సబ్ ఫీచర్

ఒడిశాలో ‘కమల’ వికాసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఇవ్వడానికి చాలాకాలం ముందే ఆ పార్టీకి నిలువ నీడ లేకుండా చేశారు ఒడిశా ప్రజలు. ఒక విధంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్ పతనం ఇక్కడి నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. 2000 నుంచి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటున్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కాంగ్రెస్‌ను తిరిగి కోలుకోనీయలేదు. అయితే, ఇన్నాళ్లకు ఒడిశాలో ఇప్పుడు బిజెపి ఎదుగుదల మొదలైనట్లు తాజా పంచాయతీ ఎన్నికల్లో వెల్లడైంది. ఇంతవరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే బిజెపి సత్తా చూపుతూ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. బిజెపి అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తొలిసారిగా కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేసి, ఒడిశాలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ఆధిపత్యానికి బిజెపి గండి కొట్టింది.
నవీన్ పట్నాయక్ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు బిజెడి, బిజెపిల మధ్య భాగస్వామ్యం ఉంది. పుష్కర కాలంపాటు ఆ పొత్తు కొనసాగింది. కందమాల్ వద్ద జరిగిన అల్లర్లలో ప్రతికూలతను బిజెపి పైకి నెట్టివేసి, ఆ పార్టీతో బంధం తెంచుకొని, తన ప్రభుత్వంపై, పార్టీపై మచ్చ పడకుండా నవీన్ పట్నాయక్ జాగ్రత్తపడ్డారు. అప్పటి నుండి ఎనిమిదేళ్లపాటు తిరుగులేని శక్తిగా బిజెడి కొనసాగింది.
2012 పంచాయతీ ఎన్నికల్లో 851 జిల్లా పరిషత్ స్థానాల్లో 651 చోట్ల బిజెడి గెలుపొందింది. రెండో స్థానంలో కాంగ్రెస్‌కు 126 సీట్లు దక్కగా, బిజెపికి 36 సీట్లు దక్కాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 147 సీట్లలో 117 స్థానాలను బిజెడి గెలుచుకుంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి ఆశ్చర్యకరమైన విజయాలు లభించాయి. తొలిసారి బిజూ జనతాదళ్ హవాకు గండి పడగా, కాంగ్రెస్ మరింతగా నష్టపోయింది. ఈ పరిస్థితులను విశే్లషిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెడి-బిజెపిల మధ్యనే పోటీ ఉంటుందని అర్థమవుతుంది. 853 జిల్లా పరిషత్ సీట్లలో బిజెపి 306 చోట్ల గెలుపొంది తన బలాన్ని భారీగా పెంచుకుంది. బిజెడి 460 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ 66 సీట్లతో సరిపెట్టుకుంది. 2012తో పోల్చుకుంటే బిజెపికి అదనంగా 270 సీట్లు లభించగా బిజెడికి 191, కాంగ్రెస్‌కు 60 సీట్లు తగ్గాయి. తొలిసారిగా ఒడిశా వోటర్లు బిజెపి పట్ల విశేష ఆదరణ చూపారు. 17 ఏళ్ళ బిజెడి పాలనలో మొదటిసారి ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పట్ల విముఖత చూపారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఆయన తొలిసారి చవిచూడవలసి వచ్చింది. మిగతా రాష్ట్రాల మాదిరి ఒడిశాలోనూ ప్రాంతీయ అసమానతలు, సాంస్కృతిక విభేదాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 11 జిల్లాల వాసులు తమకు ‘కోసల ప్రత్యేక రాష్ట్రం’ కావాలంటూ చాలాకాలంగా ఉద్యమిస్తున్నారు. కోసల, ఇతర అటవీ ప్రాంతాల్లో సగం సీట్లను బిజెపి గెలుచుకొంది.
