Others

ఏదీ.. మన హీరోయిజం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా వ్యాపారమే. ఎవ్వరూ కాదనరు. కానీ, వ్యాపారంలోనూ నీతి, నిజాయితీ ఉంటుందిగా. ఆ వ్యాపారానికి
కీలక పాత్ర వహించే హీరోకి అంతో ఇంతో సామాజిక బాధ్యతా ఉండాలిగా. మరిక్కడ కథానాయకుడిని సమాజ కార్యంవైపు కూడా నడిపించేలా సినిమాలూ ఉంటే
ఇంకా ఇంకా బావుంటుందిగా.

కథను నడిపించేవి పాత్రలు. వాటిలో ప్రధానమైన వాడు హీరో. అందుకే కథా నాయకుడయ్యాడు. కానీ నేటి తెలుగు సినిమా హీరో రొటీన్ ఫార్ములా చట్రంలో చిక్కి ప్రేక్షకుల సహనంపై దాడి చేస్తున్నాడు తప్ప, సమాజ క్షేత్రంలో నాటుకుపోయిన కంటకాలను పెకిలించి జనం శ్రేయస్సు కొరకు పాటుపడే రోల్ మోడల్‌గా నిలవడంలేదు.

నేడు వస్తున్న తెలుగు సినిమాలన్నీ ‘వాణిజ్య అంశాల’ తాళింపులు తప్ప, వాటిలో ‘సామాజికోద్ధరణ అంశాల’ మేళవింపులు లేనేలేవిప్పుడు. ఇక కథానాయకుడు ‘హీరో’ అయ్యేదెప్పుడు? భలేవారండీ! ‘హీరో’లున్నారు కదా! అంటారా? యస్! యస్! యు ఆర్ రైట్! నేడు ‘హీరో’ అంటే డ్యాన్సులు చేసేవాడు, ఫైట్స్ ఇరగదీసేవాడు. ఫ్యాషన్ షోలా డ్రెస్సింగ్స్, (ఆంగ్ల నటుల్లా హెయిర్ స్టయిల్స్) మార్చుకునేవాడు. మరంతే కదండీ! కాదంటారా?
నేటి తెలుగు సినిమా హీరో అంటే ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని తెచ్చి అతగాడికి వీరోచితంగా కట్టబెడితే, అది విలన్‌కి లింకై ఉండటం, అతనితో చివరికంటా ఫైటింగ్! లేదూ తండ్రిని చంపినవారిపై హీరో పెద్దయ్యాక పగ తీర్చుకోవడం (ఇది మరీ పాత ఫార్మాలా అంటారా! ఒకే! ఒకే!), తండ్రిని మోసగించిన విలన్‌పై హీరో అదే టైపులో రివేంజ్ తీసుకోవడం.. అందుకాయన కూతుర్నే ముగ్గులోకి దింపడం (బెంగాల్ టైగర్, నాన్నకు ప్రేమతో)! కథ ఏం నడిపించాడ్రా డైరెట్రు? మన హీరో కూడా భలే మైండ్ గేమ్ ఆడేసార్రా! వేసేయండి మరి ఈలలు!!
ఇలాగిలాగే కథ ఈడ్నే బొంగరాలు తిరుగుతోంది తప్ప... ఇంచు కదలడం లేదు. మధ్య మధ్యలో ‘దెయ్యాలు’ తిరుగుతున్నాయనుకోండి కథల చుట్టూ. అవి కూడా హాస్యముంటే అలరిస్తున్నాయి తప్ప, భయపెట్టడంలేదు. ఈమధ్య సంసార పక్షపు ఆత్మలూ బయల్దేరాయ.. ఝడుసుకోకండేం? ఇలా పాత చింతకాయ పచ్చళ్లు తప్ప... హీరోకంటూ కొత్త ‘లక్ష్యం’ కథకులు ఏర్పరచడంలేదు. సినిమా వినోద మాధ్యమమే కావచ్చు. కానీ యువత నడవడికపై బలమైన అస్తమ్రని కూడా మేకర్స్ మరువరాదు. సామాజిక బాధ్యతనూ తలకెత్తుకోవాల్సిన అవసరమూ ఉంది మరి!
టికెట్ చిరిగింది! ఈల వేసాం, ఇంటికొచ్చాం! అని ప్రేక్షకుడు ఫీలవుతున్నాడుగా అని సినిమా తలకాయలు తలపోస్తే ఎవరూ చేసేదేమీ లేదు. ‘విద్యార్ధి భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకోవడం’ ఎంత వాస్తవమో ‘యువతపై సినిమా ప్రభావం అంతే పడుతుంది’ అన్న విషయమూ సత్యదూరం కాదని విస్మరించరాదు. అన్ని కోట్లుపెట్టి పిక్చర్ తీస్తున్నాం, ఇది వ్యాపారం అని సినిమా మేకర్స్ భావిస్తే ఎవరూ అనుకోవడానికి ఏమీలేదు. కానీ వ్యాపారంలోనూ నీతి, నిజాయితీలు ఉంటాయిగా! అంతో ఇంతో సామాజిక బాధ్యతా ఉండాలిగా. మరి ఇక్కడ కథానాయకుడని సమాజ కార్యంవైపు కూడా నడిపించేలా సినిమాలుంటే బావుంటుందిగా! అప్పుడు కదా మన కథానాయకుడు ‘హీరో’ అయ్యేది.. ఏమంటారు?

-అంజలి ఎనుగంటి