సబ్ ఫీచర్

ప్రజల నాడిని పసిగట్టడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా వసంత ఋతువు రాకముందే ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్లు ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే ఈమధ్య వైకాపా ‘మ్యానిఫెస్టో’ కోయిల కూసేసింది. అది తొందరపాటు కాదు, రాజకీయ వ్యూహం అని కొంతమంది అంటున్నారు. అ యితే అయి ఉండవచ్చు.. ఎందుకంటే ఈమధ్యనే వైకాపా అధినేత జగన్ కొత్తగా ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్తను కొన్ని కోట్ల రూపాయల ఫీజుతో రంగప్రవేశం చేయించాడు. ఇంతకుముందు ఈయన తన రాజకీయ చాతుర్యంతో.. ప్రత్యర్థి పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయగల వ్యూహరచనా నైపుణ్యంతో మోదీని గెలిపించి భారత ప్రధానిని చేశాడని, అరవింద్ కేజ్రీవాల్‌కి దిల్లీ ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి పరిపాలనా పగ్గాలు చేతికిచ్చాడనీ మంచి పేరుంది. ‘ప్రజల నాడిని ఇట్టే పట్టేసి బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లను ఇబ్బడిముబ్బడిగా పడేయించగల.. మేధావి, రాజకీయ చతురుడు, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అని రాజకీయ లోకం కోడై కూస్తోంది.
ఒకప్పుడు రాజుల కాలంలో ఎప్పుడూ ప్రభువు పక్కన కు డిభుజంలా వుండే మహామంత్రే రాజ్య విస్తరణకు, పరిపాలనకు, రణతంత్రాలకు వ్యూహకర్తగా వ్యవహరించేవాడని, ఇలాంటి వ్యవహారాల్లో మహామంత్రి తిమ్మరుసు దిట్ట అనీ చరిత్ర చెబుతోంది. ఇక, జగన్ విషయానికొస్తే ఆయనే ఓ పెద్ద వ్యూహకర్త. ఆయన చుట్టూ కాకలు తీరిన సీనియర్లు, ఎమ్మెల్యేలు చాలామంది వున్నారు. అయినా ఎన్నికల్లో విజయం కోసమే అన్నట్లు ఈ వ్యూహకర్తను తీసుకొచ్చి పార్టీ సమావేశంలో అందరికీ పరిచయం చేసాడు. ఆయన వ్యూహాలు ఎటువంటివి? ఏం జరగబోతోంది? అన్నది కొంతకాలం తర్వాత ఎన్నికల తెరమీద మనం అందరం చూడబోతున్నాం. ఈలోగా మనమూ మన రాజకీయ పరిజ్ఞానంతో, ప్రజల మనస్తత్వ పరిశీలనతో, మీడియా అందిస్తున్న తాజా వార్తల ఆధారంగా మన ఇంట్లో కూర్చునే కొంతమేరకు వ్యూహరచన చెయ్యచ్చు!
ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఊరూరా, ఇల్లిల్లూ కాళ్లరిగేలా తిరిగి వాళ్ల మూతి దగ్గర మైకులు పెట్టి.. వాళ్లను మాట్లాడించి ‘సర్వే’ చేస్తేనే పని జరుగుతుందా? సాటి ప్రజల జీవనంతో నిత్యం మమేకమై ఉండే సామాన్యుడికి సైతం జనం ఏమి కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఒక సామాన్యుడి సైకాలజీ మరో సామాన్యుడికి అర్థమైనంతగా రాజకీయ పండితులకు కూడా అర్థం కాదు. ఒక ప్రాంత ఓటరు నాడిని తెలుసుకోవడానికి ఆ ప్రాంత ప్రజల నిత్యావసరాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు వీటన్నింటినీ మనం కాస్త స్పందించే హృదయంతో.. ‘సాటి మనిషి’ అన్న సానుభూతితో వాళ్ల మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేస్తేచాలు. వాళ్ల సైకాలజీ, ఓటరు మూడ్ ఇట్టే తెలిసిపోతాయి. జనం తెలివితేటల మీద జనానికే కాదు.. జగన్‌కూ బోలెడు నమ్మకం.. అందుకే పదే పదే చెబుతున్నాడు- ‘మీరంతా ఊరూరూ వెళ్లి.. ఇంటింటికీ వెళ్లి చెప్పండి జగనన్న ముఖ్యమంత్రై వస్తున్నాడని, మీకు మంచి రోజులు రాబోతున్నాయి..’అని! అయినా, ప్రశాంత్ కిశోర్‌ను ప్రత్యేకంగా జగన్ తన పక్కన పెట్టుకున్నాడంటే.. అందులో ఏదో పెద్ద వ్యూహం వుండే వుంటుంది. మనకు ఆ రాజకీయాలన్నీ ఎందుకుగాని సామాన్యుడిగా మన లెవల్లో మనం ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనమూ చిన్నపాటి వ్యూహకర్తలం అవుదాం!
