సబ్ ఫీచర్

మాట్లాడే భాషకు మహాగౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యంతోనే భాషని తేలికగా మార్చవచ్చు!
ఈ విషయాన్ని తన చేతల ద్వారా నిరూపించినవారు గురజాడ కనుక ఆయన జయంతిని ‘ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సామాన్య ప్రజలందరూ రోజూ తమ చుట్టూ చూస్తూ ఉండే మనుషుల్లాంటి పాత్రలు, రోజూ తాము మాట్లాడుకునే భాషలోనే మాట్లాడుతున్నట్లుండే రచన చేస్తే పండితులు తనని వెలివేసినా, పామరులకు తను చెప్పిన విషయం సూటిగా చేరుతుందనే భావనతోనే ‘కన్యాశుల్కం’ నాటక రచనను చేసాడు గురజాడ. ఎక్కడపడితే అక్కడ ప్రదర్శిస్తూ, జనాలు తమ మధ్య ఉన్న దురాచారాన్ని గుర్తుపట్టేట్టు చేయడంలో కృతకృత్యులయ్యారు.
ఆ తర్వాత విజయనగరం మహారాజా ఆనంద గజపతిరాజు మరణించడం, దాయాదుల దావాలో ఆనందగజపతిగారి తల్లిగారైన రాజేశ్వరి రాణి తరఫున నిజాయితీగా నిలబడటం, ఆవిడ దత్తపుత్రుడు విజయరామ గజపతి కోరిక మీద కాపీలు అయిపోయిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని చిన్న చిన్న మార్పులతో చేయాలనుకోవడం, కానీ నాటకం మొత్తాన్ని తిరగరాసి ప్రచురించడం పూర్తయ్యేసరికి 1909 అయ్యింది.
అపుడు ఆయనకు వ్యావహారిక భాషోద్యమం గుర్తుకొచ్చింది.
అంతకుముందు కందుకూరి వీరేశలింగంగారు గ్రాంథిక భాషని మార్చడానికి ప్రయత్నించారు గాని పూర్తిగా మాట్లాడే భాషలో రచనలు చేయలేకపోయారు. గురజాడ కన్యాశుల్కం ద్వారా ఆ ప్రయోగాన్ని దిగ్విజయంగా నిర్వహించగలిగారు గాని తమ సమస్యలతో తాము అప్పట్లో అంతకన్నా ముందుకు సాహిత్యపరంగా కదలలేక అంతటితో తాత్కాలికంగా ఆపారు.
గురజాడ రచించిన వ్యావహారిక భాషకు పూర్వులెవరూ ఒరవడిని పెట్టలేదు. శబ్దసిద్ధి ప్రమాణంగానూ, ఏ సందేహం వచ్చినా తీర్చుకోవటానికి ఆత్మ ప్రమాణమే తమ పరమ ప్రమాణంగా నిర్ణయించుకున్నారు. మాట్లాడే భాషలో రాయాల్సి వచ్చినపుడు వర్ణమాలలోని కొన్ని అక్షరాలు తను ఉద్దేశించిన ధ్వనులకు సరిపడకపోగా, కొన్ని కొత్త గుర్తులు కల్పించుకున్నారు.
మాట్లాడే భాష దేశ పురోభివృద్ధికి, విద్యా వ్యాప్తికీ చాలా దోహదం కలిగిస్తుందనే భావంతో ప్రగతిశీలుడూ, అత్యంత మేధా సంపన్నుడు, మిసెస్ ఎ.వి.యస్, కళాశాలాధ్యక్షుడూ అయిన పి.టి.శ్రీనివాసయ్యంగార్ ఆ భాషను ఆదరించారు. ఇంచుమించు అదే కాలంలో జె.ఎ.యేట్స్ స్కూళ్ళు తనిఖీ చేసే ఉద్యోగస్తుడుగా మొదటి సర్కిల్‌కి నియమితుడై విశాఖపట్నం రావడమూ, ఆయన డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు, బోధకు ప్రవేశపెట్టడమూ జరిగాయి. అంతకుపూర్వం ట్రాన్స్‌లేషన్ మెథడ్ వాడుకలో వుండేది. ఇంగ్లీషు బోధనకు సక్రమమైన కృషి జరుగుతూ ఉండగా తెలుగు భాషా బోధన వెనుకబడరాదనే ఉదారభావంతో శ్రీనివాసయ్యంగార్ ఓ సమాజాన్ని ఆంగ్లాంధ్ర భాషాభ్యాసన పద్ధతులు మెరుగుపరిచే ఉద్దేశ్యంతో నెలకొల్పారు. దానికి యేట్సు దొర అధ్యక్షులు. తాను కార్యదర్శి. ఈ సమాజము నిర్వహించవలసిన కార్యకలాపాలలో వీరిరువురికీ తగిన తోడ్పాటు గిడుగు రామమూర్తి పంతులుగారి వల్ల లభించగలదని అప్పారావుగారు సలహా ఇవ్వగా యేట్సు పర్లాకిమిడిలో మకాము చేసినపుడు రామమూర్తి పంతులుగారిని కలుసుకుని డైరెక్ట్ మెథడాలజి గురించి వారితో చర్చించారు. మొదట ప్రతిఘటించినా, తరువాత ఆ పద్ధతి గురించి కూలంకషంగా తెలుసుకొని, దానిని ఆమోదించి, యేట్సుకు తోడ్పడటానికి గిడుగు అంగీకరించారు. అంతవరకూ తెలుగు భాష, తెలుగు వాఙ్మయము, తెలుగు భాషాబోధన- వీటిమీదికి దృష్టి మరలించని రామమూర్తి పంతులుగారు ఆంగ్ల భాషా బోధనా పద్ధతులతో పోల్చి చూస్తే తెలుగు బోధించే రీతులు చాలా అధోగతిలో ఉన్నాయని గ్రహించి, శ్రీనివాసయ్యంగారు నెలకొల్పిన సమాజంలో చేరి ఎన్నదగిన కృషి చేశారు.
కానీ ఈ వ్యావహారిక భాషోద్యమం అనుకున్న రీతిలో ప్రగతిని సాధించడం లేదన్న విషయాన్ని గురజాడ గుర్తించారు. దాంతో ఆయన 1910 ఒక్క సంవత్సరంలో భాషని మార్చడానికి ఆధునిక కథ (దిద్దుబాటు), ఆధునిక గేయం (దేశమంటే మట్టికాదోయ్), ఆధునిక కవితలు (ముత్యాల సరాలు) రాశారు.
సాహిత్యంతోనే భాషని మార్చగలమని గుర్తించిన గురజాడ ఆచరణలోనూ విజయాన్ని సాధించారు. గ్రంథ భాషనే కాదు బోధనా భాషని మార్చాలనే ఆలోచన ఆయనకి వచ్చింది. విశ్వవిద్యాలయంలో దేశ భాషలకు పరిశోధనా శాఖను నెలకొల్పడం, నిర్బంధ దేశ భాషా వ్యాసరచనా సమస్య ముఖ్య విషయాలుగా సమ్మిట్ మీదకొచ్చాయి. తెలుగు పరిశోధనా శాఖకి పర్యవేక్షకులుగా గిడుగు పేరుని సూచించారు గురజాడ. దీన్ని కట్టమంచి రామలింగారెడ్డి వ్యతిరేకించారు. గురజాడ చివరకు బుర్రా శేషగిరిరావుని ప్రతిపాదించాల్సి వచ్చింది.
దేశ భాషా వ్యాసరచన సమస్య కూడా ముఖ్యమైనదవడంతో విశ్వవిద్యాలయంలో వారు కాంపోజిషన్ కమిటీలను ఆయా భాషలకు వేశారు. తెలుగు కాంపోజిషన్ కమిటీలో గ్రాంథిక వాదుల, వ్యావహారిక భాషావాదుల పోరు మొదలైంది. జయంతి రామయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, వేదం వెంకటరాయశాస్ర్తీ, జి.వేంకట రంగారావు గారలు గ్రాంథిక వాదులు; గురజాడ, గిడుగు, బుర్రా శేషగిరిగారలు వ్యావహారిక భాషావాదాన్ని సమర్థించేవారు. థామస్ అనే ఆంగ్ల ఉద్యోగి కమిటీ సమావేశపరుడు. దీనికి అధ్యక్షులు - సంస్కృత శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ రంగాచార్యులు.
రెండు పక్షాలు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. చివరికి ఒక సమన్వయ తీర్మానం అధ్యక్షులైన రంగాచార్యులు ప్రత్యేక సమ్మతితో అంగీకరించారు. దాని ప్రకారం విద్యార్థులు దేశ భాషా వ్యాసరచనలో పూర్వ గ్రాంథిక రూపాల్ని వాడవచ్చు. తీర్మానానికి వ్యాఖ్యానాలు గ్రాంథిక వాదులు లేవదీశారు. కాంపోజిషన్‌లో రాయలసీమకు ప్రాతినిధ్యం లేదంటూ కాంపోజిషన్ కమిటీలోకి ముగ్గురు గ్రాంథిక వాదుల్ని ఆహ్వానించటంతో గ్రాంథిక వాదుల బలం పెరిగింది.
