సబ్ ఫీచర్

జన స్పందన లేని కాంగ్రెస్ వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో తాము అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం తమకు లభించకపోవడంపై కాంగ్రెస్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కోల్పోయిన పరాజయ భారంలో పంజాబ్‌తోపాటు ఈ రెండు రాష్ట్రాలను కూడా వశం చేసుకోగలిగితే ఆ పార్టీకి తగినంత ఊరట ఉండేది. ఈ విధమైన రాజకీయ ఆలోచనలను పక్కన ఉంచి విషయంలోకి వెడితే, కాంగ్రెస్‌కు కలిసి రాని విషయాలు అనేకం కనిపిస్తున్నాయి. అందువల్లనే కాంగ్రెస్ వేదనకు సాధారణ ప్రజల నుంచి స్పందన లేకుండా పోయింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ నెల 11వ తేదీన గోవా, మణిపూర్ రెండింటిలోనూ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గోవాలో 40కి 17, మణిపూర్‌లో 60కి 28 సీట్లలో కాంగ్రెస్ వారు గెలిచారు. బిజెపి కన్నా గోవాలో 4, మణిపూర్‌లో 7 సీట్లు వారికి ఎక్కువ వచ్చాయి. కనుక మామూలుగా ఆలోచించినట్టయితే వారి ప్రభుత్వాలు ఏర్పడడానికి ‘అవకాశం’ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ‘అవకాశం’ అనే మాట గుర్తుంచుకోదగ్గది. ఎందుకంటే, ఇటువంటి స్థితిలో అతి పెద్ద పార్టీకి ‘అవకాశం’ అయితే ఎక్కువగానే ఉంటుంది కానీ అందుకు ‘తప్పనిసరి హామీ’ అంటూ ఉండదు. ఇది కొత్తగా చెప్తున్న మాట కాదు. మన ఎన్నికల చరిత్ర పొడవునా ఇందుకు ఉదాహరణలు చాలా కన్పిస్తాయి.
అవకాశమే తప్ప, తప్పనిసరి హామీ ఉండకపోవడం ఎందువల్ల? ఇందుకు కొన్ని కారణాలు వున్నాయి. ఏదైనా పార్టీకి గానీ లేదా ఒక పార్టీ నాయకత్వాన ఎన్నికలకు ముందుగానే ఏర్పడిన ఐక్య వేదికకు గాని పూర్తి ఆధిక్యత లభించినట్టయితే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానించాలన్న విషయమై ఎలాంటి సమస్య తలెత్తదు. అట్లా జరగనప్పుడు పలు విధాల పరిస్థితులు ఉత్పన్న మవుతాయి. అప్పుడు కూడా అతి పెద్ద పార్టీ ఏది అనేది పరిగణనలోకి తప్పక వస్తుది. కానీ అంతకన్నా ముఖ్యంగా, సదరు అతిపెద్ద పార్టీ ఇతరులతో కలిసి పూర్తి ఆధిక్యతను సమీకరించిందా? లేదా? రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల స్థితిలో ఉన్నదా? లేదా? అనే ప్రశ్నలు గవర్నర్ ముందుకు వస్తాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అతి పెద్ద పార్టీ ఇతర పార్టీలను, స్వతంత్రులను కలుపుకుని వారినుంచి మద్దతు లేఖలను సంపాదించి గవర్నర్‌కు సమర్పించినట్టయితే, అప్పుడు ఆయనకు ఆ పార్టీని ఆహ్వానించడం తప్పనిసరి అవుతుంది. తర్వాత సభలో ఆధిక్యతను నిరూపించుకునేందుకు గడువునివ్వడం షరామామూలు సంప్రదాయం.
