సబ్ ఫీచర్

జీవితాలతో చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక మాధ్యమాల ప్రభావం యువతను, బాలబాలికలను పెడదారి పట్టిస్తోంది. ఆధునిక సమాజంలో చిన్న కుటుంబాల వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, దంపతులు సంపాదన కోసం వివిధ వృత్తులు, బాధ్యతల నిర్వహణలో మునిగితేలుతుండటం వల్ల పిల్లల బాగోగులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోయింది. ఇంటర్నెట్ సౌలభ్యంతో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండటం ఒక వ్యసనంగా మారిపోయింది. ముఖ్యంగా పదేళ్లు దాటిన బాలబాలికలు ఎక్కువగా వీటికి అలవాటుపడిపోతున్నారు. ఒంటరిగా ఉండటం, సామాజిక మాధ్యమాల వినియోగంలో నిష్ణాతులమని నిరూపించుకోవాలన్న తహతహ వారిని ప్రభావితం చేస్తున్నాయి. అదే సమయంలో వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ‘గేమ్స్’పట్ల యువత ఆకర్షితులవుతున్నారు. ఆయా ఆటలు వారి ప్రాణాలు తీస్తున్నాయి. పాశ్చాత్య ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి ఇప్పుడు మనకు గొప్పగా కనిపిస్తోంది. ఫలితంగా అక్కడ రూపొందుతున్న గేమ్స్ మనకు పూర్తిగా కొత్త. మన ధోరణికి అవి సరిపడనివి. అయినా కుర్రకారు మోజుతో వాటికి అలవాటుపడి జీవతాలను నాశనం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ ఆధారంగా వచ్చిన ‘పోకెమన్‌గో’ ఆట ఎంతోమంది ప్రాణాలు తీసింది. ‘బ్లూవేల్’ ఆట ఇప్పటికే చాలామందిని ఆత్మహత్యలకు పురిగొల్పింది. మనదేశంలో ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా ఆ ఆటబారిన పడి ప్రాణాలు తీసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ఆట. మనిషి తనకు తానుగా ప్రాణాలు తీసుకోవడం, అంతకుముందు ఒంటరితనాన్ని భరించడం, మానసికంగా శిక్షించుకోవడం వంటి ప్రయోగాలకు అది కేంద్రం. ఇప్పుడిప్పుడే ఆ ఆటను నిషేధించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చిపడింది. ‘ఐస్-సాల్ట్’ ఛాలెంజ్ కూడా ప్రాణాలు తీసేదిగానే ఉంది. దీనికి తోడుగా ‘48 గంటల ఛాలెంజ్’ అటు చిన్నారులను, ఇటు వారి తల్లిదండ్రులను దాదాపు చంపేసేంత ఆందోళనకు కారణమవుతున్నది. బ్రిటన్‌లోని ఐర్లండ్ ప్రాంతంలో ఇది మొదలైంది. పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలు తల్లిదండ్రలకు చెప్పకుండా 49 గంటలపాటు ఉద్దేశపూర్వకంగా ‘తప్పిపోవడం’ ఈ ఆటలో భాగం. ఇది ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా సాగుతున్న ప్రమాదకరమైన ఆట. ప్రస్తుతం బ్రిటన్‌లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఐరోపా అంతటా ఆందోళన కలిగించిన ‘గేమ్ ఆఫ్ 72’ ఆటకు దాదాపు ఇది ప్రతిరూపం. అలా పిల్లలు తప్పిపోయినప్పుడు వారి తల్లిదండ్రులు పడే క్షోభను వర్ణించలేం. అలా తప్పిపోయిన పిల్లలను వెదకడం, ఎక్కువ గంటలపాటు వారు దొరకకుండా ఉండగలగడం వంటి అంశాల ప్రాతిపదికగా పాయింట్లు కేటాయించి మెచ్చుకోవడం ఆ ఆటలో భాగం. ఎదిగీఎదగని పిల్లలకు ఇది ఆటగా కనిపించవచ్చు. కానీ వారి తల్లిదండ్రలకు ఇది క్షోభ. నిజానికి పిల్లలకు ఆటగానే అయినా అలా వెళ్లిన తరువాత వారి భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్న. మనదేశంలో ఆ ఆట అడుగుపెట్టకముందే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వంవైపు నుంచి చర్యలకన్నా తల్లిదండ్రులు, యువత అప్రమత్తం కావలసిన అవసరం ఉంది. పిల్లల ప్రవర్తన, అత్యాధునిక సాంకేతిక పరికరాల వినియోగంలో పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారు, వారి నడవడిక, స్నేహబృందం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి అన్ని విషయాలను, జాగ్రత్తలను విడమరచి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన పిల్లలను మనం కాపాడుకున్నవారమవుతాం.

-కృష్ణతేజ