సబ్ ఫీచర్

త్రిభాషా సూత్రాన్ని అనుసరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలుగువారికి తమ మాతృభాషపై మక్కువ పెరిగింది. తమ మాతృభాష కనుమరుగైపోతుందేమోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడక్కడ తెలుగు మాతృభాష దినోత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ప్రపంచ తెలుగు భాష మహాసభలు కూడా జరుపుతున్నారు. తెలుగు మాతృభాష సమ్మేళనాలను ఛోటామోటా సంస్థలవారు జరుపుతున్నా, ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నా తెలుగుభాష గొప్పదనాన్ని, కమ్మదనాన్ని సాహిత్యాన్ని గురించి వెలుగెత్తి చాటడం సాహితీవేత్తలను సన్మానించడం, పొగడడం, రచయితలు, కవులు, వారి వారి కవితలను వేదికమీద వల్లెవేసి గానంచేసి ఒకరినొకరు పొగుడుకుని అల్పానందం పొందడం వరకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణ శూన్యంగానే మిగిలిపోతున్నది. ముక్కుపచ్చలారని చిన్నారుల తొలి పలుకులు మమీడాడీలనుండే ప్రారంభమవుతున్నాయ.ఈ మమీడాడీలు పట్టణవాసులకో, అక్షరాస్యులకో పరిమితం కాదుసుమా! గ్రామవాసులకు, బామ్మలకు, జేజమ్మలవరకు ఎగబాకాయ. ఇందుకు కారణాలనుకూడా అనే్వషించవలసి ఉంది. మన దేశ జనాభాకు సరిపడ ఉద్యోగం, ఉపాధిని ప్రభుత్వాలు కల్పించకపోవడంవల్ల మన యువకులు ఉద్యోగాలకై విదేశాలకు వలస వెళ్లి రావడం ఒక కారణమైతే విదేశాల్లో ఉద్యోగం చేయవలసిన వారికి ఇంగ్లీషు భాష తప్పనిసరి కావడం మరో కారణం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి మన రాష్ట్రంలో త్రిభాషా సూత్రం అనుసరించే విద్యా బోధన జరుగుతున్నది. ఈ విద్యావిధానం ద్వారా చదువు అభ్యసించినవారు ఆనాటినుండి ఈనాటి వరకు కూడా వేల సంఖ్యలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. మంచి ఆదరణ పొందుతూ ఉన్నత స్థానాలకు వెళ్లినవారు ఎందరో అన్న విషయాన్ని గుర్తించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వేతర ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించడం, నిరక్షరాస్యులైన గ్రామ ప్రజల్లో కూడా ఇంగ్లీషు వ్యామోహం పెరగడంకూడా తెలుగు భాష కనుమరుగైపోతుండడానికి మరో కారణం. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఆయా భాషల ఉపాధ్యాయులను పాఠశాలలో నియుక్తి చేయపోవడం పాఠశాలల నిర్వహణను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంవల్ల ఉత్తమమైన విద్యా ప్రమాణాలను సాధించలేకపోవడంవల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు సదభిప్రాయం కోల్పోతున్నారు. అందువల్ల కూడా ఇంగ్లీషు మీడియం పాఠశాలకు ప్రజలు బారులు కడుతున్నారు.త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తూ మాతృభాష మాధ్యమంగా విద్యావంతులను ఈ సమాజానికి అందిస్తామని కంకణం కట్టుకుని దాదాపు నలభై సంవత్సరాలపైబడిన స్వచ్ఛంద విద్యాసంస్థలు కూడా ఇంగ్లీషు మాధ్యమంలో విద్యనందించడం ప్రారంభించడం వైపరీత్యం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుభాష సమ్మేళనాలు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినంత మాత్రాన తెలుగుభాష కనుమరుగు కావడాన్ని ఎవరూ ఆపలేరన్నది జగమెరిగిన సత్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషు మాధ్యమంలో ఎన్ని పాఠశాలలు నడుపుతున్నా లక్షలమంది విద్యార్థులు చదువుతున్నా ఇరవై శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నత ప్రమాణాలు సాధిస్తున్నారని సర్వేసంస్థలు చెపుతున్న మాట. మాతృభాష తెలుగు మాధ్యమంగా విద్యనభ్యసించిన వారే విదేశాల్లో మంచిగా వారి విధుల్లో రాణిస్తున్నారు. సమర్ధవంతంగా పనిచేయగలుగుతున్నారని ఈ మధ్యనే అమెరికా సర్వే సంస్థ పేర్కొనడం జరిగిందన్న విషయాన్ని మేధావులందరు గుర్తించాలి. కనీసం పదవ తరగతి వరకు త్రిభాషా సూత్రం అనుసరించి తెలుగుభాష మాధ్యమంగా ఆయా భాషా కోవిదులైన ఉపాధ్యాయులను నియామకం చేసి పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహించినపుడే మాతృభాషను కాపాడగలరు.

-బలుసా జగతయ్య