Others

పౌర హక్కుల ఉద్యమ సారథి శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(పౌరహక్కుల ఉద్యమం ఆరంభమై 55 ఏళ్లు నిండిన సందర్భంగా)
*
‘శ్రీశ్రీ’గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితల సంఘం (విరసం) నేతగా, సినీకవిగానే చాలామందికి తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉద్యమం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఆయన ‘హక్కుల సేనాని’గానూ సేవలందించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన మానవ హక్కుల ఉద్యమ సభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ పాలకుల నియంతృత్వ ధోరణులపై నిరసన గళం వినిపించారు. సరిగ్గా 55 ఏళ్ల క్రితం తెలుగు నేలపై మానవ హ క్కుల ఉద్యమం ఆవిర్భావం వెనుక ఘన చరిత్ర ఉంది.
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్ర ముఖ సిపిఎం నేత, దివంగత డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి- ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించినపుడు నిర్బంధానికి గురైన వారిలో ఒకరు. ఆయనతోపాటు జిల్లా ‘మేధావి త్రయం’గా అప్పట్లో పిలువబడ్డ బోడేపూడి వెంకటేశ్వరరావు, కేవి సుబ్బరావు అనే ఇద్దరు లాయర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ముగ్గురినీ అరెస్టు చేయకముందు, ఆ తర్వాత మరెందరినో అరెస్టు చేసినపుడు వారి మదిలో మెదిలిన ఆలోచన- దేశవ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమానికి అంకురార్పణ.
నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్య అని గ్రహించింది ఈ ‘మేధావి త్రయం’. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాలని భావించారు. రాజకీయ, పౌర హక్కులకు భంగం వాటిల్లింది కాబట్టే ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు పొందాలని ‘మేధావిత్రయం’ భావించింది.
ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌ రహక్కుల ఉల్లంఘన, భవిష్యత్తులో సిపిఐపై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి సిపిఐ నాయకులకు నచ్చచెప్పింది ‘మేధావిత్రయం’. కలసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలోనే ఒక సదస్సు నిర్వహించి పౌరహక్కుల సంస్థను స్థాపించి అదేరోజు బహిరంగ సభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృతడాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం. ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇఎంఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు.
ప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకూ పౌరహక్కుల సమస్యే తలెత్తదు. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలెత్తితే- పౌరహక్కుల సమస్య తెరపైకి వస్తుంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అదే రాజ్యాంగంలో అవసరమైనప్పుడు ప్రభుత్వానికి అండగా వుండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందుపరిచిన కొన్ని నిబంధనలు, ఎమెర్జెన్సీ లాంటి సమయాల్లో పౌరహక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది.
1962నాటి భారత్ చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ముందస్తు నిర్బంధ చట్టం’ (పీడీ యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, పౌరహక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ, పియుడిఆర్, పంజాబ్ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పియుసిఎల్ లాంటి కొన్నింటిని ప్రధానంగా చెప్పవచ్చు. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఉద్యమించిన పౌరహక్కుల సంఘాలు క్రమేపీ తమ పరిధిని విస్తృతపరుచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలకు చాలా ముందే అంటే 1965లోనే విజయవాడలో ఆవిర్భవించబోయే ‘పౌరహక్కుల సంస్థ’ ఆవిర్భావ బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, ఇఎంఎస్‌లతోపాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసింది ‘మేధావి త్రయం’. అప్పటి చర్చల్లో మహాకవి శ్రీశ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభాముఖంగా. పౌరహక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావిత్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కెవిఎస్ ప్రసాదరావును ఎన్నుకున్నారు.
పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా తొలుత ఉదయం పూట నాలుగైదు వందల మంది వరకు హాజరుకానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సిఉంది. సదస్సు ఆరంభంలో సిపిఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతర్ రాజకీయ పరమైన హరికథను చెపుతూ కేవలం సిపిఎంకు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో సిపిఐ వారి నుండి తీవ్ర నిరసన వ్యక్తమై వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. సదస్సు నిర్వహణ అంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ నిరసన తెలుపుతూ సిపిఎం వారిని దూషించుకుంటూ, సదస్సు నుండి వారు వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా అప్పటికి విజయవాడ చేరుకున్న కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తి చేసారు. కార్యకర్తల, సానుభూతిపరుల కోరిక మేరకు డాంగే సహా సిపిఐకి చెందిన నాయకులు, కార్యకర్తతలు ఎవరూ కూడా సభకు హాజరు కారాదని నిర్ణయం తీసకున్నారు. మొత్తం మీద సిపిఐ వారెవరు రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంస్థ (ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్-ఎపిసిఎల్‌ఏ)పేరుతో రాష్టస్థ్రాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలని, ఉద్యమాన్ని జిల్లా, గ్రామ స్థాయికి తీసుకుపోవాలని ప్రతి స్థాయిలోను నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచింది ‘మేధావిత్రయం’.
ఎపిసిఎల్‌ఏ అధ్యక్షుడిగా మహాకవి శ్రీశ్రీని, కార్యదర్శిగా కడియాల గోపాలరావును,ఉపాధ్యక్షులుగా కె. వి.సుబ్బారావు, కెవిఎస్‌ఎన్‌ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు, డాక్టర్ వై.రాధాకృష్ణమూర్తితో పాటు మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్టదలచిన కార్యాచరణ పథకాన్ని సభాముఖంగా బహిరంగపరిచారు. నలభై వేల మందికి పైగా హాజరైన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకున్నారప్పట్లో.
ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఎపిసిఎల్‌ఎ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూలు, అనంతపూర్, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో సభలు జయప్రదంగా నిర్వహించారు. మూడు జిల్లాల్లో జరిగిన సభలకు శ్రీశ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటిసారి ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటికన్నా బాగా జరిగింది. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున మేధావిత్రయంతో పాటు న్యాయవాది కర్నాటి రామ్మోహనరావును, రాష్టవ్య్రాప్తంగా ఉన్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.
వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో వారు లేకపోయినా, అరెస్టయిన పదిరోజులకు స్థానిక న్యాయవాది, కమ్యూనిస్టు సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమరావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు సభ జరిగింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీశ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్టవశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది. సూర్యాపేట సభ జరిగిన వారం లోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్ధరాత్రి అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకి పంపింది ప్రభుత్వం. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన పౌరహక్కుల ఉద్యమం అంతటితో ఆగిందనాలి.

- వనం జ్వాలా నరసింహారావు