సబ్ ఫీచర్

అమెరికా కపటత్వాన్ని బయటపెడుతున్న రష్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్‌ఖైదా తర్వాత ప్రపంచం ముందు పెద్ద ఉగ్రవాద ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్‌పై రష్యా వైమానిక దాడులు ప్రారంభించడం అమెరికా, ఇతర ఐరోపా దేశాల కపట నాటకాలను బహిర్గతం చేస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అసాధ్యులని, వారిని కట్టడి చేయడం అసాధ్యం అనే రీతిలో కొంతకాలంగా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఈ దేశాలు చేస్తున్నాయి. అయితే ‘ఉగ్రవాదంపై దాడి’ పేరుతో ప్రపంచంలో తన ఆధిపత్యం పెంచుకోవడంకోసం అమెరికా ప్రయత్నించడమేగానీ, ఈ విషయంలో ఆ దేశం సాధించిన విజయాలు అంతగా లేవని స్పష్టవౌతున్నది. ఈ విషయమై అమెరికా విధానాలను రష్యా అధ్యక్షుడు పుతి న్ మొదటినుండి ప్రశ్నిస్తూనే ఉన్నాడు.
అమెరికానే తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ప్రత్యర్థి శిబిరాలలో చేరి, యుద్ధాలు చేసే విధంగా చేస్తున్నదని పుతిన్ ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అణచడంలో అమెరికా చెప్పుకోదగిన విజయాలు సాధించలేక పోవడానికి అదే కారణం. పైగా వారిపై క్షిపణులను ప్ర యోగించానని అమెరికాచేస్తున్న వాదనను రష్యా కొట్టిపారవేసింది. అమెరికాకు తీవ్రవాదాన్ని అణచడం పట్ల అంతగా ఆసక్తిలేదని కూడా స్పష్టం చేసింది. ఆప్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి, సైనికులతో ఆయా దేశాలను ఆక్రమించుకొని, వాటిని తీవ్రవాదుల అడ్డాలుగా మార్చడం ఇందుకు నిదర్శనగా మార్చుతున్నది. ఇటువంటి పరిస్థితులలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల నుండి సిరియా ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి రష్యా ప్రారంభించిన వైమానిక దాడులు చెప్పుకోదగిన ఫలితాలు సాధిస్తున్నాయి.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను తుడిచిపెట్టి వేయడంకోసం 1.50 లక్షల మంది సైనికులతో పూర్తిస్థాయి యుద్ధం జరపడానికి కూడా రష్యా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ విషయంలో రష్యాకు అండగా ఉండడానికి చైనా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నది. ఈ పరిణామాలను గమనిస్తుంటే అమెరికా సాగిస్తున్న ఏకస్వామ్య ఆధిపత్యానికి ప్రపంచంలో కాలం ముగిసినట్లే అని భావించవచ్చు. సైద్ధాంతికంగా అమెరికా ఆధిపత్యాన్ని పుతిన్ చిరకాలంగా ప్రశ్నిస్తూనేవున్నారు. సోవియట్ యూనియన్‌గా ఉన్న సమయంలో అధికారికంగా నాస్తిక దేశం ఐన రష్యాను ‘దేవుడు లేని దేశం’అంటూ అమెరికా అవహేళన చేస్తూ ఉండేది. రెండున్నర దశాబ్దాల అనంతరం ఇప్పుడు పుతిన్ క్రెమ్లిన్‌లో రష్యాలోని పురాతన చర్చినుండి అదే విధమైన ఆరోపణలను అమెరికా, ఇతర ఐరోపా దేశాలపై చేస్తున్నారు. ‘‘చాలా ఐరోపా అట్లాంటిక్ దేశాలు క్రైస్తవ విలువలతో సహా తమ మతాలనుండి వైదొలగాయి’’అని పుతిన్ తీవ్రంగా విమర్శించారు. అదే స్థానంలో రాజకీయాలు చోటుచేసుకున్నాయని అంటూ ఒకే గే వివాహాలు, దెయ్యాల పట్ల నమ్మకం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అని ఆయన హేళన చేశారు. ఇదేసమయంలో రష్యా సాంప్రదాయ విలువలను పరిరక్షిస్తున్నదని నైతిక విలువలను వదలడం లేదని ఆయన స్పష్టం చేశారు. క్రైస్తవ విలువలను కాపాడటంకోసం గే సంబంధాల ప్రచారాన్ని నిషేధించడంతోపాటు మత భావనలను అవమానపరచడం నేరంగా పరిగణిస్తూ ఆయనే చట్టాలు తీసుకువచ్చారు.
