతుల స్థలాల అమ్మకాలపై కేపిటల్ గెయిన్ టాక్స్ లేకుండానే మినహాయింపునిచ్చారు. అంతవరకూ బాగానే వుంది. రైతులకు కేటాయించిన స్థలాలను రెండేళ్ళలోపు వారు అమ్ముకుంటేనే ఈ టాక్సు మినహాయింపు వర్తిస్తుందని, రెండేళ్ళు దాటాక అమ్మితే పన్ను తప్పదని నిబంధన పెట్టారు. ఇక్కడే అసలు మెలిక వుంది. రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందా? రాజధాని విస్తృత స్థాయికి రానంతవరకూ అక్కడ స్థలాల ధరలు పెరగవు. రాజధాని అంటే- సచివాలయం, అసెంబ్లీ భవనం, కొన్ని ఆఫీసులు మాత్రమే కాదు, రాజధానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన. ఉన్నత స్థాయి విద్యా సంస్థలు, కోర్టులు, పరిశ్రమలు, వాణిజ్యం, నివాస భవనాలు, రోడ్లు మొదలైన అనేక కట్టడాలు అక్కడ ఏర్పడాలి. వీటి నిర్మాణం ఒక నిర్దిష్ట స్థాయికైనా రావాలి. ఎంత వేగంగా చేసినా మరో ఏడెనిమిదేళ్లకుగాని ఒక నిర్దిష్టరూపం ఏర్పడదు. ఇప్పటికీ టెండర్లు పిలవడం అనే స్థాయిలోనే వుంది కదా! దీన్ని బట్టి రాజధాని నిర్మాణానికి ఎంతకాలం పడుతుందో అర్థమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు రెండేళ్లు మాత్రమే ఇచ్చింది కనుక ఈ రెండేళ్లలోపునే అసలు ధర వచ్చినా రాకపోయినా వారు తమ స్థలాలనమ్ముకోవాలా? అలా అమ్మితే వారు పొందవలసిన లబ్ధిని పొందరు సరికదా, నష్టపోతారు. రాజధాని నిర్మాణం ఒక స్థాయికి వచ్చాక, ధరలు కాస్త పెరిగాకా అమ్ముకుంటే పన్ను మినహాయింపు వర్తించదు. అప్పుడు కేపిటల్ గెయిన్స్ కట్టవలసిందే. ఈ విషయాన్ని ఆ రైతులు గ్రహించారు. వారు ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లారు. పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి, ఇతర మంత్రులకూ కృతజ్ఞతలు చెప్పారు. వారికి శాలువాలు కప్పి సన్మానించారు. నిజానికి, రైతులు అధినాయకులకు కృతజ్ఞతలు తెలపడం కాదు, అధినాయకులే ఆ రైతులకు కృతజ్ఞతలు చెప్పి సన్మానించాలి. ఎందుకంటే ఆనాడు అన్ని పార్టీలవారూ రాష్ట్రాన్ని బలవంతంగా విభజించి, ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారు. అటువంటి ఆపత్తు వేళ, ఈ రైతులందరూ తమకు అత్యంత విలువైన భూములను రాజధాని కోసమిచ్చి ప్రజలను ఆదుకున్నారు.
ఢిల్లీ అధినాయకులకు కృతజ్ఞతలు చెప్పిన సమయంలోనే, ఆ రైతులు పన్ను మినహాయింపు పరిమితిని రెండేళ్లు కాకుండా మరికొంతకాలం పెంచమని విజ్ఞప్తి చేశారు. కేంద్ర నేతలు పరిమితిని ఒకటి రెండేళ్లు పెంచినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికీ రాజధాని నిర్మాణం నిర్దిష్ట స్థాయికి చేరదు. అందువలన రైతులిచ్చిన భూమిని బట్టి వారికి కేటాయించిన నివాస, వాణిజ్య స్థలాలను వారు మొదటిసారి అమ్మేవరకూ (్ఫస్ట్ సేల్) కేపిటల్ గెయిన్స్ టాక్స్ మినహయిస్తూ చట్టబద్ధం చేయాలి. రైతు తన స్థలాన్ని మొదటిసారిగా 2 లేక 4 లేక 10 ఏళ్ళకు అమ్మవచ్చు. కుటుంబాల్లోని వారు పంపకాలు చేసుకోవచ్చు. అలా రైతునుండి మొదటిసారి అమ్మకం అయ్యాక, తర్వాత జరిగే అన్ని అమ్మకాలపైనా ఆ పన్ను వేయవచ్చు. ఇది రైతులకు చేయవలసిన సమన్యాయం. ఈ న్యాయం తెలవడానికి ఆర్థిక శాస్త్రం, పన్నుల శాస్తమ్రూ తెలియనక్కరేలేదు. ఒక సాధారణ మనిషికి కూడా తెలిసిన సమన్వయ సూత్రం! ఇందుకోసం ఆ రైతులెవరినీ కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని అభ్యర్థించనవసరం లేదు. ఇది వారి హక్కు! రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని పురస్కరించుకొని ఈ వెసులుబాటును కలిగించేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం.

-మనె్న సత్యనారాయణ