ఎన్నికల సమయంలో ఓటర్లకు చీరలు, పంచెలు, సారా సీసాలు, డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టడం పాత పద్ధతి! గ్యాస్ పొయ్యిలు, టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు ఇచ్చి ప్రలోభపెట్టడం కొత్త పద్ధతి. దీన్ని తమిళనాడు ఎన్నికల సమయంలో బుల్లితెరపై అప్పుడు మనం కళ్లారా చూసాం. మన దగ్గర ఇంకా అంత అతి లేదుగానీ ఓటుకు- వందల రూపాయల నుంచి వేల రూపాయలకు ధర పెరిగింది. ఇలా డబ్బులు ఆశించి ఓట్లు వేసేవారు పేదల్లోనే ఎక్కువగా వుంటారు. పోలింగ్ బూ త్ లోపలికి వెళ్లాక ఎవరికి ఓటు వేశారో ఎవరు చూడొచ్చారు? ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కునే ఈ పద్ధతి పూర్తిగా తొలిగిపోవాలి. ఇచ్చేవాళ్లు ఉండబట్టి కొందరు ఓటర్లు డబ్బులు, వస్తువులు తీసుకుంటున్నారు గానీ అసలు ఆ పద్ధతే లేకుంటే వాళ్లేమీ అడగరు. ఆ అలవాటును వాళ్లకు చేసింది రాజకీయరంగంలోని వాళ్లే! దానికన్నా ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వస్తే ప్రజల బాగుకోసం అవసరాలు తీర్చడం కోసం ఏం చేస్తారో చిత్తశుద్ధితో వాళ్లకు అర్థమయ్యేలా, నమ్మకం కలిగేలా చెప్పగలిగితే చాలు. ‘మంచి పరిపాలకుడు వస్తే మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒనగూడుతాయి’ అన్న ఆశే వాళ్లను బ్యాలెట్ బా క్స్‌లో ఓట్లు వేసేలా చేస్తుంది. ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ఒళ్లు మండే పదాలు రెండు ఉన్నాయి. అవి- సెలబ్రిటీ, విఐపి అన్నవి. అందుకే హంగులు, ఆర్భాటాలు, అధికార మదం వున్న మంత్రులను, రాజకీయ నేతలను సామాన్య జనం ఎవ్వరూ ఇష్టపడరు. వాళ్లు ఎక్కడికెళ్లినా లభించే రెడ్ కార్పెట్ స్వాగత సత్కారాలను, గజమాలలను, పట్టుశాలువాలను చూసి ‘ఎవడబ్బ సొమ్మని అంత ఖర్చు చేస్తున్నారు.. అది ప్రజాధనం’ అని లోలోపలే కోపంతో పళ్లు నూరుతారు. ప్రజాప్రతినిధి అయినవాడు సింపుల్ లైఫ్‌తో తమలో ఒకడిగా నిండు మనసుతో కలిసిపోయి తమకు దగ్గరగా వుండాలని కోరుకుంటారు జనం.
ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ అచ్చం అలాంటి భావాలున్న మనిషే గనుక ఆ రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనో, ప్రభుత్వ బంగళాల్లోనో కాకుండా ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్లలో అతిథిగా వుండే ఆయన తన కోసం వాళ్లు చేస్తున్న హడావుడి, విఐపి స్వాగత సత్కారాలూ చూసి- ‘నా కోసం ఈ రెడ్ కార్పెట్‌లు, ఏసీలు, కూలర్లు తేకండి.. అలాంటి ప్రత్యేక ఏర్పాట్లు నాకు నచ్చవు’ అని చెప్పి వాళ్లను వారించినట్లు వార్తలు వచ్చాయి. ‘నాయకుడంటే ఇలా వుండాలి’ అని అందరూ అనుకునేలా యోగి నిరూపిస్తున్నారు.
‘నేను.. నా తర్వాత నావాళ్లు’ అన్న స్వార్థంతో సిఎం సీటు మీద తను ఉండగానే కర్చ్ఫీ వేసి వుండే వారసత్వ రాజకీయాలను, కుటుంబపాలనను ప్రజలు అస్సలు ఇష్టపడరు. ఎంతసేపూ కుర్చీ మీద ధ్యాసే తప్ప జనం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టనివాడు మాకు ఒరగబెట్టేది ఏమీ లేదని ఓటర్లు డిసైడ్ అయిపోతే అలాంటి పార్టీకి ఓట్లు రాలడం కష్టం. రాబోయే ఆ వారసుడు ఏ మాత్రం సామర్థ్యం, పరిపాలనా చాతుర్యం లేని వాడయితే ఓటర్లు అతనికి కొన్ని ఓట్లు రాల్చడం కూడా కనాకష్టం అయిపోతుంది.
ప్రజాస్వామ్యంలో అధికార పీఠాలు ఎప్పుడూ వారసత్వాన్ని అనుసరించి లభ్యం కావు. పరిపాలనా దక్షత ఉండి, తమ విశ్వాసాన్ని ఎవరైతే పొందగలుగుతారో వాళ్లకు పరిపాలనా పగ్గాలను ఇస్తారు ఓటర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల పాలన వారసత్వ రాజకీయాల చుట్టూ తిరగడం ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం. కేంద్రంలో నరేంద్ర మోదీకి- ‘పిఎం గద్దె కోసం రెడీగా కూర్చున్న’ వారసులు ఎవరూ లేరు. ఆయన తల్లి, తమ్ముళ్లు, వాళ్ల పిల్లలమీద కూడా తన ప్రభావం పడకుండా జాగ్రత్తపడుతూ వాళ్ల జీవితమేదో వాళ్లు గడిపేలా చూస్తున్నారు మోదీ. ‘నేను ఒక ఛాయ్ వాలాను. దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడ్ని.. వాళ్ల కష్టాలు నాకు బాగా తెలుసు’ అంటూ ఉంటారు ఎప్పుడూ. ఇక యుపి సిఎం ఆదిత్యనాథ్ ఓ యోగి. ఆయనకంటూ ఏ కోరికలూ లేవు. ప్రజల హితమే ఆయన కోరిక. రాష్టప్రతి పదవికి కొత్తగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ కూడా బడుగువర్గం నుంచి వచ్చినవాడే.. అందుకే ఆయన- ‘ఈ దేశంలో రామ్‌నాథ్ కోవింద్‌లు చాలామంది ఉన్నారు.. వాళ్లందరి అభివృద్ధే నా ధ్యేయం’ అంటున్నాడు.
