సబ్ ఫీచర్

తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష జాడేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వరైనా దేనినైనా ఎందుకు వదిలేసుకొంటారు? తమకు ఉపయోగపడకపోతేనో, పాడై పనికిరాకుండాపోతేనో..! అంతేగా..? మరి ప్రాచీనభాష హోదా కలిగి, ఇప్పటివరకూ విద్యాలయాల్లో బోధనా మాధ్యమంగా ఉపయోగపడి, ఎందరినో సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన తెలుగును బోధనా భాషనుండి తొలగించి, ఆ స్థానంలో ఆంగ్లాన్ని ఎందుకని ప్రవేశపెట్టబోతున్నట్లు? ఈ ప్రయత్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి జరిగింది. ఆంధ్రాన్ని తొలగించివేసి ఆ స్థానంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ‘ఆంధ్రప్రదేశ్’ అనే పేరు కొంత కాలానికి ‘ఆంగ్లప్రదేశ్’గా మార్పు చెందటం తప్ప! అలా జరిగినప్పుడు ఆదరించేవారు లేని అనాథగా తెలుగుభాష మారితే ఆ తప్పు ఎవరిది కాగలదు?
ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అనాథ కాదని ఎపి ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పడం సంతోషదాయకమే. కానీ, ఇప్పటికైతే అనాథ కాకపోయినా భవిష్యత్తులో భాషాపరంగా జరుగబోయే పర్యవసానాన్ని అనుసరించి ‘అనాథ’కాక ఏమవుతుంది? ఇప్పటికే- నిన్నమొన్నటివరకూ తెలుగును స్థానిక బోధన భాషగా కలిగిన తెలంగాణ నేడు తెలుగును వదిలేసి ఆంగ్లాన్ని బోధన భాషగా తమ విద్యాలయాల్లో ప్రవేశపెట్టి ‘తేటతెలుగు’కు తెగులు పట్టించే ప్రయత్నాన్ని ప్రారంభంచేసింది. ఆంధ్రప్రదేశ్ కూడ విద్యాలయాల్లో ఇదే విధానాన్ని అనుసరించినట్లయితే ఇరుగుపొరుగు రాష్ట్రాలవారు మన తెలుగును ఎలా ఆదరించగలరు? అంటే తెలుగు భాష ‘అనాథ’ కాబోతున్నట్లేకదా! వాడుకలో లేనటువంటిది.. భాషైనా, వస్తువైనా క్రమేపీ కనుమరుగు కావటమో లేదా పాడై హరించిపోవటమో జరుగుతూండటం సర్వసాధారణ విషయం. అలాంటప్పుడు కొందరు దూరదృష్టితో వీక్షించి కనుగొని తెలుగుభాష ‘మృతభాష’ కానున్నదని ముందుగానే ‘హెచ్చరిక’ చేయటం సత్యదూరమేమీ కాదుకదా!
చైనా దేశస్థుల లిపి అందమైన నమూనాతో గజిబిజి అల్లిక వంటి అక్షరాలతో కన్పిస్తూ పలికేందుకు కూడ ఇబ్బందిగానే అన్పిస్తుంటుంది. అందుకని వారు తమ భాషను వదిలేసుకొని ఇతరుల భాషను తమ విద్యాలయాల్లోకి బోధన భాషగా ప్రవేశపెట్టుకొంటున్నారా? ఏ భాషలోనైనాగానీ ఇబ్బందులు, కొన్ని సౌలభ్యాలు కలగలిసే వుంటుంటాయి. అది గమనించుకొనకుండా స్వభాషను ప్రక్కకు తొలగించేసి పరాయి భాషను తెచ్చి నెత్తికెక్కించుకొనటం ఎంతవరకు సబబు? ఐనా, చైనావరకు ఎందుకు గానీ కొందరు ‘విశాల హృదయులైన’ ఆంగ్లారాధకులు చెప్పగలరా? ఆంగ్లేయులు తమ ఆంగ్లాన్ని వదలి మన తెలుగును ఆదరించగలరేమో? ఆదరించరు సరికదా అభ్యసించనూ లేరని కచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే తగినంత వాక్సుద్ధి కలిగినవారికి మాత్రమే తెలుగు పట్టుబడుతుంది. అలాంటప్పుడు కొందరు తెలుగువారికెందుకో ఇంతటి ఉబలాటం- ప్రధాన బోధన భాషగా ఆంధ్రాన్ని తొలగించివేసి- ఆ స్థానంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలనే తపన?