నవీన్ పట్నాయక్ పాలన పట్ల- పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో ఆయన ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్ ప్రభుత్వం వలే నవీన్ ప్రభుత్వం కూడా అవినీతికి చిరునామాగా మారింది. నవీన్ హయాంలో ‘సరికొత్త కాంగ్రెస్ పాలన’ అని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో నవీన్ విచిత్రమైన ఒరవడిని ప్రవేశపెట్టారు. పరిపాలనలో ప్రజల భాష తెలిసి ఉండనక్కర్లేదని భావించే ఆయన ఐఎఎస్ అధికారులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. సీనియర్ మంత్రులకన్నా అధికారులకే ప్రభుత్వంలో, పార్టీలో పలుకుబడి ఎక్కువ. ఎన్నికల వ్యూహంలో, అభ్యర్థుల ఎంపికలో అధికారుల మాటకే ఆయన విలువ ఇస్తుంటారు. దీంతో అధికార పార్టీలో ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గం బయలుదేరింది. దాని ప్రభావం పంచాయతీ ఎన్నికలపై పడింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2014 ఎన్నికల్లో ఏదోలా నవీన్ గట్టెక్కారు. గనుల కేటాయింపుల కుంభకోణం, వేదాంత్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, భూముల కుంభకోణం, చిట్‌ఫండ్ కుంభకోణం, గ్రామీణ ఉపాధి కుంభకోణం.. ఇలాంటివి ఎన్నో. గత ఎన్నికల అనంతరం తిరిగి చిట్‌ఫండ్ కుంభకోణం తెరపైకి వచ్చింది. బిజెడి ప్రభుత్వ ప్రత్యక్ష సహకారంతో ఈ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇటీవలి పంచాయతీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల నాయకత్వం బిజెపికే ఉన్నట్లు తేలింది. అంతా తానే అయి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ విశేష ప్రజాదరణగల నాయకుడిగా ఎదిగారు. మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసినట్లు రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఇక పార్టీపై, ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు నవీన్ పట్నాయక్ పలు సవాళ్లను ఎదుర్కొనక తప్పదు. పలువురు సీనియర్ నాయకులు నవీన్‌పై తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందే వారు బిజెపిలో చేరడం అనివార్యం కావచ్చు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ‘ఒక బలమైన రాజకీయ శక్తి’గా బిజెపికి గుర్తింపు తీసుకొచ్చినా అధికార పక్షంగా మారాలంటే మరెంతో దూరం ప్రయాణం చేయాల్సిందే. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితిని అంచనా వేస్తే- బిజెడికి సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. భాజపా బలం పెరుగుతుందని, కాంగ్రెస్ మరింతగా డీలా పడుతుందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెడి 117 గెలుచుకోగా, బిజెపి 10, కాంగ్రెస్ 6 సీట్లు గెల్చుకొంది.
తాము అధికారంలోకి రావాలంటే బిజెపి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పంచాయతీ ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకున్న కోసల వంటి ప్రాంతాలపై ‘కమలనాథులు’ మరింత దృష్టి పెట్టాలి. జనాకర్షణ ఉన్న నేతను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించాలి. బసంత్‌కుమార్ పండా, జమాల్ ఓరమ్, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ వంటి నేతల పేర్లను బిజెపి నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న కోస్తా ప్రాంతంపై దృష్టి సారించాలి. పట్టణ వాసులే కాదు, ఇటీవల గ్రామీణ ప్రజలు సైతం భాజపాపై ఆసక్తి చూపుతున్నారు. భువనేశ్వర్, కటక్, పూరి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలి. 2018లో జరిగే మున్సిపల్ ఎన్నికలు బిజెడి, బిజెపిలకు అత్యంత కీలకం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2019 అసెంబ్లీ ఎన్నికలపై విశేషంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నవీన్ పట్నాయక్ దూరం కావడం విపక్షాలను విస్మయానికి గురిచేసింది. గణనీయంగా సీట్లు కోల్పోవడానికి ఇదొక కారణమని పరిశీలకులు అంటున్నారు. క్రియాశీల రాజకీయాల పట్ల ఆయనలో నానాటికీ వైరాగ్యం పెరుగుతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే తమకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని బిజెడి కార్యకర్తలు అంటున్నారు. మొత్తమీద ప్రస్తుత పరిస్థితులన్నీ తమకు కలిసొచ్చేలా ఉన్నాయని భాజపా నాయకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో మరింతగా దూసుకుపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు.

- చలసాని నరేంద్ర