ఇస్లామిక్ స్టేట్ వారి కీలక స్థావరాలపై రష్యా వైమానిక దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగిస్తుంటే అమెరికా సహించలేక పోతున్నది. జనావాసాలపై దాడులు జరుపుతున్నారంటూ గగ్గోలుపెట్టడం ప్రారంభించారు. జార్జియా, ఉక్రెయిన్‌లలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని కట్టడి చేయడంకోసం పాక్షికంగా దాడులు జరిపిన రష్యా నేరుగా అమెరికా కపటత్వాన్ని సవాల్ చేసే రీతిలో సిరియాలో దాడులు జరపడం కలవరాన్ని కలుగచేసింది. అమెరికా తన విదేశీ విధానాలను సమీక్షించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ సహితం ఇప్పుడు రష్యాతో జతకట్టడానికి సిద్ధపడుతుండటం అమెరికాకు ఇబ్బందికర పరిణామమే. సి.ఐ.ఎ. శిక్షణ ఇచ్చి, నిధులు సమకూర్చిన తీవ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బారక్ ఓబామా అంగీకరించారు. ఆప్ఘనిస్తాన్, ఇరాక్‌లలో తన కార్యకలాపాలే ఇస్లామిక్ స్టేట్‌ను సృష్టించినట్లు అంగీకరించడం అమెరికాకు ఇబ్బందికర పరిణామమే. తాను సృష్టించిన భూతం ఈ ప్రాంతాలలో తన చిరకాల మిత్రదేశాల అస్థిత్వానికి ప్రమాదంగా పరిణమించడంతో అమెరికా పట్ల విశ్వసనీయత సమస్య తలెత్తుతున్నది. పైగా ఎలాగైనా సిరియా అధ్యక్షుడు బహర్ ఆల్‌అసాద్‌ను గద్దెదింపాలని అమెరికా భావించడం, అదే సమయంలో రష్యా తన వైమానిక దాడులతో ప్రవేశించడంతో అధ్యక్షుడు తలెత్తుకోగలగడం అనూహ్యంగా జరిగిన నాటకీయ రాజకీయ పరిణామాలు అని చెప్పవచ్చు.
అమెరికా ఎత్తుగడల కారణంగానే లక్షల సంఖ్యలో శరణార్థులు పొరుగు దేశాలకు తరలి వెళ్ళడం ఆ తర్వాత అంతర్జాతీయ మానవీయ సంక్షోభంగా మారడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచడంకోసం రష్యాకు అనుమతి ఇస్తూ సెప్టెంబర్ 30న సిరియా పార్లమెంటు తీర్మానం చేయడం అమెరికాకు విస్మయం కలిగించింది. ఈ పరిణామాన్ని అమెరికా అసలు ఊహించనే లేదు. పైగా ఈ రెండు దేశాలమధ్య సుదీర్ఘకాలం సైనిక సంబంధాలు నెలకొనడం, రష్యా నావికాళానికి కూడా ఆశ్రయం ఇవ్వడంతో ఈ దాడులను ప్రపంచం ప్రశ్నించలేక పోయింది. అయితే క్షేత్ర స్థాయిలో తీవ్రవాదులను కట్టడి చేయడంకోసం సిరి యా సైనికులు జరుపుతున్న పోరాటానికి మద్దతుగానే తమ వైమానిక దాడులు ఉంటాయని తమ సైనికులు భూమిపై చర్యలకు పూనుకోరని రష్యా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ముస్లిం దేశమైన తాను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని, వారిపై దాడులకు తమకు అనుమతి ఇవ్వాలని చెచన్ రిపబ్లిక్ అధ్యక్షుడు రంజాన్ కడ్యరొవ్ అనుమతి కోరారు. గెరిల్లా తరహా యుద్ధంలో విశేష అనుభవంగల తమ దళాలు ప్రవేశిస్తే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నిలబడలేరని ధీమా వ్యక్తంచేశారు. తమ దాడులలో పౌరులు మృతి చెందుతున్నారని పాశ్చాత్య దేశాలు ఆరోపించడాన్ని ‘‘సమాచార దాడి’’గా పుతిన్ అభివర్ణించారు. మొదటి వైమానిక దాడి ప్రారంభం కాకముందే ఇటువంటి ఆరోపణ చేశారని ఆయన రష్యా మానవ హక్కుల మండలికి తెలిపారు.