ప్రాచీన రూపాలు- వర్తమాన రూపాలను నిర్దేశిస్తూ పట్టికను తయారు చేయడానికి ఒక ఉపసంఘాన్ని నియమించారు. దాంట్లో కొమర్రాజు, వేదం, గురజాడ సభ్యులు. కొమర్రాజు, వేదం గ్రాంథిక వాదులు కావడంతో వాళ్లు తయారుచేసిన పట్టిక గురజాడకు నచ్చలేదు. అందుకని ఆయన ఒక సుదీర్ఘమైన ‘అసమ్మతి నివేదిక’ను మినిట్ ఆఫ్ డిసెంట్‌ని విశ్వవిద్యాలయానికి సమర్పించాలనుకున్నారు. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆస్త్మా, నీరసాలకు, గ్రహణి తోడవడంతో మరింతగా నీరసించాడు. కాగితంమీద పెన్నుబెడితే పెద్ద పెద్ద, చిన్న చిన్న ఎగుడు దిగుడు అక్షరాలు ఎలాగోలా రాసినా కాగితాల్ని ఎదుటివారికి అందించలేని స్థితి.. ఎగుడు దిగుడు అక్షరాలతో రాసిన పుటల్ని అలాగే క్రిందకు జారవిడిచేవారట. గిడుగు వాటినందుకుని, సాపురాసి సకాలంలో అసమ్మతి పత్రాన్ని సబ్‌కమిటీకి సమర్పించారు. పట్టుదల వుంటే అనారోగ్యాన్ని జయించవచ్చని నిరూపించారు.
ఇది ఒక ప్రక్క సాగుతుంటే మాట్లాడే భాషలో గ్రంథ రచనకు గురజాడ తీవ్ర కృషిచేశారు. ‘‘తెలుగు సాహిత్య భాషను నాగరికత వ్యాప్తికి ఒక గొప్ప సాధనంగా చేయాలంటే దాన్ని వ్యావహారిక భాషకు దగ్గరగా తీసుకురావాలి. దానిని పూర్తిగా వినూత్నం చేయాలి. తెలుగుదేశంలోని వివిధ ప్రాంతాలలో మామూలుగా మాట్లాడే తెలుగు భాషలో పాతుకుపోయి ఉన్న ప్రజల అలవాట్లవల్ల మాండలిక భేదాలు పెద్దగా లేవు. సమర్థులయిన రచయితలు, గట్టిగా పూనుకుంటే ఒక కొత్త ఉమ్మడి భాషను సులభంగా రూపొందించవచ్చు..’’ అన్నది గురజాడ అభిప్రాయం. అందుకే 1910 ఒక్క సంవత్సరంలో భాషను ఆధునీకరించానికి మాట్లాడే భాషలో కథలను, గేయాల్ని కవిత్వాన్ని రాశారు.
గురజాడ వెళ్లిపోయిన తర్వాత ‘‘మాటలే నావి, నేను రాయలేను, కావ్యసృష్టి అతనిది. ఇపుడు అప్పారావు మరి లేడుగా. వాడు రాస్తుండేవాడు. వాడింకా ఎన్ని రాసిచ్చేవాడో..’’ అంటూ బాధపడ్డారట గిడుగు.
ఒక సందర్భంలో వ్యావహారిక భాషావశ్యకత గురించి అందరూ ముగ్ధులయ్యేటట్లు మూడు గంటలపాటు ప్రసంగించారు గిడుగు. అందరూ మెచ్చుకుంటుంటే ‘‘ఇపుడు నా అప్పారావు ఉండి ఉంటేనా? ఎంత సంతోషించేవాడో!’’ అన్నారట తమలో తామే మాట్లాడుకుంటున్నట్టు గిడుగు. అందుకే గిడుగు పుట్టినరోజుని ‘వ్యావహారిక భాషాదినోత్సవం’గా ఎలా జరుపుకుంటున్నామో, గురజాడ జన్మదినం- సెప్టెంబర్ 21నాడు ‘ఆధునిక సాహిత్య దినోత్సవం’గా జరుపుకోవాల్సిన అవసరముంది. అప్పుడే తెలుగు భాషా సాహిత్యాల్ని ఆధునీకరించిన గురజాడకి న్యాయం చేసినట్లవుతుంది.

-డా వేదగిరి రాంబాబు