సబ్ ఫీచర్

స్వాతంత్య్ర పోరాట విజయ కేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అపురూపమైన పోరాట స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన ఉ ద్యమ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన మహోజ్జ్వల ఘట్టం- ‘క్విట్ ఇండియా’ సమరం. అందుకే దేశ చరిత్రలో క్విట్ ఇండియా నినాదం ఇచ్చిన 1942 ఆగస్టు 8వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1915 జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చిన గాంధీజీ, సామ్రాజ్యవాద దురహంకారంతో బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ పాలనను ప్రతిఘటించేందుకు ‘క్విట్ ఇండియా’ అంటూ పిలుపు ఇచ్చిన మహత్తర సందర్భం అది.
1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుంచి బ్రిటిష్ పాలనా వ్యవస్థపై ప్రతిఘటనోద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1885లో ఆవిర్భవించిన భారత జాతీయ కాం గ్రెస్ క్రమేపీ లోకమాన్య తిలక్ సారథ్యంలో- ‘స్వరాజ్యం నా జన్మహక్కు’గా అప్పటి మితవాద ధోరణులకు స్వస్తి పలికి చైతన్యవంతమైంది. మాతృభూమి దాస్య విముక్తి లక్ష్యంతో ఎందరో వీర యువకులు విప్లవోత్తేజంతో, కాంగ్రెస్‌కు విభిన్నంగా సాయుధ పోరాటాలతో ఉరికంబాలను ఆహ్వానించారు. 1920లో ఆరంభమైన గాంధీ శకం స్వాతంత్య్రోద్యమాన్ని అహింసాపథంలో నడిపించటానికి సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వటంతో- ‘సంస్కరణాయుతమైన వైతాళిక చైతన్యం’ నుంచి కొందరు కొత్తదారులు తొక్కారు. తిలక్, అనిబిసెంట్‌ల హోమ్ రూల్ ఉద్యమం స్వయంపాలనా అధికారాలను తెరపైకి తెచ్చింది. 1905లో ‘వందేమాతరం’ ఉద్యమం బ్రిటీష్ పాలనను ప్రతిఘటించే జాతిని ఏకతాటిపైకి తెచ్చి శక్తివంతంగా ఏకోన్ముఖం చేసింది.
1919 ఏప్రిల్‌లో అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ అత్యంత క్రూరంగా వేలాది నిస్సహాయ భారతీయ పౌరులను కాల్చి చంపటం భారత జాతిని కదిలించింది. సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న దశలో చౌలీచౌరాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో- స్వాతంత్య్రోద్యమం హింసామార్గం అనుసరించటం ఏ మాత్రం ఇష్టం లేని గాంధీజీ 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేయటంతో దేశం నివ్వెరపడింది, నిస్తేజమైంది. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ్ వంటి జాతినేతలు స్వాతంత్య్ర పోరాట వివిధ దశలలో సంపూర్ణ స్వరాజ్య లక్ష్య సాధన దిశలో గాంధీజీ కార్యాచరణను అనుసరిస్తూ కాంగ్రెస్‌ను విప్లవీకరించారు. 1930 నాటి అహింసాయుత దండి సత్యాగ్రహ శాసనోల్లంఘనంతో దేశం అట్టుడికింది.
1939 నాటికి చాలా దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధ కారుమేఘాలు కమ్ముకున్నాయి. గాంధీజీ అహింసాయుత పోరాటం వల్ల త్వరితంగా స్వాతంత్య్రం సిద్ధిందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో బలపడింది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే తిరుగుబాటు ధోరణి యువతరాన్ని ఆత్మబలిదాన త్యాగాలకు పురికొల్పుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీతో విభేదించి బ్రిటీష్ శత్రు పరాజయం లక్ష్యంగా జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపే ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి, దేశం నుంచి అదృశ్యమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతజాతి స్వతంత్ర కాంక్షతో రగిలిపోతోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 1914లో బ్రిటీష్ సైనికాధిపత్యానికి సహకరించిన గాంధీజీ, జలియన్‌వాలా బాగ్ మారణకాండకు నిరసనగా తనకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రదానం చేసిన యుద్ధపతకాలను తిరస్కరించడమే కాకుండా, రెండవ ప్రపంచ యుద్ధంలో మద్దతు ఇచ్చే అంశాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘క్రిప్స్’ రాయబారం విఫలమైంది.
1942 జూలై 14న వార్థాలో జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం శాసనోల్లంఘనను మరింత తీవ్రం చేయాలని తీర్మానించింది. 1942 ఆగస్టు 8న బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ- బ్రిటిష్ పాలకులు భారత్‌ను విడిచి వెళ్లాలంటూ.. ‘క్విట్ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. బొంబాయిలోని గొవారియా ట్యాంక్ మైదానంలో భారీ బహిరంగ సభలో తక్షణం ‘్భరత్ ఛోడో’ అంటూ ‘డూ ఆర్ డై’ నినాదంతో భారత జాతిని గాంధీజీ ఉత్తేజితం చేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గాంధీజీ నోటి వెంట ‘కరేంగే యా మరేంగే’ పిలుపు భారత జాతిని ఉవ్వెత్తున ఆగ్రహ నిరసనోద్యమాలతో బ్రిటీష్ ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటికే నేతాజీ సుభాష్ చంద్రబోస్, తాత్కాలిక స్వతంత్ర భారత అధ్యక్షునిగా, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనావాహిని భారతావనిలో బర్మా పొలిమేరలలో బ్రిటీష్ ప్రభుత్వంతో జపాన్, సహకారంతో ఘోర సంగ్రామంలో ముందుకు వస్తోంది. ఆగస్టు 9వ తేదీ బ్రిటీష్ ప్రభుత్వం గాంధీ సహా దేశంలోని జాతీయ నాయకులందరినీ జైళ్ళలో కుక్కింది. బ్రిటీష్ తుపాకులకు గుండెలొడ్డి, యువ నాయకత్వం క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వహించింది. యువ నేత అరుణా అసఫాలీ, గొవాలియా మైదానంలో మువ్వనె్నల త్రివర్ణ పతాకాన్ని అత్యంత సాహస విప్లవోత్తేజంతో ఎగురవేసి, భారత జాతి కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పారు.
క్విట్ ఇండియా ఉద్యమం నిరంకుశ బ్రిటీష్ రాజ్యాధికారాన్ని ప్రశ్నించి నిలదీయటంతో లక్షలాది దేశభక్తులు జైళ్ళపాలయ్యారు. మర తుపాకులు, వైమానిక దాడులలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను నిషేధించటంతో అజ్ఞాతంగా అరుణా అసఫాలీ, ఉషా మెహతా వంటి యువనేతలు రహస్య పోరాటాలతో బ్రిటన్‌ను వణికించారు. మూడేళ్ళపాటు నాయకులంతా నిర్బంధంలో వున్నారు. మహాత్ముని జీవిత భాగస్వామి కస్తూర్బా గాంధీ, వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్ వంటి ప్రముఖులు ఎందరో జైళ్ళలోనే కన్నుమూశారు.
క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర సాధనలో భారత జాతి ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అహింసాయుతంగా స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్షతో బ్రిటీష్ సామ్రాజ్య ప్రభుత్వ పాలనను నిలదీసిన మహోజ్వల సమరం. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర ఉషోదయపు కాంతి ప్రసరించటానికి, కారణమైన విజయ కేతనం.

-జయసూర్య సెల్: 94406 64610