సబ్ ఫీచర్

జలసిరి లేక ‘సీమ’ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ చానళ్లలో మనకు తరచూ కనబడుతున్న దృశ్యాలు.. నీటి వనరులు మృగ్యమై ఎండిపోయిన పంటపొలాలు.. ఆశతో పెట్టుబడి పెట్టినా- నమ్ముకున్న భూమి బీడుగా మారాక బీదతనంలో దిక్కుతోచని అన్నదాతలు.. నీటి కోసం పొలంలో నాలుగుచోట్ల బోర్లు వేయించి వేయి అడుగుల లోతు వరకూ వెళ్లాం.. అయినా నీటి చుక్కను చూడలేదు.. కానీ- కన్నీటి చుక్కలే మిగిలాయి అంటున్నారు రాయలసీమ వాసులు.
అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఎందరో పేదలు కుటుంబాలతో ఇళ్లకు తాళం వేసుకుని బతుకు తెరువుకోసం కేరళ వెళ్లి వీధుల్లో కూలి పనుల కోసం పడే అవస్థలు వర్ణణాతీతం.. పని దొరికి ఒకరోజు గడిచి, ఉపాధి లభించక ఇంకోరోజు గడవక బతుకులు వెళ్లదీస్తున్నారు.. పాలకుల హామీలు బూటకాలే అని ప్రతిపక్ష నాయకుల సూటిపోటీ మాటలు షరామామూలే. అక్కడక్కడ- ‘ఇదిగో చూడండి.. ఈ నీరు మొదటిసారిగా ఈ గడ్డపై మావల్లనే తీసుకురాబడింద’ని నాయకులు గొప్పలు చెబుతూ చేసుకునే సంబరాల గురించి వింటుంటాము. రాయలసీమ గూర్చి నిజమైన స్థితి ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒకప్పుడు ‘రతనాల సీమ’గా భాసిల్లిన ఈ రాయలసీమ ఎప్పుడూ ఇలాగే ఉండేదా..?
మన ప్రభుత్వాధినేతలు ‘రాయల’ కాలం నుంచి వస్తున్న మైనర్ ఇరిగేషన్ పథకాలను ఎందుకు పక్కనపెట్టి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా వినబడేమాట ఏమిటనగా- వారి ఊరికి ఒక పంట చెరువు వుండేదని, అందులోకి పైనుండి వర్షపు నీటిని తెచ్చే కాలువలుండేవని, క్రమంగా ఆ కాలువలను పూడ్చి భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, పూడికను తీయించి చెరువులను లోతు చేయించే వారు లేక అవి ఆక్రమణకు గురయ్యాయనీ...
శ్రీకృష్ణదేవరాయల కాలం గడిచి అయిదు శతాబ్దాలు అయింది. అప్పటి చెరువులను కబ్జా చేసిన వారు ఎవరన్నది ఇపుడు కనుక్కోవడం కష్టమే. ఒకవేళ కబ్జాదారుల వారసులను కనిపెట్టినా వారిని శిక్షించడం సబబు కాదు. ఆ అవసరం కూడా లేదు. కానీ, ఇప్పటికైనా ప్రతి గ్రామానికి ఒక పెద్ద పంట చెరువును ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే- నేటి ప్రభుత్వం ప్రతివారినీ వారింట్లో ఇంకుడు గుంతను తవ్వించమని సూచిస్తోంది. చాలామంది ఇంకుడు గుంతలను తవ్వుతున్నారు. పెద్ద ప్రచార పటాటోపం చేస్తున్నారు కూడా. ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ స్థలాల్లో, పాఠశాలల్లో వర్షపు నీటిని పట్టి ఉంచడానికని ఇంకుడు గుంతల్ని తవ్వుతునే వున్నారు. మంచిదే. ప్రతి గృహ యజమానికి ఎంత ఖర్చు? కొందరు గృహ నిర్మాణంలో ఆరితేరిన కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్లను అడిగితే ప్రతి ఇంకుడు గుంతకు సుమారు 40 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రతి గ్రామానికీ ఒక పంట చెరువు తవ్వించే ఏర్పాటు చేయగలిగితే ఒక్కొక్క చెరువు కనీసం వేయి ఇంకుడు గుంతల ప్రయోజనాన్ని చేకూర్చగలదని అనిపిస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు పంట చెరువులు, దిగుడు బావులు తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేయించి, ఆ చెరువు నీరు తాగడానికి, పంటలకు మాత్రమే వినియోగించేలా చేశారు. నీరు కలుషితం కాకుండా వుండేట్టు చెరువుకి కాపలా కూడా ఏర్పాటు చేసేవారు. చరిత్ర నుండి పాఠం నేర్చుకొనక, మన పూర్వీకులేమి చేశారో తెలుసుకొనక- మనమే ఏదో చేసి చూపుదామని సాహసించడం ఎల్లప్పుడు వివేకం అనిపించుకోదు.