ప్రజా పరిపాలకుడైన వాడికి నీతి, నిజాయితీ, మంచి వ్యక్తిత్వం వుండాలి. అలాంటివాడినే ఓటర్లు కోరుకుంటారు. జనాన్ని నడిపించే నాయకుడి వ్యక్తిగత జీవితం ఆదర్శప్రాయంగా మచ్చలేని స్వచ్ఛతతో వుండాలి. మంచి మనసున్నవాడు, పదిమంది గురించి తపించేవాడు, దైవభక్తి, దేశభక్తి, సేవాభావం వున్న నాయకుడికి జనం అంతా జేజేలు కొడతారు. అతనికి ఖండాంతర ఖ్యాతి లభిస్తుంది. మన ప్రధానమంత్రి వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం అంటే ఈ దేశ ప్రజలకు ఎనలేని గౌరవం. ఆయన చేసే యోగ, బ్రహ్మచర్య దీక్ష, శాఖాహార భోజనం, ఉపవాస దీక్షలు, మనసు లోతుల్లోనుంచి వచ్చే మాతృదేశ స్తుతి ఇవన్నీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడివాళ్లను సైతం ఆశ్చర్యంలో ముంచేస్తాయి. ఆ విధంగా భారతదేశ సంస్కృతికి ఎనలేని గౌరవం ఆయన మూలంగా దక్కింది. దేశ ప్రజల అభ్యుదయం కోసం, సుఖ సంతోషాల కోసం ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, అద్భుత సంస్కరణలు, పరిపాలనా పద్ధతిలో మార్పులు కూడా ఆయనను ప్రజలకు ఇష్టుడ్ని చేసాయి.
కంచే చేను మేసినట్లు ప్రజాధనాన్ని లూటీ చేసే నాయకులు, వాగ్దానాలు చేసి మర్చిపోయే నేతలు, ప్రజాసంక్షేమ పథకాలంటూ మొదలుపెట్టి వాటిని ప్రజలకు చేరనివ్వని స్వార్థ రాజకీయ కుట్రదారులకు మళ్లీ పట్టం కట్టడానికి ఓటర్లు వెనకాడతారు. ‘మీ ఓటు బ్యాంకు రాజకీయాలు మా దగ్గర సాగవని’ మరొకరికి ఓటేసి తమ మనసులోని మాట చెపుతారు. ప్రజలు ఇప్పుడు తెలివిమీరిపోయారు. చీరలు, పంచెలు, సారాసీసాలు ఇచ్చి ఆవిధంగా ‘ప్రజల నాడిని పట్టేసామని’ నాయకులు అనుకుంటే.. అలాంటి నాయకుల జాతకాలను తలకిందులు చేయటానికి- ఓటు హక్కును వినియోగించుకునేంత సమయం కూడా జనానికి పట్టదు.
ఇంతకూ ప్రజలంటే ఎవరు? ‘నేను, నువ్వు, అతడు, ఆమె’ ఇలా మనమంతా కలిస్తేనే కదా ప్రజ! ‘దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ అన్నట్టు మనుషులంతా ప్రజలే..! నాయకుడూ ఒక మనిషే గనుక.. మనిషి అవసరాలు, సుఖసంతోషాలూ, కోరికల గురించి ప్రయత్నిస్తే అతనికీ అర్థమై.. అవి నెరవేరడానికి ఒక నాయకుడిగా తనేం చేయాలో తెలుస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజల నాడిని తెలుసుకోవటంతోపాటు ప్రత్యర్ధి పార్టీల మీద పన్నవలసిన వ్యూహాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రజాకర్షణ పథకాలు, హామీలు వంటి చాలా వ్యవహారాలు ఉంటాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాకు రాజకీయ వ్యూహాలు పన్నడంలో చాణక్యుడంతటివాడని పేరుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మనసులో కూడా బయటికి కనిపించని బోలెడు వ్యూహాలు వుంటాయని జనం అనుకుంటారు. ఇక వ్యూహకర్తగానే తనను తాను పరిచయం చేసుకుని పార్టీ నేతలచేత ప్రజలకు పరిచయం చేయబడుతున్న ప్రశాంత్ కిశోర్ వైకాపా కోసం ఏం చేస్తారో? ఎలా చేస్తారో రాజకీయ రంగస్థలం మీద చూడాల్సిందే!

-డా. కొఠారి వాణీచలపతిరావు