సబ్ ఫీచర్

ఆలోచించి.. అమెరికా వెళ్లండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశ, కాలమాన పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రజల అవసరాలు, పెరుగుతున్న సాంకేతికత, ప్రభుత్వ విధానాలు, మారుతున్న విలువలు, సామాజిక పరిణామాలను బట్టి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం కూడా మన పద్ధతులను, ప్రణాళికలను, జీవితాశయాలను మార్చుకోవలసి వస్తుంది. లేకుంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఇది ప్రవాస భారతీయులుగా విదేశాల్లో ఉంటున్న విద్యార్థులకు, ఉద్యోగులకు వర్తించే అతి ముఖ్య విషయం. ఇటీవల అమెరికాలో ప్రభుత్వం మారగానే అకస్మాత్తుగా మారిన పరిస్థితులు, ‘వీసా’ల గురించి కొత్తగా పుట్టుకొస్తున్న ఆదేశాలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీత భావాల ప్రభావం ఫలితంగా జాత్యహంకారంతో మైనార్టీల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే పై మాటలు నిజం అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసి వస్తుంది.
ఒకప్పుడు అమెరికాలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నం. నిన్నమొన్నటి దాకా కూడా భారతీయులకు అమెరికా అంటే భూతల స్వర్గం! ఇంతకుముందు చాలా తక్కువ సంఖ్యలో భారతీయ యువత డాలర్ల సంపాదనకు అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోతే.. ఇప్పుడు ఇంటికి ఒకరో ఇద్దరో లెక్కన కుప్పలుతెప్పలుగా అన్నట్టు అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతున్నారు. పిల్లల్ని అమెరికా పంపించి వాళ్లు సంపాదించే జీతాలకు మురిసిపోతూ, ‘మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడ’ని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి ఇది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఇబ్బందులను, ఒంటరితనాన్ని, నిస్సహాయతను తెచ్చిపెట్టే విషయం. కొడుకులు, కోడళ్లు, మనవళ్ళతో హాయిగా, నిశ్చితంగా కాలం గడపాల్సిన వయసులో బిక్కుబిక్కుమంటూ వృద్ధాశ్రమాల్లో దిక్కులేనివాళ్ళలా పడి వుండవల్సి రావటం ప్రేమరాహిత్యపు బతుకులకు నిదర్శనం! అయినా, కొడుకులు అమెరికా వెళ్ళటం.. తల్లిదండ్రులూ అం దుకు ప్రోత్సహించడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది.
కొన్ని దశాబ్దాల నుంచీ ‘అమెరికా వెళ్ళటం అంటే అమలాపురం వెళ్ళినంత ఈజీ..’ అన్నట్లుగా వీసా రూల్స్ ఉంటూ వస్తున్నాయి. షా పింగ్ మాల్స్‌లో, స్టార్‌బక్స్‌లలో, రెస్టారెంట్స్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటానికి వెళ్ళినవాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా కంపెనీల్లో పనిచేయటానికి వెళ్ళినవాళ్ళు, విద్యార్థులుగా ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళతో- ‘అమెరికాలో ఎక్కడ చూసినా మనవాళ్ళే’ అన్నట్టుగా వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. మన భారతీయులు అక్కడికి వెళ్ళింది ముందు ఉపాధి కోసమే అయినా, రానురాను మన సంస్కృతి, సంప్రదాయాలను, మన ఆచారాలను, అలవాట్లను, నమ్మకాలను అక్కడ కూడా విస్తృతపరచటం మొదలుపెట్టారు. ఇళ్ళు, కార్లు కొనుక్కుని స్థిరపడటమేగాక గుళ్ళు, గోపురాలు, మందిరాలు కట్టించుకోవడం సాహిత్య సంస్థలు, సేవాసంస్థలు పెట్టుకుని సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకోవటం.. పండుగలు, పబ్బాలు, పేరంటాలు, వేడుకలు ఆర్భాటంగా జరుపుకుంటూ అక్కడో ‘మినీ ఇండియా’ను నిర్మించుకున్నారు.
