సబ్ ఫీచర్

గంజాయి సాగుచేసే వారు దేశభక్తులా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కొట్టంగి తా లూకా ముంగారు గుమ్మి సమీపంలో జాతీయ రహదారిపై మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చి ఎనిమిది మంది పోలీసు శిక్షణ డ్రైవర్లను బలిగొన్నారు. ఇదే ఘటనలో మరికొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత అక్టోబర్ 24న అదే రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా రామగూడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ మందుపాతరను మావోయిస్టులు పేల్చినట్టు చాలామంది భావిస్తున్నారు. రామగూడ ఎన్‌కౌంటర్‌లో అనూహ్యరీతిలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అందరూ అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తమకు కంచుకోటగా నిలిచే బలిమెల రిజర్వాయర్ సమీపంలో 30 మంది సహచరులను పోగొట్టుకోవడాన్ని మావోయిస్టులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దాంతో వారు రగిలిపోయి, ఎవరూ ఊహించని రీతిలో జాతీయ రహదారిపై శిక్షణలో ఉన్న పోలీసు డ్రైవర్ల వాహనాన్ని పేల్చేశారు.
ఒక రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువే మావోయిస్టుల బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఒకానొక సమయంలోనైతే పెద్ద రాష్టప్రు వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులతో మావోయిస్టు పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇందులో అతిశయోక్తి సంగతి ఎలా ఉన్నా, అంత ధనం వారికి ఎక్కడి నుంచి వస్తోందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానంగా చందాలు, లేవీ, విరాళాలు.. అని కొందరు మావోయిస్టు నాయకులు చెప్పినా, అయితే అది పాక్షిక సత్యమే. మావోయిస్టుల ప్రధాన ఆదాయమార్గం బహుళజాతి సంస్థల యాజమాన్యాలను ముఖ్యంగా ఖనిజాల ఆధారంగా కొనసాగుతున్న సంస్థలను బెదిరించి, భయపెట్టి ‘కప్పం’ రూపంలో డబ్బు వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. మరో విస్మయకర వాస్తవం ఏమిటంటే- మాదక ద్రవ్యాల వ్యాపారుల నుంచి అందే నిధులు. ఈ విషయమే చాలామంది గొంతు దిగకుండా ఉంటుంది. దేశభక్తులని భావించే మావోయిస్టులు మాదక ద్రవ్యాల విషయంలో ఎలా తలదూర్చుతారు? కానీ, ఇది అమాయకుల ప్రశ్న అని ఎప్పుడో తేలిపోయింది. దశాబ్దాలుగా వారు గంజాయి సాగులో ఆరితేరారు. ఇప్పుడు దండకారణ్యంలోని ‘ఫ్రీజోన్’లో వందలాది ఎకరాల్లో గంజాయి సాగు కొనసాగుతోంది. ఇతర పంటలు పండించినా పండించకపోయినా గంజాయిని మాత్రం తప్పక సాగుచేస్తున్నారు. మల్కాన్‌గిరి జిల్లా రామగూడ సమీపాన గంజాయిని సాగు చేస్తున్నట్లు ఒక ఫొటోను ఇటీవల ఒక ఆంగ్లపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. రామగూడ పరిసర గ్రామాలు, సమీపాన అటవీ ప్రాంతాలు దండకారణ్యంలో తమకు ‘ఫ్రీజోన్’గా మావోయిస్టులు చెప్పుకుంటున్నారు. అలాంటి చోటనే విస్తారంగా గంజాయి సాగుబడి అవుతోంది. గతంలోనూ అనేక పత్రికలు ఈ విషయాన్ని ప్రకటించాయి. తూర్పు గోదావరి, విశాఖ మన్యంలోనూ గంజాయి విస్తృతంగా సాగవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంగతి ఆయా ప్రాంతాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు మరింత బాగా తెలుసు. అది రహస్యమైన వ్యవహారం కానేకాదు. ఈ ప్రాంతం నుంచి గంజాయిని రవాణా చేస్తుండగా ఇటీవల సికిందరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 142 కిలోల గంజాయిని కారులో తీసుకుని వెడుతుండగా పట్టుకున్నారు. ఆ సరకు తూర్పు గోదావరి, విశాఖ ప్రాంతానికి చెందిందని నిందితులు అంగీకరించారు.
మావోయిస్టుల కనుసన్నల్లోనే గంజాయి సాగు కొనసాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. వారి మద్దతుతోనే గంజాయి వ్యాపారులు రెచ్చిపోయి అంతర్రాష్ట్ర వ్యాపారంగా తీర్చిదిద్దారు. ఈ వ్యాపారంలో ఉన్నన్ని లాభాలు మరే వ్యాపారంలో లేవు కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు మావోయిస్టులకు అందుతోంది. డబ్బుతోపాటు గంజాయి వ్యాపారుల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా అవుతున్నాయి. ఈ ‘లైఫ్‌లైన్’ను మావోయిస్టులు ఎందుకు వదులుకుంటారు? అందుకే తూర్పు కనుమలంతటా గంజాయి దండిగా సాగవుతోంది. యువతరాన్ని నిర్వీర్యం చేసే గంజాయి అమ్మకాల డబ్బుతో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న మాట. ఇది ఎంతటి నైతిక బలంపై ఆధారపడిన వ్యవహారమో అందరూ ఆలోచించాలి.
