సబ్ ఫీచర్

అక్కరకు రాని చట్టం.. అవస్థల్లో బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదనే చెప్పాలి. బాల కార్మికుల్ని చదివించేందుకు పాఠశాలల్లో చేర్పిస్తున్నామని అధికారులు గణాంకాలు చూపిస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బాల కార్మికులు దర్శనమిస్తునే ఉన్నారు. అధికారులు చెబుతున్న గణాంకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆటపాటలతో, చదువులతో సరదాగా గడపాల్సిన ఎంతోమంది పిల్లల జీవితాలు కళ్లముందే బుగ్గిపాలవుతున్నా ఏమీ చేయలేని స్థితి.
ప్రపంచంలో అనేక అందమైన వస్తువులన్నీ బాలకార్మికుల హస్తాలే తయారుచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం బాలకార్మికులు ఇరవై కోట్ల పైచిలుకు ఉన్నారనేది ఓ అంచనా. మన దేశంలోనూ వీరి సంఖ్య ఎక్కువే. కొలంబియా ఇటుకల పరిశ్రమ, మొరాకో చలువరాళ్లు, సూడాన్ పత్తిపంట వెనక బాలకార్మికుల శ్రమ ఉంది. ఇక అగ్గిపెట్టెల తయారీలో ఎక్కువ శాతం బాలకార్మికులే ఉన్నారు. శివకాశి, సూరత్, జైపూర్ వజ్ర పరిశ్రమ, అలీగఢ్‌లో తాళాల పరిశ్రమ, జమ్ము- కశ్మీర్ తివాచీ పరిశ్రమ ఇలా అనేక చోట్ల బాలకార్మికులు తమ హక్కులను కోల్పోతూ పనిలో నిమగ్నమవుతున్నారు. కొంతకాలం క్రితం అమెరికా, జర్మనీ దేశాలు మన దేశంలో తయారైన తివాచీలను దిగుమతి చేసుకోవడం నిషేధించింది. అందుకు కారణం బాల కార్మికులు వాటిని తయారుచేయడమే. ఫ్యాక్టరీ యజమానులు పిల్లన్ని ఎక్కువగా నియమించడానికి కారణం తక్కువ ఖర్చుతో పని వేగంగా, చక్కగా అయిపోతుంది. బాలకార్మికుల వల్ల యజమానులకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వీళ్లవల్ల కార్మిక సంఘాల బెడద ఉండదు. ఎందుకంటే పిల్లల పేర్లను రిజిస్టర్లలో నమోదు చేయరు. నేడు గనులలో పని చేసే ఎంతోమంది యువకులు ఒకప్పటి బాల కార్మికులే. వారి బాల్యం, కౌమార్యం పలకరాతి గనుల్లో సమాధి అయిపోయాయి. వీళ్లు పరిశ్రమలలో పనిచేసి వచ్చాక ఇళ్లల్లో కూడా చాకిరీ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, పనిలోకి వెళ్లడానికి నాలుగైదుకిలోమీటర్లు నడవాలి. అందువల్ల వీరికి చదువుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. పలకల ఫ్యాక్టరీలో పిల్లల్ని ఎక్కువగా నిమమించుకోవడానికి ముఖ్య కారణం మేకులు పట్టుకోవడానికి వాళ్ల వేళ్లు సౌకర్యంగా ఉంటాయి. పసివాళ్లు మేకులు పట్టుకుంటే పెద్దవాళ్లు సుత్తితో కొడుతుంటారు. ఆ కారణంగా ఒక్కోసారి పిల్లల చేతులకు దెబ్బలుతగిలే అవకాశం కూడ లేకపోలేదు. బాణసంచా తయారీలో కూడా పిల్లల భాగస్వామ్యమే ఎక్కువగా వుంటుంది. పాపం ఆ చిన్నారులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడే సందర్భాలు ఉన్నాయి. పగిలిన పెదాలు, గాయపడ్డ చేతులు, చింపిరి జుట్టు, శుష్కించిన శరీరాలు ఇంచుమించు క్రీనీడల్లా కనిపిస్తుంటారు అక్కడ పనిచేసే బాల కార్మికులు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాలకులు ఎనె్నన్నో చట్టాలు చేస్తున్నారు. కఠిన శిక్షలు తప్పవని ప్రకటనలు, హెచ్చరికలు గుప్పిస్తున్నా ఆశించిన ఫలితాలు అంతగా కానరావడం లేదు. 14 ఏళ్లలోపు పిల్లలు తమ ఇళ్లలో పనికి సహాయపడవచ్చు. కానీ ఇతరులు వారిని ఎలాంటి పని చేయడానికి వినియోగించినా అది నేరవౌతుందని, దానికి కఠిన శిక్ష తప్పదని ఆమధ్య పార్లమెంటు ఆమోదించిన కొత్త బిల్లులో పొందుపరిచారు. పిల్లల చేత పని చేయించే తల్లిదండ్రులకు సైతం జరిమానాలు కట్టవలసి ఉంటుందని బిల్లులో స్పష్టం చేసారు. అయినా ఫలితాలు అనుకున్నంత రీతిలో కానరావడం లేదు. నేటికీ పలుచోట్ల పని చేస్తున్న బాలకార్మికుల్ని చూసి కూడా చూడనట్టు ప్రవర్తిస్తున్నారు ప్రలోభాలకు గురవుతున్న అధికారులు.
బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలన జరగాలంటే అధికారుల్లో, ఫ్యాక్టరీల యాజమాన్యాల్లో చిత్తశుద్ధి ఉండాలి. పసివాళ్ల చేత పనులు చేయించకూడదన్న పాపభీతి ఉండాలి. తాత్కాలిక అవసరాల కోసం పిల్లల్ని చదువులకు దూరం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయకూడదన్న భావన తల్లిదండ్రుల్లో ఉండాలి. ఇవాళ ప్రజల్లో అంతో ఇంతో చైతన్యం రావడం వల్ల కొందరైనా తమ బిడ్డల్ని పనుల్లోకి పంపకుండా స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. ఈ పరిణామం ఎంతైనా హర్షణీయమే. ఇటువంటి వారి సంఖ్య ఇంకా పెరగాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాడితే అనుకున్నది సాధించుకోగలుగుతాం.

-దూరి వెంకటరావు