సబ్ ఫీచర్

ఏకకాల ఎన్నికలు.. ఎల్లకాల ఎన్నికలూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశవ్యాప్తంగా శాసనసభలకు, పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తే అందుకు మేం సిద్ధం’ అంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలకు మద్దతుగా తమ అభిప్రాయాలను ప్రకటించారు. అయితే ఈ తరహా ప్రతిపాదన మంచిచెడ్డలపై అన్ని కోణాల్లో చర్చ జరగవలసి ఉన్నది.
ఎన్నికల ఋతువుఏడాది పొడవునా ఏదో ప్రాంతానికి వస్తూపోతూ ఉంటే, ఆ బురదలో పడి అసలు పని వెనక్కుపోతుందన్నది పాలనాపగ్గాలు చేతిలో ఉన్న జాతీయ పార్టీది, అనుకూల వాదుల వాదన. ఎన్నికలు వాటి వాటి షెడ్యూల్ బట్టి జరుగుతుంటాయి. ఇంత పెద్ద దేశంలో వాటిని ఒకేసారి నడిపించడం ప్రజాస్వామ్యానికే చేటు అన్నది ప్రతికూలుర వాదన. అసలు ఎన్నికల ప్రక్రియే ప్రహసనంగా తయారవుతున్నప్పుడు కలసివస్తేనేం, విడివిడిగా వస్తేనేం అన్నది తటస్థుల వాదన. ఏ వాదన ఎలా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉన్నది. అదేమిటంటే ఎన్నికల సమయంకన్నా ఎన్నికల సంస్కరణ ముఖ్యం. అన్ని పార్టీల్లో, అన్ని ప్రజాస్వామిక వేదికల మీద నేరస్థులున్నారు. తీవ్ర నేరాల్లో, కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న వాళ్లని ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిలిపే బలమైన చట్టాల్లేవు. చట్టాలతో సంబంధం లేకుండా తమకు తాముగా వారిని నిరోధించే నైతిక నిష్ఠ ప్రధాన పార్టీలకు లేదు. గెలుపు గుర్రమైతే చాలు పిచ్చి గుర్రమైనా ఫర్వాలేదు. మంత్రివర్గాల్లో కూడా అలాంటి చరిత్రతో కొనసాగగలరు. అవినీతిపరుల, నేరస్థుల పాత్ర ప్రత్యక్ష ఎన్నికల్లో ముందు తగ్గాలి. అందుకు తగ్గ మార్పులు జరగాలి. ఎన్నికల్లో నల్ల డబ్బు పాత్ర ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రభావం తగ్గేలా కృషి జరగలా. వివిధ రాష్ట్రాల్లో స్పీకర్, గవర్నర్‌ల పాత్ర వివాదాస్పదంగా, రాజకీయ ప్రభావాలకు లోనవుతుంది. వారి విధుల్ని, బాధ్యతల్ని, జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్వచించాల్సి ఉంది. గుణాత్మకమైన సంస్కరణలతో బాటు, ఒకేసారి ఎన్నికలకి సిద్ధమైతే తప్పేంలేదు. అలా కాకుండా ఉన్న ఫళంగా నోట్ల రద్దు తరహాలో ఈ వ్యూహానికి పూనుకుంటే నష్టాలో ఎక్కువ. ఇప్పటికే ‘ఒకరోజు ప్రజాస్వామ్యం - ఐదేళ్ల నిరంకుశత్వం’గా ఎన్నికల ప్రక్రియ తయారైంది. మరో ఐదేళ్ల వరకూ ఏ బాదరబందీ లేదంటే పాలన మాటేమోగానీ పన్నులు బాదడం నిష్పూచీగా జరిగిపోతుంది. ప్రచారంలో పంచాయతీ ప్రెసిడెంటు అభ్యర్థి కూడా గ్రామంలో పారిశుద్ధ్యం మాట పక్కన పెట్టి పాకిస్తాన్‌తో సంబంధాల గురించే మాట్లాడతాడు. ఒక అధ్యయనం ప్రకారం జమిలి ఎన్నికల్లో 77 శాతం మంది ఒకే పార్టీకి ఓటెయ్యడానికి మొగ్గు చూపిస్తారు. అంటే జాతీయ పార్టీలు, జాతీయ అంశాలు స్థానికతని మింగేస్తాయన్నమాట. ఆలోచించాల్సిన విషయమే మరి.

-డా.డి.వి.జి.శంకరరావు పార్వతీపురం