సబ్ ఫీచర్

సేద్యానికి ఏదీ చేయూత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము పండించిన పంటకు ఆశించిన మద్దతు ధర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించక పోవడంతో రైతులలో నిరాశ నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ కాడిమేడిని పక్కనపెట్టి వ్యవసాయ రంగంనుంచి తప్పుకుంటున్న రైతులకు కొదవలేదు. భూమిని నమ్ముకొని వృత్తిపరంగా కొనసాగే వ్యవస్థ కొరవడడంతో ‘బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకవచ్చనే..’ సామెతకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులు నగరాలకు వలసబాట పడుతున్నారు. నగరంలో కాయకష్టమో లేక ఏదైనా వ్యాపారాలు చేసో నాలుగురాళ్ళు సంపాదించి బిడ్డల్ని మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలనే వారి ఆలోచనల్ని ఎవరూ కాదనలేరు. ఇక భూస్వాములైతే వ్యవసాయంలో రాబడి కంటే ఖర్చులే అధికమని భావించి, అయినకాడికి భూమిని కౌలురైతులకు అప్పగించి ఏనాడో పట్టణాలలో, నగరాలలో స్థిరపడిపోయారు. ధనవంతులు ఎలాగోలా నగరాల లో, పట్టణాలలో నివాసముంటూ తమ రాబడికి ఎలాంటి ఢోకాలేని జీవితాన్ని గడుపుతున్నారు.
వ్యవసాయక దేశంగా భారత్‌ను గొప్పగా చెప్పుకుంటున్న మన ప్రభుత్వాలు సేద్యరంగంలో మట్టిని పిసుకుతున్న వృత్తిజీవులకు ఒనగూర్చిన మేలిమి సదుపాయాలు అంతంతమాత్రమే. పంట సాగు కష్టాలు ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు, విత్తనాలు నకిలీలు, పంట అంతుచూస్తున్న క్రిమికీటకాదులతో, సాగుపెట్టుబడికి చేసిన అప్పులు పుండు సలపరంలాగా పీడిస్తుంటే పంటసాగుకు రైతులు ఎలా ముందుకెళుతారు. వర్షాభావం, భూగర్భజలాలు అడుగంటిపోవడం బోరుబావులు చెమ్మలేనితనం, నూతనంగా బోరువేస్తే పొడి తప్ప తడిలేని వైనంతో చేసిన అప్పుల్ని ఎలాతీర్చాలనే మానసిక వ్యధ ముప్పిరిగొనడంతో విధిలేని పరిస్థితుల్లో సమాజంలో సజావుగా, గౌరవప్రదంగా బ్రతకలేకనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే నగ్నసత్యం పాలిత ప్రభువుల బుర్రలకు ఎక్కినట్లు లేదు. రైతులేదో శ్రమజీవనానికి స్వస్తిచెప్పి విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి కుప్పతెప్పలుగా అప్పులుచేసి అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న అపవాదును రైతాంగానికి అంటగట్టడం ఏమాత్రం సబబుకాదు. సంపన్నుడు అప్పుచేసి ఎగ్గొట్టినా సమర్ధించే సమాజం కష్టజీవులపై కనికరం ఎందుకు చూపడం లేదు.