ప్రపంచవ్యాప్తంగా వైజ్ఞానికంగా ఎంతగానో అనూహ్యమైన పురోభివృద్ధిని సాధిస్తుండిన ప్రస్తుత తరుణంలో విజ్ఞాన సంబంధిత పారిభాషిక పదాల వంటివి తమతమ భాషల్లో కొరవడినట్లయితే తగిన రీతిలో తర్జుమా చేసుకోవాలి. తర్జుమాకు వీలుకాదన్పించినపుడు యథాతథంగానే ఆయా పదాలను తమ స్వీయ భాషాలిపిలో వ్రాసికొనుట ద్వారా తమ స్వంత భాషాపరిధిని విస్తృతపరచుకొనే ప్రయత్నాలను చేయాలి. కానీ వేల సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతూ వస్తుండిన అమూల్యమైన అతి ప్రాచీనమైన సరళతరమై మృదుమధురమైనట్టి మన ఆంధ్ర భాషను అజ్ఞానంతో చేజార్చుకొని అన్యభాషకు పట్టం కట్టటం భావ్యమేనా? బహుశా అమ్మ మాట్లాడే భాషలో పసిపిల్లలకు పాఠాలను బోధిస్తే వారికి అర్థం కావటం లేదు కాబోలు! మన పసిపిల్లలు ‘రెంటికీ చెడ్డ రేవడిలా’ (ఆంధ్ర ఆంగ్లాలు రెంటికీ) తయారుకావటానికి యింతకంటే మంచి పద్ధతి వేరే యేమి వుంటుందని?
కొందరి దృఢాభిప్రాయం ప్రకారం తెలుగుభాష తిండి పెట్టదట?! ఇంగ్లీషు భాష తిండి పెడుతుంది కాబోలు? అది దృఢాభిప్రాయమో, దురాభిప్రాయమో వారికే తెలియాలి! తమతమ అవసరాల మేరకు, ఆసక్తి మేరకు అన్యభాషాధ్యయనం తప్పుకాదు సరికదా-తప్పనిసరి కూడా! కానీ, స్థానికమైన అత్యంత విలువైన తమ స్వంత భాషను పరిత్యజించి పరాయి భాషవెంట పరుగులు పెట్టటం ఎంతవరకు సమంజసం? మనలోని భావ వ్యక్తీకరణకు దోహదపడే స్థానిక భాష యేదైనాగానీ అది తమ మాతృభాష కంటే కూడ యెంతగానో విలువైనదని ప్రతివారూ గ్రహించగలగాలి! సారస్వతపరంగా గానీ, వాడుక దృష్ట్యాగానీ, మాండలీకం అనుసరించి గానీ మన ఆంధ్ర భాషకుగల వైశిష్ట్యం సాటిలేని మేటియైనది. మన తెలుగుకు దీటైన ఇంకొక భాష ప్రపంచం మొత్తంలోనే అరుదని చెప్పుకొనటానికి తెలుగువారంతా గర్వపడి తీరాల్సిందే. తెలుగును ‘మృతభాష’కానీయకుండా ‘అమృత భాషగా’ తీర్చిదిద్దుకొనటానికి కలసికట్టుగా అంతా కలసి ఎవరివంతుగా వారు కృషిచేద్దాం. అందువలన మనకు కలిగే మనశ్శాంతి, ఆనందం చెప్పనలవి కాదు.
తైలం కొరతతో రెపరెపలాడే దీపపు వత్తికి తైలమందించితే తిరిగి ఎలా ప్రకాశవంతవౌతుందో.. అలాగే మనందరి నిస్వార్థకృషితో మన ఆంధ్ర భాషను ‘మృతభాష’ కానీయక కలకాలం నిలచి వర్ధిల్లేలా సంరక్షించుకొనటం మనందరి గురుతరమైన బాధ్యత! తెలుగు భాష ‘తిండి’పెట్టదేమోనని వెనుకాడాల్సిన పనిలేదు. సంపూర్ణ జ్ఞానాన్ని నింపుకొని ఉన్న ఏ భాషయైనా ఉపాధిని తనకుతానుగానే అనే్వషించి సంపాదించుకోగలదు. పూర్వీకుల మాట ‘జ్ఞానమే దైవత్వం’ అని! అది భాషాపరంగానే కానీ ఏ రంగంలోనైనాకానీ! త్రికరణశుద్ధిగా చిత్తశుద్ధితో కృషిచేస్తే తెలుగుభాషయే కాదు ఏ యితర భాషైనా ఉపాధిని సాధించి పెట్టగలదు. కావలసినదల్లా సంపూర్ణత! మిడిమిడి జ్ఞానమనేది ఏ భాషలోనూ, ఏ రంగంలోనూ సరైన ఫలితాలను ఇవ్వదు, ఇవ్వనూ లేదు! ఏదైనాగానీ ఇది ‘నాది’లేదా ‘మనది’అనే స్వకీయమైన భావన అంతర్లీనంగా కలిగి వున్నపుడే దానిపట్ల శ్రద్ధ, బాధ్యతలనేవి ఏర్పడుతాయి. తెలుగును మన భాషగా భావించుకొన్నపుడే తగినట్టుగా ఆంధ్ర భాషాసేవ చేయగలుగుతాము.

- అమ్మాజీ.కె.