సబ్ ఫీచర్

విదేశీ వ్యామోహం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతగా ప్రగతి సాధించినప్పటికీ, విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలన్న భావన మన యువతలో నానాటికీ బలపడుతోంది. ‘మేకిన్ ఇండియా’ (్భరత్‌లోనే తయారీ) పేరిట స్వదేశంలోనే మన యువత అద్భుతాలు సాధించాలని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ విదేశీ వ్యామోహం తగ్గడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు విదేశాలకు వలసలను ప్రోత్సహించే విధంగానూ ఉంటున్నాయి. విదేశాల్లో విద్యనభ్యసించే ఒక్కో విద్యార్థికి భారీగా ప్రోత్సాహకాలిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. మన విద్యావ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే చర్యలు చేపట్టాలి గాని, ‘ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టిన’ట్లు మనకు నష్టం కలిగే చర్యలు తీసుకోరాదు. కనుక ప్రభుత్వాలు విద్యారంగంలో ప్రక్షాళన చేపట్టి విదేశీ వలసలు తగ్గించాలి.
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే వారిలో అత్యధిక శాతం మంది ఆర్థిక స్థోమత గల వారే. ఉన్నత చదువులు పూర్తయిన పిమ్మట అక్కడే స్థిరపడి ఆయా దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. గాని మన దేశానికి ఎలాంటి ప్రయోజనం వుండటం లేదు. ‘డాలర్ల వేట’లో తెలివైన విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారు. వారు పంపే డబ్బుతో ఇక్కడ స్థిరాస్తుల విలువలు బాగా పెరిగిపోతున్నాయి. వలసల కారణంగా తమకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయని అమెరికా వంటి దేశాల్లో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలన్నీ అమెరికన్లకే చెందుతాయని, విదేశీయులందరినీ బయటకు పంపేస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా అమెరికాలో ఇక ఉద్యోగాలు దక్కవేమోనన్న బెంగ భారతీయ యువతలో నెలకొంది. నేడు అమెరికా రేపు మరో దేశంలో ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. వరద ప్రవాహంతో పాతనీరు బయటకు పోతుందంటారు. ఈ మేధోవలసల ప్రవాహంలో ఉన్నత విద్యావంతులు, క్రమశిక్షణ, నైపుణ్యంగల యువత విదేశాలకు వెళ్లి వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. బాగా సంపాదించాలన్న ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ నానా అగచాట్లు పడుతున్నారు.
మన దేశం అమెరికా వంటి అగ్రరాజ్యాల కంటే మెరుగైన జీడీపీతో దినదినాభివృద్ధి చెందుతున్నా డాలర్‌తో పోల్చిచూస్తే మన రూపాయి విలువ పెరగటం లేదు. ఉదాహరణకు మన దేశంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొర్రలను కిలో 50 రూపాయల లోపు మన చిల్లర వర్తకులు అమ్ముతుంటే, ‘మేలైన పౌష్టికాహారం’ అని ప్రకటించుకుంటూ విదేశీ కంపెనీలు అవే కొర్రలను భారీ ధరలకు బడా సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇదంతా కేవలం మార్కెట్ మాయాజాలం. పౌరులకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు లభించే చర్యలు ప్రభుత్వాలు తీసుకుని వారి జీవన ప్రమాణాలను పెంచగలిగితే ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఉపాధి మార్గాలు పెరిగితే విదేశాలకు వలస పోవడం కొంతైనా తగ్గుతుంది. ఈ ప్రయత్నాలకు బదులు పాలకులు కేవలం జనాకర్షక పథకాలతో ప్రజలను ప్రలోభపెడుతున్నారు. కనుక పాలల్లో పంచదార లేని వారికంటే గంజి నీళ్లు కూడా దొరకని వారిని ముందు ఆదుకుంటేనే అసమానతలు అంతరిస్తాయి.

- తిరుమలశెట్టి సాంబశివరావు