సబ్ ఫీచర్

మైనర్ వివాహితలకు ‘సుప్రీం’ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవాహిక ధర్మం ప్రకారం తాళి కట్టించుకొన్న భార్య అయినా, ఆమె వయస్సు 18 ఏళ్ళు లోపు వుంటే, భర్త ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచార నేరం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించటం భారతీయ సమాజంలో సనాతన మత సంప్రదాయాలను అనుసరించే వర్గాలతోపాటు ఆడపిల్లలను త్వరగా ఒక అయ్య చేతిలో పెట్టి భారం వదుల్చుకోవాలని అభిలషించే అసంఖ్యాక మధ్య, పేద తరగతి కుటుంబాలలో సంచలనాంశం అయింది. శతాబ్దాల తరబడి భారతీయ మహిళల జీవితాలలో నిప్పులు పోస్తున్న సామాజిక దురాచారాలలో సతీ సహగమనానికి కాలం చెల్లినా, అనె్నం పునె్నం తెలీని అమాయక వయసులో బాలికలకు పెళ్లిళ్లు చేసే బాల్యవివాహాల తంతు, కొంత శాస్తప్రరంగా వైవాహిక ధర్మంగా ఆమోదం పొందుతూనే వుంది. ఒక యువతి తన సమ్మతి తెలిపే వయసు 18 ఏళ్ళు అయినప్పటికీ, 15-18 ఏళ్ళలోపు భార్యతో, భర్త కలియటం అత్యాచారం కిందికి రాదనే భారత శిక్ష్మాస్మృతి సెక్షన్ 375లో వున్న మినహాయింపు, సర్వోన్నత న్యాయస్థానం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. వయసుతో నిమిత్తం లేకుండా విరుచుకుపడి బాలికలు, యువతులను లైంగికంగా హింసించి ప్రాణాలు తీస్తున్న క్రూర నేరాలు విపరీతంగా పెరుగుతున్న వికృత సమాజంలో, భార్యలుగా ఆమోదముద్రపడినా 18 ఏళ్ళలోపు వుంటే వారితో శృంగారంలో పాల్గొనడం అత్యాచారంగానే పరిగణించాలని అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొన్ని మత ధర్మాలు ప్రోత్సహించే బాల్య వైవాహిక దురాచారానికి చెంపపెట్టుగా పరిణమిస్తోంది.
కడుపులో ఉన్నది ఆడపిండం అయితే, పెళ్లి బేరాలు కుదుర్చుకొనే మూఢ సనాతన దుర్నీతి నుంచి 21వ శతాబ్దిలోని, భారతీయ సమాజం సమాన మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తోంది. ఆడపిల్లలు, నేడు గుండెలమీద కుంపటి కాదు గుండెలు తీయగల సమర్థులు. అన్ని రంగాలలో మహిళా శక్తి, పురుషులతో ధీటుగా ఊయలలూపే చేతులే విశ్వాన్ని పరిపాలిస్తున్నాయి. అయినా ప్రకృతి సహజమైన శారీరక తత్త్వం, పురుషాధిక్యత పాతుకున్న సమాజ నడవడికలో మహిళకు అణచివేత ఆధిపత్యం, ఆధీనం తప్పటం లేదు. దైనందిన కుటుంబ జీవనంలో మాతృమూర్తిగా సంక్రమించే బాధ్యతలు, భర్తకు పిల్లలకు ఎన్నో విధాల అండదండలుగా సమాజానికి మహిళా సారథ్యం లభిస్తూనే వుంది. మతపరంగా కుటుంబ వ్యవస్థ వర్థిల్లటానికి కీలకమైన వైవాహిక బంధంలో సమాజ కల్యాణానికి యువలోకం జీవన ధర్మంగా అంకితమవుతోంది. కాని సుఖ సంతోషాలతో ఆడుతూ పాడుతూ జీవించే హక్కు, విద్యాభివృద్ధితో సమాజంలో స్వేచ్ఛగా తమ కాళ్లమీద తాము నిలబడి గౌరవంగా జీవించే సమానత్వం, ఆర్థికదైన్యం కారణంగా ముఖ్యంగా బాలికలు నిరంతర మానసిక, శారీరక పీడనకు గురి అవుతున్నారు. బాల్య వివాహాలు అడ్డుకొనే అంశంలో ముఖ్యంగా హిందు, ముస్లింల చట్టాల వైరుధ్యం బాలికల జీవితాలతో చెలగాటమాడుతోంది. బాలికల అక్రమ రవాణా, వేశ్యావృత్తి హింసాయుత అణచివేతలతో పాటు బాల్య వివాహాల కారణంగా ఎన్నో లేత జీవితాలు బుగ్గికావలసి వస్తోంది. వివాహిత బాలికలు శారీరక, మానసిక ఆరోగ్యం కోల్పోవటం పిల్లలకు పోషకారంలోపం నిత్య పేదరికంతో సతమతమవుతున్నారు. వధువుకు 18, వరుడికి 21 ఏళ్ళ కంటే తక్కువ వుంటే ఆ వివాహం చెల్లదని కర్నాటక ప్రభుత్వం చట్టం, దేశానికే ఆదర్శమని సుప్రీంకోర్టు ప్రశంసించింది.
‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ యంగ్ లైవ్స్’ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సర్వే ప్రకారం బాల్య వివాహాల సంఖ్యలో బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయి. 69.5 లక్షల బాలురు, 51.6 లక్షల బాలికలకు 18-21 సంవత్సరాలు వివాహ వయస్సు రాకముందే పెళ్లిళ్లు తల్లిదండ్రులే చేశారు. 2005 ‘నేషనల్ ఫేలీ హెల్త్’ సర్వే ప్రకారం, 18-29 సంవత్సరాల వయసు వున్న గృహిణిల్లో 46 శాతం, 18 సంవత్సరాలు రాకుండా పెళ్లిళ్లు అయినవారే. దేశంలో 23 మిలియన్ల మంది బాల వధువులున్నట్లు సర్వే అంచనా తెలుపుతోంది. తాటాకు బొమ్మలను అలంకరించి పెళ్లి చేసే బొమ్మల ఆటలా, నిజ జీవితంలో అభం శుభం తెలీని పిల్లలు వివాహ బంధంలో అన్యాయంగా చిక్కుకొని భవిత నరకమవుతోంది.
లైంగిక క్రూరత్వం
2012లో పిల్లలను లైంగిక నేరాలనుంచి రక్షించే చట్టం (పిఒసిఎస్‌ఒ) వచ్చింది. కాని బాలికకు వయస్సు 18లోపు వున్నా, భర్త అయితే ఆ లైంగిక బాంధవ్యం సమర్థనీయమే. ఆ మినహాయింపువల్ల పరోక్షంగా బాల్య వివాహాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టే. వధూవరులు ఇద్దరూ బాల్య వయసులో వున్నా, ప్రస్తుత సమాజం అనుసరిస్తున్న లైంగిక వ్యామోహ ఆకర్షణల కారణంగా బాలికలు లైంగికంగా అధిక సంఖ్యలో వాంఛలకు బలి అవుతున్నారు. ప్రస్తుత సామాజిక నేపథ్యంలో బాల్యంలో తెలిసీ తెలియని వయసులో అత్యాచారాలకు గురై బాలికలు గర్భవతులవుతున్నారు. చిట్టితల్లుల జీవితం ఇంచుమించు అధోగతి పాలయి, బాలికలకు సమాజం ఇచ్చే క్రౌర్యశాపంగా పరిణమిస్తోంది.
ఆంగ్లంలో ‘రేప్’ అనే పదానికి మనం మానభంగం, అత్యాచారం ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నా, రేప్‌లో వున్నంత దుష్ట తీవ్రత ఆ మాటలకు రావటంలేదు. ఆచారం, అతి అయితే అమానవీయత, శృతిమించిన మోహం, ఎలాగైనా వాంఛ తీర్చుకోవాలనే కోర్కె అత్యాచారం అవుతోంది. అత్యాచార అకృత్యాలకు పాల్పడుతున్న బాల నేరస్థుల కథనాలు చూస్తుంటే, బాలికలు తమ జీవితంలో ఎంతగా భద్రత కోల్పోతున్నారో, ఏ విధంగా హత్యలకు గురి అవుతున్నారో తెలుస్తోంది. గృహహింస, వరకట్న ధనాశ, మహిళా స్వేచ్ఛను సహించలేని ఆగ్రహ ఆవేశాలు, తనను ప్రేమించలేదనో, కోర్కె తీర్చలేదనో క్రోధం, ఈర్ష్యా అసూయలు, ఎన్నో విధాల యువతి, మహిళ ఇప్పటికే సమాజంలోని దుష్టపోకడలకు బలి అవుతోంది. ఇటువంటి నేపథ్యంలో శతాబ్దాల అంధకార యుగం నాటి బాల్య వివాహాల పేరిట, మతం, సమాజం, ప్రభుత్వం బాలికలకు కనీసం జీవించే హక్కులు కాలరాస్తోంది. వధువువులు వివాహ అర్హత వయసు లేని, రాని బాలికలయినప్పుడు, భర్తలుగా వున్న బాలురైనా, వృద్ధులైనా సంప్రదాయ విలువల పేరిట లైంగికంగా అనుభవించటంపై సుప్రీం అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికైనా కొరడా ఝళిపించటం, కళ్లు తెరిపించే తీర్పు, న్యాయదేవతను మరింత ఆరాధ్యనీయం చేస్తోంది.

-జయసూర్య