సబ్ ఫీచర్

బడాబాబుల మేలుకే ఈ స‘పోర్టు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన చట్టంలోని అన్ని అంశాలను తు.చ తప్పకుండా అమలు పరుస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం హామీలు ఇస్తున్నా నవ్యాంధ్రలో కీలకమైన దుగరాజపట్నం ఓడరేవు విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకువేసే ప్రయత్నం జరగడం లేదు. ఈ ఓడరేవు ప్రతిపాదనే రాజకీయ వత్తిడులతో, కొన్ని స్వార్ధపర శక్తుల ప్రమేయంతో జరగడంతో, ఆ లోపాలను సవరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో రామయపట్నం వద్ద పెద్ద ఓడరేవును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే అవకాశాన్ని కోల్పోతున్నాము.
వాస్తవానికి ప్రకాశం జిల్లా రామయపట్నం వద్ద భారీ ఓడరేవును నిర్మించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కొందరు ప్రబుద్ధులు అప్పటికే దుగరాజపట్నం పరిసరాలలో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేసి అక్కడే ఓడరేవు నిర్మించే విధంగా రాజకీయ వత్తిడులు తీసుకువచ్చారు. దాంతో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వివిధ రకాల వత్తిడుల కారణంగా మే 9, 2013లో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా చేర్చారు. 150.40 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో రెండు దశలలో రూ. 17,615 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. అయితే, రాష్ట్రప్రభుత్వం చేతులు ఎత్తివేయడంతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు బుట్టదాఖలాలు అయ్యాయి. ఈ ప్రాజెక్టుపై అధ్యయనానికి కేంద్ర ఫ్రభుత్వం నియమించిన ఏఇసిఇఓఎం కన్సల్టెన్సీ సంస్థ ఇక్కడ ఓడరేవు నిర్మించడం వాణిజ్యపరంగా లాభదాయకం కాదని స్పష్టం చేసింది.
2035 నాటికి ఏటా 20 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉన్నా దక్షిణాదిలో మరో నౌకాశ్రయం వస్తే దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. ప్రస్తతం అంచనా వేసిన ట్రాఫిక్ రద్దీ, రవాణా చర్యలను బట్టి చూస్తే పోర్టు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ కాగలదు. పైగా ఇక్కడ ఓడరేవు నిర్మించడం పర్యావరణ, భద్రతా సమస్యలకు దారి తీయనున్నది. సమీపంలో గల పులికాట్ సరస్సు పక్షుల రక్షిత కేంద్రానికి చెందిన కొంత భూమిని ఉపయోగించవలసి ఉంటుంది. దానితో పులికాట్ సరస్సు అదృశ్యం కాగలదని ప్రజలు ఆందోళనకు దిగడంతో ఓడరేవు స్థలాన్ని అక్కడి నుండి ఉత్తర దిశలో 5 కిమీ దగ్గరున్న తూపిరిపాలెం గ్రామానికి మార్చారు. అయితే ఓడరేవు మొదటి దశకు 3,500 ఎకరాల భూమి అవసరం కాగా అక్కడ 3,500 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించడానికి, పునరావాసం, రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు వేయడానికి అయ్యే ఖర్చు రామయపట్నం వద్ద కన్నా పదింతలు ఎక్కువ కాగలదని అంచనావేసారు. అందువలన దుగరాజపట్నం వద్ద ఓడరేవు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి రామయపట్నం వద్ద ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ విభజనచట్టం- 2014లో తగు సవరణ తీసుకురావాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కాదని కొన్ని స్వార్ధ శక్తుల ప్రమేయంతో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకు ఐదారు వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు ఎందుకు భరించాలనే ప్రశ్న తలెత్తుతోంది. దుగరాజపట్నం పరిధిలో ఓడరేవు నిర్మించడం కోసం పులికాట్ సరస్సు పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకు కుదిస్తూ కేంధ్రం 2014లో ఏకపక్షంగా పర్యావరణ వేత్తలకు ఆందోళన కలిగించేరీతిలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పొరుగున ఉన్న తమిళనాడు పరిధిలో పులికాట్ సరస్సు పరిధి ఇంకా పది కిలోమీటర్లుగానే కొనసాగడం గమనార్హం. పులికాట్ పక్కనే వున్న నెలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లోని పక్షులు, వన్యప్రాణుల రక్షిత కేంద్రాల పరిధి 5 నుండి 10 కిమీ గా కొనసాగుతున్నది. కేంద్ర నౌకాయాన శాఖనుండి తగు ప్రతిపాదన లేకుండా విభజన చట్టంలో దుగ రాజపట్నం చేర్చడమే ఈ ఓడరేవు రాజకీయ, స్వార్ధ శక్తుల వత్తిడులతో తెరపైకి తెచ్చినట్టు స్పష్టం అవుతుంది. అన్ని రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖుల ఆర్థిక ప్రయోజనాలు వుండడంతో పర్యావరణానికి ముప్పుగా, భద్రతకు సవాల్‌గా మారినా దుగరాజపట్నంలోనే ఓడరేవు నిర్మించాలని మొండిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది.
దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించడం- భారత్ కీర్తి ప్రతిష్టలకు పేరొందిన శ్రీహరికోటకు భద్రతాపరంగా కొత్త చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఓడరేవువలన వచ్చే కాలుష్యం తమ ఉద్యోగులు, శాస్తవ్రేత్తలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అంతరిక్ష విభాగం కోరింది. ఆ మేరకు 2012లో కేంద్ర నౌకాయాన మంత్రి, కార్యదర్శులకు లేఖలు కూడా రాశారు. రామయపట్నంలో భారీ ఓడరేవును నిర్మిస్తే తెలంగాణలోని జిల్లాలకు, సాలినా రు.25 వేల కోట్లు విలువగల వస్తువులు ఎగుమతి చేసే ప్రకాశం, గుంటూరు జిల్లా ఎగుమతిదారులకు ఎంతో సౌకర్యంగా వుండగలదు. రవాణాపై వేల కోట్ల రూపాయలు వ్యయం ఆదా కాగలదు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే దుగరాజపట్నం సమీపంలో కృష్ణపట్నం వద్ద ఓడరేవు ఉండగా బహుతక్కువ ఎగుమతులు ఉన్న ఆ జిల్లాలో మరో ఓడరేవు ఎందుకనే ప్రశ్న తలెత్తుతున్నది. పైగా తమిళనాడులోని కట్టపల్లి, ఎన్నూరు, చెన్నైలో గల ఓడరేవులు సైతం దుగరాజపట్నంకు సమీపంలోనివే కావడం గమనార్హం. అందుచేత దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మిస్తే ఎగుమతి, దిగుమతి సామర్ధ్యం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. పైగా అక్కడ ఏర్పడే భారీ ఇసుక మేటలను తొలగించడానికి భారీ వ్యయం అవుతుందని కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనావేసారు.
ఆంధ్రప్రదేశ్-తమిళనాడుల సరిహద్దు అయిన దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తే శ్రీకాకుళం నుండి ఒంగోలు వరకు గల ఎగుమతి, దిగుమతిదారులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓడరేవుతో పాటు నౌకా నిర్మాణ కేంద్రం కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే దుగరాజపట్నం వద్ద భూమి కొరత ఉందని గమనించి ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేసారు. 2008లో కృష్ణపట్నం ఓడరేవు పరిధిని ఉత్తర దిశలో 30 కిమీగా, దక్షిణ దిశలో 30 కిమీ పరిధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొద్ది నెలల తరువాత ఆ పరిధిని ఉత్తర దిక్కున 100 కిమీ అంటే చీరాల దగ్గరలోని ఉప్పగుంటూరు వరకు నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పెంచింది. తద్వారా కృష్ణపట్నం ఓడరేవు యాజమాన్యానికి అంతర్జాతీయ ఓడరేవు నిబంధనలను ఉల్లంఘించి దక్షిణ కోస్తా తీరంపై గుత్త్ధాపత్యం కల్పించింది. కృష్ణపట్నం ఓడరేవుతో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్న రాజకీయ నాయకత్వం నేడు రామయపట్నం వద్ద ఓడరేవు ప్రతిపాదనను వెలుగులోకి రాకుండా అడ్డుపడుతున్నట్టు స్పష్టమవుతున్నది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామయపట్నం, నర్సాపురం,్భవనపాడు తదితర ప్రాంతాల్లో ఓడరేవులను నిర్మిస్తామని పదే పదే ప్రకటనలు చేసారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రైట్స్ సంస్థ సర్వే జరిపి ఓడరేవు నిర్మాణానికి రామయపట్నం అన్ని విధాలా అనుకూలమని సిఫార్సు చేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నివేదికను చెత్తబుట్టలో పడవేసి వౌనం వహించడం విస్మయం కలిగిస్తున్నది.
దొనకొండ పారిశ్రామిక వాడలో, కనిగిరి దగ్గరగల నిమ్జ్‌లో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలు రామయపట్నం వద్ద ఓడరేవు ప్రతిపాదనలు బుట్టదాఖలు కావడంతో ఇతర ప్రాంతాలకు తరలి వెడుతున్నారు. రామయపట్నం వద్ద అనుకూల పరిస్థితులున్నట్టు నిపుణుల బృందాలు నిర్ధారణ చేస్తున్నా అందుకు పెట్టుబడులకు పలువురు పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఆసక్తి కనబరచకపోవడం విచారకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని కొందరు ప్రముఖుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినగలవనే భయంతో అడ్డు తగులుతున్నట్టు పలువురు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వార్ధపర ఆర్థిక ప్రయోజనాల కోసం తెరపైకి తీసుకు వచ్చిన దుగరాజపట్నం ఓడరేవు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కార్యరూపం దాల్చాలని ఇప్పటి తెలుగుదేశం-బిజెపి నాయకులు పట్టుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కొందరు ప్రైవేటు పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాలు కాపాడడం ద్వారా తాము ఆర్థికంగా బలపడడం కోసం రాజకీయాలకు అతీతంగా రామయపట్నంకు అడ్డుగా నిలుస్తున్నారని భావించాల్సి వస్తుంది.

-చలసాని నరేంద్ర