సబ్ ఫీచర్

కొంపలు కూలుస్తున్న మద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం జీవిస్తున్న భూమీద మనుషులతోపాటుగా అనేక యితర ప్రాణులు వున్నాయి. అయితే అన్నిటికన్న మానవ జీవితం ఉత్కృష్టమైందని చెప్పుకుంటాం. అటువంటి మానవ సమాజం అనేక రుగ్మతల కారణంగా మానవ జాతికున్న విలువలు కరిగి పోవడాన్ని చూస్తున్నాం. ఒక వ్యక్తి రుగ్మతతో బాధపడితే వ్యక్తిగతవౌతుంది. అదే కొంతమంది బాధపడితే అది సామా జికం అవుతుంది. అవినీతి, స్ర్తి వ్యామోహం, లంచగొండితనం, వాణిజ్యంగా మారిన రాజకీయం వంటి రుగ్మతలు మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాట యదార్థం.
మనం నివశిస్తున్నది మానవ సమాజంలో అని మరిచిపోకూడదు. ఎవరి మనసుకి తోచిన విధంగా వాళ్ళు వ్యవహరిస్తే, తత్కారణంగా మరొక మనిషికి లేదా మనుషులు జీవిస్తున్న పరిసరాలకి యిబ్బంది కలగవచ్చు. అలా కలగకుండా క్రమశిక్షణతో జీవనం సాగించవలసిన బాధ్యత మనుషులం అనుకునే మన మీద ఉంది. క్రమశిక్షణా రాహిత్యంవలన వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం వుంది. అందువలన, మనిషి నిత్య జీవితంలో సక్రమ ప్రవర్తనకోసం కొన్ని హద్దులను నిర్ణయించి, చట్టాలుగా రూపొందించటం జరిగింది. మనిషికి స్వేచ్ఛ వున్నప్పటికీ విచ్చలవిడితనాన్ని వీడి, చట్టపరిధిలోనే జీవనయానం సాగించాల్సి వుంది.
క్రమశిక్షణ వలన మనిషికి గౌరవం, సమాజంలో ఉన్నతమైన స్థానం లభిస్తాయి. వాటిని నిలుపుకుంటూ భవిష్యత్తు వైపు సాగిపోవడం మన కర్తవ్యం అయివుంది. అందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కారణం, క్రమశిక్షణ త ప్పిన నడతవల్ల సమాజానికి అంటే తోటి మనుషులకి యిబ్బంది కలుగుతుంది లేదా నష్టం కలుగుతుంది. ఉదాహరణకు ఒక అంశాన్ని తీసుకుందాం. అనాదిగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న వాటిల్లో మద్యం ముఖ్యమైంది. మద్యాన్ని, మనిషి నుండి వేరుచేయటం అసాధ్యమైన పనిగా మిగిలి పోయింది. మద్యం సేవించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఈ జాడ్యం చివరకు స్ర్తిలవరకు పాకడం దురదృష్టకరం.
మద్యం సేవించడం వలన అనేక మంది జీవితాలను కోల్పోవడం మనం నిత్యం చూస్తున్నాం. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కూలిపోవటం గమనిస్తూనే వున్నాం. ఆరోగ్యం పాడై రోగగ్రస్తుడై, జీవితాన్ని కోల్పోవడమన్న నగ్నసత్యం ఎరుగుదుం. ఈ సత్యాలు మద్యం సేవించే వారికీ తెలుసు. సేవించని వారికీ తెలుసు. మద్యం విక్రయించే వారికీ తెలుసు. విక్రయించేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వానికీ తెలుసు. తెలిసి చేసేది అది తప్పు అయినప్పుడు మూర్ఖత్వం అవుతుంది. మద్యం తయారీలలో గాని, విక్రయాలలో గాని పరిధిలు ప్రామాణికంగా కనిపించవు. ఆదాయమే ప్రమాణం. దీనిపైన వచ్చే ఆదాయం ఊహాతీతం అనేది వాస్తవం.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. మద్యం సేవించడానికి అభ్యంతరాలు లేకపోవచ్చు గాని, మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో ఆంక్షలున్నాయి. అది ద్విచక్ర వాహనం కావచ్చు; బహుచక్ర వాహనం కావచ్చు. ఏదైనప్పటికీ మద్యం సేవించిన వాడు వాహనాన్ని నడుపరాదు అనే ఆంక్ష ఉంది. మోటారు వెహికల్స్ చట్టం 1988లో సెక్షన్ 185 ఈ విషయాన్ని రూఢి పరుస్తుంది. ఈ సెక్షన్‌ను అనుసరించి ఎంతటి వారైనా మద్యం సేవించి గాని, మాదక ద్రవ్యాలు వినియోగించి గాని వాహనం నడుపుట నేరం అవుతుంది. ఆ విధంగా నడిపినప్పుడు ఆల్కహాల్ ఏ శాతంలో వుందో తెలుసుకోవడంకోసం బ్రీతింగ్ ఎనలైజర్ అనే పరికరాన్ని వినియోగిస్తారు. ఈ పరికరం ద్వారా పరీక్ష చేసినప్పుడు, 30 మి.