సబ్ ఫీచర్

స్ర్తిని గౌరవించడం సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాదికాలంనుంచీ ఈ వ్యవస్థ పురుషుడికి స్ర్తిని గౌరవించడం నేర్పలేదు. ‘యత్రనార్యస్తు పూజ్యంతే ..’ అన్న శ్లోకాలను ఉదాహరించినా.. ‘మనది అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ’ అని వాదించినా.. ‘ముందు స్ర్తి పేరు తర్వాతే పురుషుడి పేరు చెప్పారు’ అని సుమర్థించబోయినా అలాంటివాళ్ళకు దొరికే సమాధానం ఒక్కటే- ‘‘అవన్నీ కేవలం పురాణాలకు, కావ్యాలకు మాత్రమే పరిమితమయ్యాయని’! జీవితం విషయం వచ్చేసరికి ఆనాడు అయినా ఈనాడు అయినా స్ర్తి చులకన చేయబడుతూనే వుంది.. పురుషుని చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. రాముడు సీతను అనుమానించి.. అడవులకు పంపి అవమానించాడు. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదిని జుట్టుపట్టుకుని లాక్కొచ్చి.. చీరలొలిపించి అవమానించాడు. హరిశ్చంద్రుడు భార్యను నడివీధిలో నిలబెట్టి అమ్మేశాడు. ఇలా ఒకటా రెండా బోలెడు పురాణ కథలు.. చెబుతూ పోతే కొల్లలుగా బయటికి వచ్చి ఆనాటి స్ర్తిల దుస్థితిని కళ్ళకు కడతాయి.
ఆధునిక యుగం అని చెప్పుకున్న ఆ తర్వాతి యుగాల్లో సైతం ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు పేరిట స్ర్తిలకు అనేక ఆంక్షలు ఈ సమయంలో పుట్టుకొచ్చి ఆమెను అష్టకష్టాలపాలు చేశాయి. సతీసహగమనం, విధవలుగా దుర్భర జీవితం, పరదా వ్యవస్థ, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత వంటివన్నీ స్ర్తిల ఎదుగుదలను, అభివృద్ధిని ఆటంకపరచటమే కాదు స్ర్తి పురుష వివక్షతో ఆమెను కుంచించుకుపోయేలా చేసాయి. ‘గతం గతః’.. అయిపోయిందేదో అయిపోయింది. అప్పటి సామాజిక పరిస్థితులు అవి.. ఇంకా వాటిని ఎందుకు తవ్వి తలచుకుని బాధపడటం? అని ప్రశ్నించేవాళ్ళను అడగాలనుకున్నమాట ఒక్కటే.. ఈ నవనాగరిక యుగంలో ఈవ్ టీజింగ్‌లు, కిడ్నాప్‌లు, రేప్‌ల మాటేమిటని? పెద్ద పెద్ద చదువులు చదివి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తూ, లక్షల రూపాయల జీతం తెచ్చుకుంటన్నా.. కంపెనీకి పనికివెళ్లి ఇంటికి తిరిగి వచ్చేదాకా ఆమె మాన, ప్రాణాలకు భద్రత ఉందా? ఆడపిల్ల రోడ్డుమీద కనిపించగానే వల్గర్ మాటలతో ఆమెను ఏడిపించే మగ పిల్లలే కనబడుతారుగానీ ఆమెను గౌరవంగా చూసేవాళ్ళు ఒక్కరైనా కనబడతారా? ప్రేమించి మోసం చేసి పరారయ్యే కుర్రాళ్ళు.. పెళ్లాడి గృహహింసతో నరకం చూపించే మొగుళ్ళే తప్ప ఆడవాళ్ళని గౌరవించే మగాళ్ళు ఇంటగానీ బయటగానీ ఉంటున్నారా?