1950 ప్రాంతంలో రాయలసీమలో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగైదు సంవత్సరాలు వరసగా వర్షాలు పడకపోవడం వల్ల 1952లో దుర్భిక్షం ప్రభావం సీమవాసులపై తీవ్రంగా పడింది. అప్పటికి రాయలసీమ మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి నల్లాం చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. చిత్తూరు జిల్లా నుండి బళ్లారి వరకు అన్నీ కరవు కాటుకు గురైన ప్రాంతాలే. ఆ కరవు జిల్లాల్లోని ప్రజలను ఆదుకోవడానికి చాలాచోట్ల ప్రభుత్వమే గంజి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలకు ప్రభుత్వమే పశుగ్రాసాన్ని కూడా సరఫరా చేసింది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ ఆధ్వర్యంలో 1952లో రాయలసీమ సహాయతా సమితి ఏర్పడి నిర్వహింపబడిన కేంద్రాలు, కార్యక్రమాల గురించి నేటితరం వారు తెలుసుకోవాలి. అప్పట్లో విద్యార్థులు సైతం ఈ సహాయ కార్యక్రమాల్లో తమ వంతు సేవలను అందించారు. విశాఖ జిల్లా నుండి నేను, నాకు ఇంటర్మీడియెట్ వరకు సహాధ్యాయి అయిన మంత్రి మురళీమోహన్ పట్నాయక్ అనంతపురం జిల్లాకు వెళ్లాము. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఫార్మ్ మొదటి సంవత్సరం పూర్తి చేసి వేసవి సెలవులలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నా. నన్ను కదిరి తాలూకాలో కాలసముద్రం రైల్వేస్టేషన్‌కు దక్షిణాన మూడు మైళ్ల దూరంలోని చారుపల్లె గ్రామానికి పంపారు. మురళీమోహన్ పట్నాయక్‌ని రైల్వే లైన్‌కి ఉత్తరాన 5 మైళ్ల దూరంలోని వీరేపల్లిపేటకు పంపారు. అక్కడ గంజి కేంద్రాలను నిర్వహించే బాధ్యతను మాకు అప్పగించారు. సుమారు రెండున్నరమాసాలు అక్కడ పనిచేసి వచ్చాము.
చారుపల్లె గ్రామం ప్రవేశంలోనే ఒక నుయ్యి ఉండేది. అయితే అందులో నీటి జాడలేదు. దాన్ని లోతు చేయాలని ప్రయత్నించగా రాయి తగిలింది. బ్లాస్టింగ్ చేసి రాయిని పగలగొట్టి నీరు పడేవరకు తవ్వాము. తాగటానికి నీరు దొరికి కొంత ఊరట కలిగింది. చారుపల్లెలో ఏర్పాటు చేసిన గంజి కేంద్రం వద్దకు చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాల నుండి 2వేల మంది వరకు కరవు బాధితులు వచ్చి ప్రతిరోజూ గంజి తీసుకువెళ్లేవారు. రాయలసీమలో నిర్వహించిన గంజి కేంద్రాలన్నింటిలో పెద్ద కేంద్రంగా పేరుపొందింది చారుపల్లె కేంద్రం. ఒక్కొక్క వ్యక్తికి దాదాపు లీటరు పట్టే మగ్గుతో గంజి ఇచ్చేవారము. అక్కడ నేను చేరిన రెండు, మూడు రోజులకే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి మరిద్దరు సంఘ కార్యకర్తలు వచ్చి చేరారు. ముగ్గురం కలిసి గంజి కేంద్రం పని నిర్వహించాము. అక్కడ గ్రామంలోని యువకులు, పెద్దల సహకారం బాగా వుండేది.