ఎన్డీయే ప్రభుత్వం రైతాంగానికి ఏదో ఒరగబెడుతుందనే ఆలోచనలోవున్న రైతాంగానికి వ్యవసాయ ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫారసులమేరకు సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు విదిల్చిన అదనపు మద్దతు ధర రూ.50 అంటే దేశీయ రైతాంగం ముక్కునవేలు వేసుకుంది. 2013-14లో వరి దిగుబడి 10,66 కోట్ల టన్నుల దిగుబడికాగా, మరుసటి ఏడాది 10.25 కోట్లర టన్నుల మేరకు తగ్గింది. అరకొర మద్దతు ధర విదిలించే దేశ వ్యవసాయోత్పత్తి మరింతగా పెరుగుతుందనే కేంద్ర ప్రభుత్వ వాదన నమ్మబుద్ధికానిదే అవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైతాంగానికి పెద్దపీట వేసి పంటసాగు ఖర్చుకు అదనంగా 50శాతం లాభపడేలా రైతాంగానికి ఊతమివ్వనున్నామని భాజపా ఎన్నికల ప్రణాళిక హామీని తుంగలోతొక్కిన ప్రభుత్వవైనాన్ని రైతు ఎలా జీర్ణించుకోవాలో అర్ధంకాని పరిస్థితి. అంతేకుండా సువిశాలమైన భారత్‌లో పంట సాగు ఖర్చులు, ఉత్పాదకత ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఆ వ్యత్యాసాలను విస్మరించి దేశవ్యాప్తంగా పంట మద్దతుధర ప్రకటించడం ఏమాత్రం సబబుకాదు. ఝార్ఖండ్‌లో ఎకరా సాగువ్యయం సుమారు ఎనిమిదివేల రూపాయలైతే ఆంధ్రప్రదేశ్, తె లంగాణా రాష్ట్రాలలో ఎకరా పంటసాగు వ్య యం రూ.38వేలకు ఎగబాకినట్లు వ్యవసాయశాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాలవారీగా సాగు పెట్టుబడులను గాలికివదిలేసి, ‘దొరికిందానినల్లా బందెలదొడ్లో తోలు...’’ అనే సామెతకు అనుగుణంగా కేంద్ర సర్కార్ టోకుగా దేశానికే ధాన్యంపై మద్దతు ధరలు ప్రకటించడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికంగా కూలీ ఖర్చులు, పెట్టుబడులు తదితరాలకు మదింపువేసి తగినంత మద్దతు ధర అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నా సీఏసీపీ ఏళ్ల తరబడి అలవాటుగా విస్మరించడం జరుగుతోంది. స్వామినాథన్ కమిటీ క్షేత్రస్థాయిలో తిరిగి రైతాంగానికి పెట్టుబడులు పోనూ 50 శాతం లాభదాయకం చేస్తే కానీ వ్యవసాయ మనుగడ ఉండబోదన్న మేలిమి సిఫార్సులు కూడా అటకెక్కాయి. ఏ రంగంలో అయినా చేసిన కష్టానికి, ఇంటిల్లిపాది శ్రమకు చివరకు అప్పులు మాత్రమే మిగులుతున్న రంగంలో కర్షకుడు ఎన్నాళ్లని ఇడుములు పడతాడు. రైతాంగం విసుగుచెంది సేద్యానికి దూరమవుతూ తప్పుకుంటూ పోతే జాతీయ ఆహార భద్రతకు ఎలా మేలు చేకూరుతుంది.
ప్రపంచ జనాభాలో 17శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కేవలం 2.4 శాతం భౌగోళిక విస్తీర్ణంలో సుస్థిర ఆహార ఉత్పత్తు ల్ని సాధించడం నిజంగానే రైతాంగానికి పెనుసవాలే. వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు ఎన్నోరకాలుగా ఊతమందించాల్సి వుంది. అంతేకాకుండా యువతరానికి ఈ రంగం పట్ల ఆకర్షితులు కావడానికి ప్రభుత్వం చర్య లు గైకొనాలి. ఉన్న విస్తీర్ణంలో అధికోత్పత్తులు సాధించడానికి శాస్తస్రాంకేతిక విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి చేర్చాలి. ఒక రైతు కుటుంబం సగటు సంపాదన కేవలం రూ.3,078 గా జాతీయ నమూనా అధ్యయన సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. సామాన్య ఉద్యోగికంటే ఏమా త్రం ఆదాయం మించని 58 శాతం అన్నదాతలు ఆకలి మంటల్లో కమిలిపోతున్నట్లు మరో అధ్యయనం ధ్రువీకరించింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రైతాంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్ళే విధంగా ప్రభుత్వాలు చురుగ్గా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఒకవైపు లెవీ సేకరణపై ఆంక్షలు, మరోవైపు మద్దతు ధర సక్రమంగా లేకపోవడంతో రైతు కుటుంబం పచ్చదనాన్ని ఎలా చవిచూస్తుంది. ఆహార భద్రతకు, రైతు జీవన భద్రతే ప్రాణాధారమని పాలక నేతలు వల్లించడం కాకుండా ఆచరణలో సేద్యరంగానికి చేయూతనిచ్చే సంస్కరణల్ని సత్వరమే చేపట్టాలి.

- దాసరి కృష్ణారెడ్డి