మాదక ద్రవ్యాలు, ఆధునిక ఆయుధాలు, విధ్వంసం, పేలుళ్లు.. ఇవి దేశ నిర్మాణానికి ఉపకరించేవి కావన్న సంగతి ఆరోగ్యకర ఆలోచనలున్న వారందరికీ తెలుసు. కానీ, ఈ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు కొందరు విద్యావంతులు, న్యాయవాదులు సైతం వంతపాడుతుంటారు. వారి విధ్వంసకాంతను సమర్ధిస్తున్నారు. నరమేధాలను శ్లాఘిస్తున్నారు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా నేరుగా గాక పోయినా ఆదివాసీల హక్కుల మాటున మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతరకు అసంఖ్యాకంగా ఆదివాసీలు హాజరయ్యారు. వారిలో చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఆ ఆదివాసీలను చూస్తుంటే వారిపై పాలకులు కర్కశకంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించలేదు. సంప్రదాయ పద్ధతిలో ముచ్చటగా మూడురోజులపాటు తమ ఆరాధ్యదేవతకు మొక్కులు చెల్లించి వారు తమ తమ ప్రాంతాలకు తరలి వెళ్ళారు. విశేషమేమిటంటే నాగోబా జాతరలో ఆధునికతకు చిహ్నంగా భావించే ‘వైఫై’ సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. జిల్లా యంత్రాంగం దర్బార్‌ను నిర్వహించింది. వైఫై సౌకర్యాన్ని ఆదివాసీ యువత ఉపయోగించుకుంది. అవసరమైన వారితో మాట్లాడి, డేటాను బడ్వాటా చేసింది. ఒకప్పుడు ఇదే కేస్లాపూర్‌లో అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ తమ ప్రాపకం కోసం పడరానిపాట్లు పడ్డారు. ఆ పరిచయాలను ఉపయోగించుకుని, మరిన్ని దారుల గుండా దండకారణ్యంలోకి ప్రవేశించి ఆదివాసీల భుజాలపై ఆ పార్టీ తుపాకులు పెట్టి కాల్చుతోంది. ఆదివాసీలను దళాలుగా ఏర్పరచి యుద్ధానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎందరో ఆదివాసీలు ఈ ఘర్షణకు ఆహుతయ్యారు. రాబోయే రోజుల్లో మరెంతమంది ఆహుతి కానున్నారో తెలియదు! పైగా అలా ఆహుతైన వారు ‘రాజ్యం’ దౌర్జన్యం కారణంగా, హింస కారణంగా, దాష్టీకం కారణంగా మరణించారన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. నాలుగుసార్లు ఒక విషయాన్ని ప్రస్తావిస్తే అదే సత్యమని భావించే మానవ స్వభావాన్ని గుర్తించి, ఆ ప్రచారంగా మావోయిస్టు మద్దతుదారులు మునిగిపోయారు. మావోయిస్టుల కనుసన్నల్లో పనిచేసే అనేకమంది మేధావులు నగరాల్లో ఉంటూ ఈ బాధ్యతను సమర్ధవంతంగా దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఉన్నారు.
మావోయిస్టుల మూలాలు ఎక్కడెక్కడ పాకి ఉన్నాయో తెలియనివారు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా నిష్పక్షపాతంగా జరుగుతున్నదనే భ్రమల్లో ఉంటున్నారు. కానీ, అది సత్యం కాదని కొంత నిశితంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మావోయిస్టులకు కష్టం, నష్టం కలిగినప్పుడు ఆ ప్రచారం మరింత పెద్ద మోతాదులో జరగడమంటే అందులో తిరకాసు ఏమిటో ఇట్టే ఊహించవచ్చు. మావోయిస్టుల నరమేధం జరిగినప్పుడు గాని, ఇటీవల జాతీయ రహదారిపై అమాయక పోలీసు డ్రైవర్లు మరణించినప్పుడు గాని , ఇన్‌ఫార్మర్ల నెపంతో ఎక్కడో అక్కడ ఆదివాసీలను మావోయిస్టులు కాల్చి చంపినా ఒక్క సానుభూతి వాక్యం వారి నుంచి వెలువడదు. ఫిబ్రవరి మాసంలో తూర్పుగోదావరి జిల్లా ఒకరిని చంపారు. అయితే, ఈ అకృత్యాల గురించి వాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ మాత్రం కనిపించదు. దాంతో వారంతా నిష్పాక్షిక వాదులో, మేధావులో, హక్కుల పరిరక్షకులో, కళాకారులో, ప్రొఫెసర్లో, అడ్వకేట్లో ఇట్టే అవగతమవుతుంది.
గంజాయి సాగుతో యువతరాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉన్న మావోయిస్టులు విచ్ఛిన్నకర శక్తులతోనూ అంటకాగుతున్నారు. ఈ విషయం కూడా రహస్యమేమీ కాదు. అటు జమ్ము-కాశ్మీర్ ఉగ్రవాదులకు, ఇటు ఈశాన్య ప్రాంత వేర్పాటువాదులకు మావోయిస్టుల పూర్తి మద్దతు ఉంది. అవసరమైన సహాయాన్ని వారి నుంచి అందుకుంటున్నారు. అంటే ఏ రకమైన దేశభక్తిని, నైతికతను, మంచితనాన్ని మావోలు ప్రబోధిస్తున్నారో దీనితో తేటతెల్లమవుతోంది.
దీనికి విశ్వవిద్యాలయాల్లోని కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులు, కవులు, కళాకారుల మద్దతు ఉండటం వారి వ్యక్తిత్వంపై, వారి సమగ్రతపై, వారి మానసిక స్థితిపై పెను అనుమానాలు కలిగిస్తోంది. దేశాన్ని సర్వనాశనం చేసే హక్కు ఈ విధ్వంసకారులకు ఎవరు ఇచ్చారని ప్రతి పౌరుడు, దేశభక్తుడు ప్రశ్నించాల్సిన తరుణం ఇది.

-వుప్పల నరసింహం