ఇదివరలో అమెరికా నిధులతో ఏర్పడిన సిరియా పౌర రక్షణ సంస్థ ‘‘వైట్ హెల్మెట్స్’’. ఇటువంటి ఆరోపణ చేసిం ది. సెప్టెంబర్ 30న రష్యా దాడులలో ముగ్గురు పిల్లలతో సహా 33 మంది పౌరులు చనిపోయారని కొన్ని ఫొటోలను విడుదల చేసింది. అయితే ఆ ఫొటోలు అంతకు ఐదు రోజుల ముందు జరిగిన సంఘటనకు సంబంధించిన ఆ తర్వాత స్పష్టమైంది. గత సంవత్సర కాలంగా సిరియా అనుమతి లేకుండా, ఐక్యరాజ్యసమితి తీర్మానం లేకుండా సిరియా భూభాగంలో ‘‘ఉగ్రవాదంపై పోరు’’ పేరుతో అమెరికా, దాని మిత్రదేశాలు దాడులు జరుపుతున్నాయి. అయినా నేడు సిరియా ఆహ్వానంపై ఉగ్రవాద సంస్థలపై రష్యా దాడులు జరుపుతుంటే అమెరికా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఉండటం విస్మయం కలిగిస్తున్నది. వీరు సిఐఎ శిక్షణ ఇచ్చిన జిహాదీలు కావడమే అందుకు కారణం. అయితే అమెరికా అనుసరిస్తున్న అహంకార పూరిత విదేశాంగ విధానాల పట్ల ఆ దేశంలోనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. అమెరికా ‘ప్రపంచ పోలీస్’ పాత్ర పోషించాలని చాలామంది ప్రజ లు కోరుకోవడం లేదు. అసమర్ధ, ఖరీదైన అమెరికా విదేశాంగ విధానం గురించి ఆ దేశంలో ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరుగుతున్నాయి.
నేడు ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి సైన్యంపై పెడుతున్న మొత్తంకన్నా ఎక్కువగా అమెరికా సైన్యంపై ఖర్చుపెడుతున్నది. అంటే అంతే భయంతో ఆ దేశం మనుగడ సాగిస్తున్నదా? తాను అనుసరిస్తున్న విదేశాంగ విధానాలే నేడు అమెరికాకు భారంగా పరిణమిస్తున్నట్లు చెప్పవచ్చు. అట్లాంటిక్ దేశాలపై తన నాయకత్వాన్ని కాపాడుకోవడంకోసం అమెరికా ఊహాజనిత శత్రువులను సృష్టిస్తూ ఉంటుందని, ఇరాన్ మాత్రమే సరిపోకపోవడంతో ఉక్రెయిన్ సృష్టించిందని, దానితో తాము జోక్యం చేసుకోవలసి వచ్చిందని పుతిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే నేడు ప్రపంచం మారుతున్నది. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల స్థాయిలో భారీ సైనిక ఘర్షణలకు అవకాశం లేదు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. దానితో తాను సృష్టించుకున్న ఊహాజనిత సమస్యల విషవలయాలలో తానే బందీ అయ్యే పరిస్థితులు నేడు అమెరికాను ఆవరిస్తున్నాయి. ఆల్‌ఖైదా పేరుతో ఒక దశాబ్దంకు పైగా ప్రపంచంలో ఆధిపత్యంకోసం అమెరికా ప్రయత్నించింది. ఉగ్రవాదంపై పోరుకు తనతో చేతులు కలపని వారిని ఉగ్రవాదుల మద్దతుదారులుగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఆ విధంగానే వాడుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రష్యా రంగప్రవేశం చేసి సిరియాలో దాడులు ప్రారంభించడంతో అమెరికా కుయుక్తులకు అడ్డుకట్ట వేసినట్లయింది. అమెరికా ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ఉగ్రవాదం పేరుతో తాను సాగిస్తున్న కపట పన్నాగాలు బహిర్గతం అయ్యాయని కలవర పడవలసి వస్తున్నది.

- చలసాని నరేంద్ర