గ్రా.ల కంటె ఎక్కువ ఆల్కాహాల్ కంటెంట్స్ ఉన్నట్లు రూఢి అయతే ఆ వ్యక్తి నేరం చేసిన వాడుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
నేరం చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షించవలసి ఉంది. శిక్ష గురించి కూడా సెక్షన్ 185 ఆఫ్ మోటారు వాహనాల చట్టంలో వివరించటం జరిగింది. మొదటిసారి మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే, ఆరునెలలు కారాగారశిక్ష లేదా రు.2000/- వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చు. అలాగే మొదటి నేరం జరిగిన 3 సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి అదే విధమైన నేరం జరిగినట్లయితే 2 సంవత్సరాల జైలుశిక్ష లేదా రూ.3000/- జరిమానా విధించవచ్చు. లేదా రెండింటిని కూడా విధించవచ్చు.
మద్య నిషేధం కోరుతూ జరిగిన అనేక ఉద్యమాలు నీరుకారిపోవడం మనకి తెలుసు. ‘‘నా జీవిత విధానం గాంధేయ మార్గం, నా ఆలోచన సోషలిస్టు తత్త్వం అని ప్రకటించుకున్న వావిలాల గోపాలకృష్ణయ్యగారు సైతం ఉద్యమాన్ని నిర్వహించి విజయం పొందలేకపోయారు.’’ 9-9-1995న సంపూర్ణ మద్య నిషేధం సక్రమంగా అమలుకోసం 10 సూచనల్ని ప్రభుత్వాన్ని చేసింది.
ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పాలి. ఈమధ్య మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా వుండడంతో పోలీసుశాఖవారు నిఘాను పెంచి, నిత్యం తనిఖీలను నిర్వహించటం, దొరికినవారిని కోర్టుల ముందు హాజరుపర్చటం, జరిమానాలు విధించటం, మోతాదు ఎక్కువైన వారికి జైలు శిక్ష కూడా విధించటం జరుగుతూనే వుంది. అనేక రోడ్ల కూడళ్ళలో మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం అనే విషయాన్ని మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. వార్తాపత్రికల ద్వారా ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలలో మార్పు కనిపించడం లేదని అనిపిస్తోంది. దినచర్యలో మద్యం సేవించటం ఒక భాగం అయిపోయిన నేటి తరుణంలో ఒక్కసారిగా మార్పు రావాలని కోరుకోవటం అమాయకత్వం అవుతుంది. మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల కలిగే పరిణామాలు గురించి, అటువంటి నేరాలకి చట్టపరమైన శిక్ష గురించి తరచు ప్రకటనలు చేస్తుండాలి. అదే విధంగా ఇటువంటి నేరాలలో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సులు ఒక నెల వరకు సస్పెండ్ చేయటం కూడా అవసరమేమో. ప్రభుత్వం ఆలోచన చేయాలి. బలవంతంగానైనా మంచిని అలవర్చటం తప్పుకాదు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారందరు సామాన్యులే. మద్యం సేవించడానికి కొంత సొమ్ము ఖర్చుచేసి, పట్టుబడితే జరిమానాగా మరికొంత సొమ్మును నష్టపోతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకున్నట్లయితే కొంతలో కొంతైనా ప్రయోజనం కలుగుతుందేమో. నమ్మకాన్ని మించిన బలం మరొకటి లేదు. మార్పు జరుగుతుందని నమ్ముదాం. మార్పుకోసం ప్రయత్నిద్దాం.

- ఎస్.ఆర్.పృథ్వి