అమెరికా వాళ్ళది కష్టపడేతత్వం కాదనీ, మనకు ఉన్నన్ని తెలివితేటలు వాళ్ళకు లేవనీ అనుకుంటూ సంబరంగా మన యువత శారీరక, మేధాశక్తిని అక్కడికి ఎగుమతి చేయడంతో ఆ దేశం బాగా అభివృద్ధి చెందింది. కానీ, దానివల్ల స్వదేశానికి ఎంత భారీ నష్టం కలిగినా అప్పుడు ఎవ్వరూ అంతగా స్పందించలేదు. ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్టు అమెరికా తరలివెళుతున్న మనవాళ్ళ శక్తిసామర్థ్యాలు విశ్వరూపం దాల్చి గుండెలు బాదుకునే స్థితికి చేరడంతో ఈమధ్యనే అందరూ గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు, అచ్చంగా ఇవే పరిస్థితులు రివర్స్‌లో ఇప్పుడు అమెరికావాళ్ళ గుండెల్లోనూ చేరిపోయి- ‘వీళ్ళను ఇలా పెరగనిస్తే రేపు మనగతేంటి...?’అన్న భయానికి అవకాశం ఇస్తున్నాయి. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ‘మనదేశంలో మనమే మైనార్టీలము అయిపోమా?’ అన్న ఆలోచన, భవిష్యత్‌పై భ యం చాలామంది అమెరికన్లలో కొద్దిరోజులుగా మొదలైంది. దాని పర్యవసానమే ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు! అలాంటి భావాలనే ఎప్పటినుంచో గుండెలో నింపుకుంటూ వచ్చిన డోనాల్డ్ ట్రంప్ అనే బిలియన్ డాలర్ల ఆస్తిపరుడు అకస్మాత్తుగా, అనూహ్యంగా ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. దీంతో విదేశీ విద్వేష వర్గానికి ఒక ఊతం, ఒక అండ దొరికినట్టయింది. కోపం, ఆవేశం, మొండితనం, ఎవర్నీ లెక్కచేయని తెగింపు కలిగిన ట్రంప్ ఇప్పుడు ఒక్కో నిర్ణయాన్ని ప్రకటిస్తూ వీసాల మీద, ఇమిగ్రేషన్ రూల్స్‌మీద సరికొత్త ఆంక్షలు విధిస్తున్నాడు. ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదం అక్కడి భారతీయులను, ఇతర దేశాల వారిని బెంబేలెత్తించటం ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చనీయాంశం అయింది. ట్రంప్ జాత్యహంకారం ఫలితంగా రెచ్చిపోయిన కొం దరు అమెరికన్లు భారతీయుల మీద కాల్పులు జరిపి వాళ్ళను చంపేయడం అక్కడ ఉన్న మనవాళ్ళను, ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మొన్న వంశీరెడ్డి, నిన్న కూచిభొట్ల శ్రీనివాస్.. ఆ తర్వాత ఎవరోనన్న అనుమానం, భయం అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. అకారణంగా అమాయకులను కాల్చిచంపేసే వికృత ‘గన్ కల్చర్’ విశృంఖలంగా విహారం చేసే ఆ దేశంలో ట్రంప్ బోధల ప్రభావం మతిస్థిమితం కోల్పోయే స్థితికి జనాన్ని తీసికెళితే అందులో ఆశ్చర్యం ఏముంది..? ప్రస్తుతం అమెరికాలో అదే జరుగుతోంది.
ఎవరి దేశం బాగు గురించి వాళ్ళు ఆలోచించే హక్కు అందరికీ ఉంటుంది. దేశ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది. అంతమాత్రాన తమ దేశంలో ఉంటున్న విదేశీయులమీద దాడిచేసి వాళ్ళను చంపే హక్కు మాత్రం ఉండదుకదా! ఏ దేశ రాజ్యాంగంలోనైనా కొన్ని విదేశాంగ పద్ధతులు, పాటించవలసిన మర్యాదలు, హక్కుల పరిరక్షణ గురించిన రాజనీతి సూత్రాలు లిఖించబడి వుంటాయి. వాటిని ఏ దేశాధ్యక్షులైనా పాటించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని సమన్వయంతో, పరస్పర సహకారంతో నిర్వహించవలసి ఉంటుంది. అంతేకానీ దౌర్జన్యం, దాష్టీకం ప్రదర్శిస్తూ ‘ప్రపంచానికంతా నేనే చండశాసనుడ’ను అనే నియంతృత్వ పోకడలుపోతే ఏదో ఒకరోజు తిరుగుబాటును ఎదుర్కోక తప్పదు.
ప్రవాస భారతీయులు కూడా ‘తాము ఉంటున్నది ఒక పరాయి దేశంలో’ అన్న స్పృహను ఎప్పుడూ కలిగి ఉంటూ తమ భద్రత కోసం తగుజాగ్రత్తలు తీసుకోవాలి. ‘అలవికానిచోట అధికుల మనరాదు..’ అన్నట్లుగా ఆ దేశంలో ఉంటూ వాళ్ళని.. వాళ్ళ సంస్కృతిని విమర్శించటం మం చిది కాదు. కొత్తగా అమెరికావెళ్ళే విద్యార్థులు, ఉద్యోగార్థులు అక్కడి నియమ నిబంధనలను, అక్కడి న్యాయవ్యవస్థను క్షుణ్ణంగా ముందుగానే తెలుసుకోవాలి. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు మన సంస్కృతీ సంప్రదాయాలను పా టించటం మంచిదే గానీ, అది మరీ వాళ్ళ కల్చర్‌కన్నా ఆధిక్యతను ప్రదర్శించేదిగా కానీ, కించపరిచేదిగా కానీ ఉండకూడదు. అక్కడ జాత్యహంకారం మరీ మితిమీరి తమ ప్రాణాలకు ముప్పు ఉందని, దినదిన గండంగా జీవితం మారిపోయిందనీ అనిపించినప్పుడు కన్నతల్లి ఒడిలాంటి మాతృభూమికి తిరిగి వచ్చి.. ఇక్కడ ఉద్యోగం చేస్తూ.. తమ మేథాశక్తిని స్వదేశ అభివృద్ధికి వినియోగించటం మంచిది.

- కొఠారి వాణీచలపతిరావు