ఈ ప్రపంచంలో ఏ భర్త అయినా ‘నా భార్య అంటే నాకు చాలా ప్రేమ’ అని చెబుతాడేమోగానీ ‘నా భార్య అంటే నాకు చాలా గౌరవం’ అని చెప్పేవాడు ఒక్కడూ కనబడడు. ‘్భర్యను గౌరవించడం ఏమిటి.. అది నా మేల్ ఇగోకి భంగం! నా పురుషాధిక్యత మట్టికరిచిపోతుంది’ అన్న ఆధిక్య భావం వాళ్ళ నోట ఆ మాట రానివ్వకుండా చేస్తుంది. అసలు కొంతమంది భర్తలకు ‘గౌరవం’ అన్న మాటకు అర్థం కూడా తెలియదు. ప్రేమ, గౌరవం రెండూ ఒకటే.. ప్రేమిస్తే గౌరవించినట్టే’ అనుకునేవాళ్ళూ ఉన్నారు కొందరు ప్రబుద్ధులు. పగలంతా సూటిపోటి మాటలతో బాధపెట్టి.. తిట్లు, ఛీత్కారాలతో కించపరిచి, చెయ్యి కూడా చేసుకుని ఘోరంగా అవమానించి రాత్రికాగానే అవసరం కొద్దీ పక్కన చేరి... ‘అదే ప్రేమంటే’ అనుకునే మగరాయళ్లకు ఇక గౌరవించటం అంటే ఏమిటో తెలియాలంటే అదో బ్రహ్మపదార్థమే!
స్ర్తిలను గౌరవించడం ఉత్తమ పురుషుల సంస్కారానికి చిహ్నం. మర్యాదపూర్వకమైన ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక శరీర భాష చాలు అతనిలో స్ర్తిలపట్ల ఎంతటి గౌరవముందో తెలియచెప్పటానికి. పరిచయస్థురాలైన స్ర్తి ఎదురుపడగానే చేతులు జోడించి నమస్కారం చేయటం ‘బాగున్నారా?’ అని పలకరించటం.. ‘ముందు మీరు..’ అంటూ ప్రతిపనికీ ఆమెను ముందుంచి, తను వెనక నిలబడటం, సభావేదిక మీద భార్యను సైతం ‘శ్రీమతిగారు’ వంటి గౌరవ వచనాలతో సంబోధించడం, బస్సులో మహిళకు కేటాయించిన సీట్లలో తను కూర్చోకపోవడం, గర్భిణిలు, పిల్లల తల్లులు బస్సెక్కినప్పుడు తనులేచి నిల్చుని వాళ్ళకు తన సీటు ఆఫర్ చేయడం వంటి చిన్న చిన్న గౌరవాలు స్ర్తికి సంతోషాన్ని, సంతృప్తిని కలిగించటమే కాదు.. ఆమె దృష్టిలో పురుషుని స్థానాన్ని, ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. స్ర్తి అల్పసంతోషి.. ‘తిన్నావా?’, ‘బాగా అలసిపోయావా?’, ‘ఈరోజు ఎందుకలా నలతగా కన్పిస్తున్నావ్?’ వంటి చిన్న చిన్న ప్రశ్నలు, ఆరాలు ఆమె మనసుకు చాలా గౌరవప్రదమైన భావనను కలుగజేస్తాయి.
‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్’ అన్న ఆంగ్ల నానుడిని బట్టి గౌరవం అనేది పరస్పరం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేది అనుకున్నా ఆ విషయంలో స్ర్తిలకు సాటి ఎవరూ లేరు.. పురుషుడిని గౌరవించడం అనేది ఆమెకు పుట్టుకతో వచ్చిన సంస్కారం. తండ్రిని పాదాభివందనాలతో, ‘నాన్నగారూ!’ అన్న పిలుపుతో
గౌరవిస్తుంది. భర్తను ‘మీరు’ అని, ‘ఏమండీ’ అని పిలిచి గౌరవిస్తుంది. పతిని ‘ప్రత్యక్ష దైవం’ అని భావించే అలనాటి పురాణ సంస్కృతి ఇంకా ఇప్పటికీ ఆమె నరాల్లో భద్రంగా ఉంది. ఎన్ని చదువులు చదివినా.. ఎంత ఎదిగినా మన సంస్కృతీ సంప్రదాయాల వాసనలు స్ర్తిలను అంత త్వరగా విడిచిపోవు. కనుక స్ర్తి పురుషుడిని గౌరవిస్తుంది. తిరిగి అదే గౌరవాన్ని ఆశిస్తుంది. ఈ అల్ట్రామోడ్రన్ యుగంలో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని, హబ్బీని పేరుపెట్టి పిలిచే, సమాన హక్కుల కోసం పోరాడే ఆధునిక యువతులకైనా సరే కొత్త రీతుల్లో ఎదుటివాళ్ళను గౌరవించటం వాళ్ళకు తెలుసు.. అలాంటి గౌరవం అటు నుంచి రాకపోతే మాత్రం సహించరు.. అడిగి అయినా, అరిచి అయినా తీసుకుంటారు.. స్ర్తిని గౌరవించటాన్ని పురుషులకు నేర్పిస్తారు.

-కొఠారి వాణీచలపతిరావు