మొత్తానికి అదొక అనిశ్చిత స్థితి. ఎవరికీ స్వంత ఆధిక్యత లేకపోవటం, అటువంటి ఆధిక్యత గల ఎన్నికల ముందస్తు ఐక్య వేదిక ఉండకపోవడం జరిగినప్పుడు, ఎన్నికల అనంతరం ఇక ఎవరు అధిక సంఖ్యాకుల మద్దతు సంపాదించగలరన్నదే ప్రశ్నగా మారుతుంది. సూటిగా చెప్పాలంటే ఆ పని ఎవరు చేయగలిగితే వారినే గవర్నర్ ఆహ్వానిస్తాడు. వాస్తవ రాజకీయాన్ని బట్టి అయినా, ఆధిక్యత గలవారికి అధికారం లభిస్తుందనే ప్రజాస్వామిక నియమాన్ని చూసినా, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత ప్రకారమైనా, చట్టపరమైన ఏర్పాట్లు, కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకున్నా, సాధారణ ప్రజలు తమ తార్కికమైన ఇంగితం మేర ఆలోంచినా జరిగేది ఇదే. జరగవలసింది కూడా ఇదే. గోవా, మణిపూర్‌లలో ఇ దే జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపిలు ఈసారి గెలిచిన స్థానాలు, 2012 ఎన్నికల తో పోల్చినపుడు పెంచుకున్న లేదా కొల్పోయిన బలాలను చూపుతూ కొంత చర్చ జరుగుతున్నది. పైన పేర్కొన్నట్టు రెండు చోట్ల కూడా ఈసారి గెలిచినవి కాంగ్రెస్‌కు ఎక్కువ. 2012తో పోల్చితే గోవాలో కాంగ్రెస్ 8 పెంచుకోగా, బిజెపి 8 పోగొట్టుకుంది. ఈ పరిస్థితి మణిపూర్‌లో తిరగబడింది. కాంగ్రెస్ 14 స్థానాలు కోల్పోగా, బిజెపి సున్నా నుంచి 21కి పెరిగింది. అయితే, ఈ అంకెలు సాధారణ విశే్లషణలకు ఉపయోగపడతాయి కానీ, గవర్నర్ ఆహ్వానానికి అవి ప్రాతిపదిక కాలేవు. ఏ విధంగానైతే కేవలం అతి పెద్ద పార్టీ కావటమన్నది అందుకు సరిపోదో, గత ఎన్నికల కన్నా బలం పెరిగిందా? తగ్గిందా? అనేది కూడా చాలదు. అది చాలుతుందనుకుంటే గోవాలో కాంగ్రెస్‌ను, మణిపూర్‌లో బిజెపిని ఆహ్వానించాలి. లేక ఏది అతి పెద్దది అని చూస్తే రెండు చోట్లా కాంగ్రెస్‌ను పిలవాలి. కానీ ఇందుకు చట్టపరమైన ఆధారాలు ఏవీ ఉండవు. కనుక నిలవవు. ఏదైనా ఒక పార్టీ అతి పెద్దది అయినపుడు మరెవరూ ఆధిక్యతను కూడగట్టి ఆ పార్టీకి పోటీగా రానప్పుడు మాత్రమే గవర్నర్ మార్గాంతరం లేక సదరు అతిపెద్ద పార్టీని ఆహ్వానిస్తాడు. ఆ పార్టీకి లేదా ఐక్య సంఘటనకు అప్పటికప్పుడు ఆధిక్యతత లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమిస్తాడు. ఆధిక్యతను గడువులోగా నిరూపించుకోమంటాడు. నిరూపించుకోలేని పక్షంలో మరొకరికి అవకాశమిస్తాడు. ఒకవేళ తొలి దశలోనే అతి పెద్ద పార్టీకి భిన్నంగా మరొకరు ఆధిక్యతను సమకూర్చుకుని తన ముందు ఉంచినట్టయితే ఇక గవర్నర్‌కు అతిపెద్ద పార్టీ ఏదన్నది విషయమే కాదు.
ఈవిధంగా వివిధ కోణాలను పరిశీలించిన తర్వాత గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ వాదనలకు ఆస్కారం ఏమీ కనిపించదు. రెండు చోట్లా కూడా తమది రెండవ స్థానం అయినప్పటికీ ప్రభుత్వాలను తామే ఏర్పాటు చేయనున్నట్టు బిజెపి ప్రకటించింది. ఏ ఆలోచనతో ఆ ప్రకటన చేసి ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు సంపాదించగలమన్నది వారి ధీమా. ఆ విధంగా సంపాదించేందుకు బిజెపి, కాంగ్రెస్ సహా అందరూ అనుసరించే పద్ధతులు ఏమిటో అందరికీ తెలిసినవే. అది మంచా? చెడా? అన్నది ఎట్లున్నా ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. రెండు చోట్లా ఒకవేళ కాంగ్రెస్‌కు ఆహ్వానాలు లభించి ఉన్నా, కొరత పడిన సభ్యులను సంపాదించేందుకు వారైనా అవే పద్ధతులలో వెళ్లేవారు. అటువంటప్పుడు, అంతకన్నా ముఖ్యంగా చర్చించుకున్న వివిధ ప్రశ్నలను పరిశీలించినప్పుడు, ఆ రెండు రాష్ట్రాలలో అ ధికారాన్ని తమనుంచి ‘దొంగిలించా’రన్న కాం గ్రెస్ విమర్శలో విలువ ఏదైనా కన్పిస్తుందా? పో నీ కేంద్రంలోని ప్రభు త్వం, రెండు రాష్ట్రాల గవర్నర్లు ఆ పని చేసారనుకోవాలంటే, సాధారణంగా జరిగే నాటికి గాని, వివిధ నియమాలకు గాని ఇక్కడ భిన్నత్వం కన్పించడం లేదు. ఇటువంటి సందర్భాలలో రాజకీయం, అధికార దుర్వినియోగం, గవర్నర్ల పక్షపాత వ్యవహారం ఉండవని కాదు. అట్లా ఉన్న సందర్భాలు కోకొల్లలు. కానీ ప్రస్తుత సందర్భంలో మాత్రం అటువంటిది కన్పించదు. ఇదే వివాదంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యను బట్టి అర్థమయ్యేది కూడా ఇదే. ‘మీకు ఆధిక్యత ఉంటే గవర్నర్‌కు అఫిడవిట్లు ఇవ్వడానికి బదులు మా వద్దకు ఎందుకు వచ్చా’రన్నది కోర్టు వేసిన ప్రశ్న. అందుకు కాంగ్రెస్ వద్ద ‘జవాబు’ లేకపోయింది. గోవాలో బల నిరూపణ సమయంలోనూ ఇదే తేలింది.
