సబ్ ఫీచర్

అమ్మభాషను అక్కున చేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికత పేరుతో పాశ్చాత్య భావాలను అణువణువునా వొంటపట్టించుకున్న పాలకులు, కొందరు మేధావులు మాతృభాషను ‘మృతభాష’గా మార్చటానికి ఏ మాత్రం సందేహించటం లేదు. తెలుగువారమని చెప్పుకోవటానికి, తెలుగు భాష మాట్లాడటానికి గర్వించాలే తప్ప మొహమాట పడకూడదు. ఇతర రాష్ట్రాల వారికి వాళ్ల భాషలపై వున్న గౌరవం, మమకారం తెలుగువారికి ఎందుకు అలవడటం లేదు. మనకు ఆంగ్లభాషపై వ్యామోహం, మోజు మరీ ఎక్కువ కాబట్టి. తెలుగులో మాట్లాడితే విద్యావిహీనులుగా, చులకనగా చూస్తారనే భయం కాబట్టి. అన్నిటికీ మించి మన మాతృభాష అంటే మనకు ఎలాంటి ఆసక్తి లేదు కాబట్టి. కన్నతల్లిని గౌరవించటం ఎంత ముఖ్యమో మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా అక్కున చేర్చుకోవటం కూడా అంతే అవసరం. ‘స్పూన్ ఫీడింగ్’కు అలవాటుపడిన వాళ్ళకు అమ్మ చేతి గోరుముద్దులోని కమ్మదనం ఎలా తెలుస్తుంది?
ఆంగ్లభాష నేర్చుకోవటం తప్పుకాదు. ఏ భాషనైనా మనం గౌరవించి తీరాలి. ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. కానీ, అమ్మభాష అయిన తెలుగును చులకనగా చూడకూడదు, కించపరుస్తూ మాట్లాడకూడదు. తెలుగులో మాట్లాడే వారిని అనాగరికులుగా భావించకూడదు. పసితనంలో మాటలు నేర్చినది మొదలు అమ్మ, అత్త, తాత అంటూ సహజంగానే తెలుగులో పలకటానికి అలవాటుపడే పిల్లలకు నేటి తల్లిదండ్రులు- మమీ, డాడీ, అంకుల్, ఆంటీ అంటూ నేర్పించి వాటినే మంత్రాక్షరాలుగా భావిస్తూ ఆనందిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం ఉన్న బడులలోనే పిల్లలను చేర్పించి చిన్నప్పటినుండే తెలుగుభాషకు దూరం చేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడకూడదు. ఆంగ్లంలోనే మాట్లాడాలని తల్లిదండ్రులు తమ చిన్నారులను శాసిస్తున్నారు. కానె్వంట్లు, కార్పొరేట్ పాఠశాలల్లో అయితే తెలుగులో మాట్లాడడమే మహాపాపం. చిన్నారులెవరైనా స్కూల్‌లో పొరపాటున తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఇచ్చే పనిష్‌మెంట్ల సంగతి చెప్పనే అక్కరలేదు.
తెలుగు మీడియం ఉన్న కొన్ని పాఠశాలలు కూడా విద్యార్థుల సంఖ్యను పెంచుకోవటానికి ఆం గ్లాన్ని ఆశ్రయిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే సిలబస్ ప్రకారం 8వ తరగతి వరకే తెలుగును ఉంచి, 9, 10 తరగతులకు తెలుగును రద్దుచేస్తున్నారు. కనీసం ప్రాథమిక, మాథ్యమిక తరగతుల్లోనైనా తెలుగు భాషను క్షుణ్ణంగా అభ్యసించినట్లయితే విద్యార్థులు మాతృభాషలోని మాధుర్యాన్ని చవిచూడగలుగుతారు.
నన్నయ, తిక్కనల తెలుగు భాషా పాండిత్యం, అల్లసాని పెద్దన పదాల అల్లిక జిగిబిగి, తెనాలి రామలింగ కవి చమత్కృతి, శ్రీనాథుని కవితా సౌరభం ఇవన్నీ తెలుగు భాషలో మణిపూసల్లా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. తన మాతృభాష ‘తుళు’ అయినప్పటికీ ‘ఆముక్తమాల్యద’ గ్రం థాన్ని తెలుగులో రచించిన శ్రీకృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అంటూ ప్రశంసించాడు. ఇక ఆంగ్లేయుడైన సి.పి. బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవ ఎవరూ మరువలేనిది. ఎన్నో గ్రంథాలను వెలుగులోకి తెచ్చి తెలుగు సాహిత్యాన్ని ఆయన పరిపుష్టం చేశాడు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా, తెలంగాణ జానపద గేయాలు, బోనాలు, బతుకమ్మల సాక్షిగా, హైదరాబాద్‌లోని టాంక్‌బండ్ వద్ద విగ్రహాల సాక్షిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుభాష విశిష్టతను ఎవరూ కాదనలేరు. కూచిపూడి పద నర్తనలో, దేవాలయాల శిల్ప సౌందర్యంలో, చేనేతల పడుగు పేకల అల్లికలో, ఆవకాయ, గోంగూరల ఘుమఘుమలో, పసిపాపల పలుకుల్లో, బోసినోటి బామ్మల, తాతయ్యల ఆశ్వీరాదాలలో, మంగళహారతుల పాటలలో, తెలుగుతల్లి చిరునవ్వులో, తెలంగాణ యాసలో, నుడికారాలలో, పలుకుబడులలో, పొడుపుకథల విడుపులలో, సామెతల సొబగులలో, కాశీమజిలీ కథల్లో, వనితల చీరకట్టులో, పురుషుల పంచెకట్టులో... ఎక్కడ చూసినా తెలుగుతనం గుబాళిస్తూనే ఉంటుంది. తేనెలొలికే తెలుగు పరిమళాలు నలుదిశలా వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.
తెలుగువారై పుట్టి, తెలుగు నేలపై ఉంటూ తోటి తెలుగువారితో తెలుగు భాషలో మాట్లాడటం అవమానకరంగా, చిన్నతనంగా భావించడం హాస్యాస్పదం. తల్లిభాషపై చిన్నచూపు చూడడం నేరం. తెలుగంటే అభిమానం ఉన్నవాళ్లకు తెలుగుభాష గురించి ఎంత చెప్పినా సరిపోదు. ఎంత రాసినా తరగదు. కొంతమందికి కొన్ని విషయాలు ఒకటికి పదిసార్లు చెబితే కాని అర్థం కావు. తెలుగు భాష గురించి ఎందరు ఎన్ని విధాలుగా ప్రబోధాలు చేసినా సరిపోదు. మళ్లీ మళ్లీ వల్లెవేస్తూనే ఉండాలి. ఇలాంటివారు కొంతలో కొంతైనా మారితే, పిల్లలకు తెలుగులోని మాధుర్యాన్ని రుచి చూపిస్తే- వారు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తారు. తెలుగు భాషకు మున్ముందు కూడా గౌరవం ఇస్తారు. అమ్మభాషను అమృతంలా భావిస్తారు.

అమ్మభాష అయిన తెలుగును చులకనగా చూడకూడదు,
కించపరుస్తూ మాట్లాడకూడదు. తెలుగులో మాట్లాడే వారిని
అనాగరికులుగా భావించకూడదు.

-అబ్బరాజు జయలక్ష్మి