గంజి కేంద్రంలో మా పని ఉత్సాహవంతంగా సాగేది. రోజూ పై వూళ్లనుండి వచ్చే బియ్యం బాగుచేయించి నూకలు చేయించి మర్నాటికి గంజి కాచడానికి సిద్ధం చేయడం, గంజి కాచడానికి పొయ్యిలోకి కట్టెలను సిద్ధపరుచుకోవడం, వంటకు కావాల్సిననీటిని సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేసేవారం. గంజిలోకి కావాల్సిన ఉప్పును, నంజుకోవడానికి ఉల్లిపాయల్ని సిద్ధం చేసుకోవడం, ఏరోజుకారోజు గంజి వితరణ తరువాత పాత్రలను శుభ్రంగా కడిగించి మర్నాడు గంజి కాచి వితరణ చేయడానికి సిద్ధం చేసుకోవడం మా పని. ఈ కార్యక్రమాలన్నిటికీ పర్యవేక్షకులు వి.ఎల్.దేశ్‌ముఖ్ గారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనంతపురం జిల్లా ప్రచారకులు డి.ఎస్.పి.రెడ్డి, విశ్వనాథయ్య, అలిమినేని వెంకటస్వామి, డి.నంజయ్య మొదలైన ఎందరో కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగా అందరికీ గంజిని అందించేవారం. ఆరోజుల్లో అనంతపురానికి చెందిన డాక్టర్ రాజా రామారావు అనే ప్రముఖ వైద్యుడు గంజి కేంద్రాలకు వచ్చి మల్టీ విటమిన్ మాత్రలు ప్రజలకు పంచిపెట్టేవారు. ఇలా కరవు సీమలో సేవకు సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు...
65 ఏళ్ల ముందు రాయలసీమ క్షామపరిస్థితిని చూసినవాడిని కాబట్టి.. నేటికీ అక్కడి పరిస్థితులు మెరుగవకపోవడం బాధ కలిగిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో ముఖ్యమంత్రులు రాయలసీమ నుండి వచ్చినవారే. భారత రాష్టప్రతిగా ‘సీమ’కు చెందిన నీలం సంజీవరెడ్డి దేశవ్యాప్తంగా కీర్తిని గడించారు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం మెండు. కానీ, ప్రజల కష్టనష్టాలను చూసేవారే సీమలో కరవయ్యారని అనిపిస్తోంది. కరవునివారణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే బాధ్యత ఉందని ప్రభుత్వాలు ఇకనైనా గుర్తించాలి.
ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద ఇరిగేషన్ పథకాల గురించి ఆలోచించే ముందు తక్షణ ప్రయోజనాలను ఇచ్చే మైనర్ ఇరిగేషన్ కింద పంట చెరువుల ఏర్పాటును గురించి ఆలోచిస్తే నీటి సమస్యకు కాస్తయినా పరిష్కారం లభిస్తుందని అనిపిస్తోంది. రాళ్లసీమగా వున్న ప్రాంతాన్ని అలనాడు రతనాల సీమగా చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రజాస్వామ్య యుగంలో పాలకుల ఉపేక్ష కారణంగా నేడు ఇది కరవుసీమ అయింది. దీనిని సస్యశ్యామలం చేసి బంగారు సీమగా చేయడం అందరి కర్తవ్యం.

-దుగ్గిరాల విశే్వశ్వరం