విషయాలన్నీ ఈ విధంగా స్పష్టంగా ఉన్నాయి గనుకనే కాంగ్రెస్ వాదనలకు బయట ఎటువంటి స్పందనలు కన్పించడం లేదు. పైగా పరిస్థితిని ఎన్నికలకు ముందు, తర్వాత ‘సరిగా మేనేజ్ చేయలే’దంటూ ఆ పార్టీలోనే అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంది. రాజకీయ పార్టీల తీరుపట్ల ప్రజల్లో ఈ విధమైన నిర్లిప్తత గోవా, మణిపూర్‌లతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా కూడా ఇదే విధంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు బిజెపికి బదులు కాంగ్రెస్ ఉండి, ఇట్లాగే జరిగి, రెండు రాష్ట్రాలను కాంగ్రెస్ తమనుంచి ‘దొంగిలించిం’దని బిజెపి ఫిర్యాదు చేసినా ఇదే నిర్లిప్తత కన్పించేదనుకుంటే పొరపాటు కాబోదు. అందుకు కారణాలు అందరికీ తెలిసిందే. నీతిగల రాజకీయాలు చేస్తున్నవారు, రాజ్యాంగాన్ని, చట్టాలను, ఎన్నికల సంఘం నిబంధనలను అధికారం కోసం ఉల్లంఘించని వారు ఎవరూ లేరు. ఆ ఉల్లంఘనలను వీలైనంత తెలివిగా చేయడం, అవి అందరి దృష్టికి వచ్చి విమర్శలకు గురైనప్పుడు చతురమైన వాదనలు సాగించడం అందరికీ సంప్రదాయంగా మారింది. అందువల్లనే ఫలానా వారికి నిజంగానే అన్యాయం జరిగిందని భావించినపుడు కూడా ప్రజలు నిర్లిప్తంగా ఉండడం తప్ప స్పందించడం లేదు. అన్యాయానికి గురయ్యాననే పార్టీ గతంలో చేసింది కూడా ఇదేనని వారికి తెలుసు. వీరంతా తమ అధికార అవసరాల కోసం మరొక రోజు ఇట్లా వ్యవహరించగలరని కూడా వారికి తెలుసు. నిజం చెప్పాలంటే అందరూ కలిసి అన్యాయం చేస్తున్నది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి.
ప్రస్తుత పరిణామాల నుంచి పాఠాలు గ్రహించి అన్ని పార్టీలు కొన్ని ఉమ్మడి తీర్మానాలు చేసుకోగలిగితే దేశానికి, తమకు కూడా చాలా మేలు కలుగుతుంది. అట్లా వ్యవహరించినప్పుడు ఎవరు ఏ ఆవేదనకైనా గురైతే ప్రజల నుంచి స్పందనలుంటాయి. వారు చేసుకోవలసిన మొదటి తీర్మానం, ఇప్పటికే గల రాజ్యాంగపరమైన, చట్టపరమైన, ఎన్నికల నియమావళి పరమైన అన్ని నిబంధనలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడగలమని. రెండవ తీర్మానం ఈ అంశాలకు సంబంధించి వివిధ అధికార కమిషన్లు చేసిన సిఫార్సులను ఆమోదించి అమలుకు తేగలమని. మూడవ తీర్మానం, అధికారం కోసం ఎన్నికల సమయంలోగాని, తర్వాత గాని ఎటువంటి అక్రమాలకు పాల్పడబోమని. నాల్గవది నిరంతరం జనాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దానిని మన్నించగలమని. ఇదంతా ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటుతో సంబంధం ఉండి చెప్తున్న మాటలు.
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767