సబ్ ఫీచర్

వాణీ స్వ(స్వా)గతం(ప్రపంచ తెలుగు మహిసభలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబరం! అంబరాన్ని అంటే సంబరం! వెలుగు తిరునాళ్లు. తెలంగాణ పరగణాలో తెలుగు తిరునాళ్లు. అప్పుడప్పుడూ అక్కడక్కడా ఖైదులో ఊపిరాడనట్లుగా ఉన్న నా వాణికి గొప్ప విడుదల మోజులు - ఈ అయిదు రోజులూనూ. నాకు ఆనందం కందమయింది. మాకందమయింది. నాలోని భావాలు ఉత్పలాలయ్యాయి. భావనలు చంపక పరిమళాలయ్యాయి. నాలోని అనుభూతి రసాలు సీసాలయ్యాయి. నా ఎదలోని అణువణువూ - పరుగెత్తే పిల్లల్లా తేటగీతుల పరాగాల రేణువులే అయ్యాయి. నా పదం - జానపదమయింది - జ్ఞానపథం అయింది. నా స్వరం - చలనచిత్ర గేయ భాస్వరమయింది. అడుగడుగునా భాగ్యనగరం ఊదుతోంది - ఉత్సవాల నాగస్వరం. ఇప్పుడిది రవీంద్ర భారతి కాదు - కవీంద్ర భారతి. నాకందించే సువర్ణ హారతి - త్యాగరాయ గానసభ - నన్ను ‘బతుకమ్మా’ అంటూ ఉన్న - ఆయా సంస్కృతుల నవంనవ కళారసపేయప్రభ. లలితకళాతోరణం - నా గళంలో మంగళంగా అలంకరించిన కీర్తి తోరణమే. శిల్పారామం - సామాజిక ప్రయోజనాత్మకమైన సకల ప్రక్రియానల్ప - కల్పనా శిల్పాభిరామమే! పల్లె పాటలు, స్ర్తిల పాటలు, కర్షక కార్మికుల పాటలు - ముత్యాల పేటలయ్యాయి. నేటి మేటి యువతరం చూపుతున్న ఆ కళా ప్రదర్శనలకు పెద్దలు చైతన్య చకచ్చకితులవుతున్నారు. మాన్యుల, అనుభవ గుణగణ్యుల రచనల - చర్చల సారాన్నీ, సారాంశాన్నీ గ్రోలుతున్న ఈనాటి యువతరం - సముదాత్త సంప్రదాయ గోపురమే అవుతోంది.
ఈ సందర్భంలో నేను మనసుపడి చెబుతున్నాను. ఈ మాటలు నా మనసులో దాగడం లేదు. మా అబ్బాయే పాల్కురికి సోమనాథుడు. నిజంగా ఇహపర సాధనకు ప్రతీకగా ద్విపదను అందంగా తీర్చిదిద్దాడు. మావాడు సంపూర్ణంగా తొలిగా నాకు శతక పతకాన్ని అలంకరించాడు. సాధారం భక్తునికి తన రచనలో గొప్పగా - తొలిగా - స్థానాన్ని కల్పించాడు. నాకు మండనాలయిన మాండలికాలనూ, పలుకుబళ్లనూ గొప్పగా ప్రయోగించి, దీప్తిని కలిగించాడు. ఆ ముచ్చట్లతో మురిసిపోతున్నాను నేను. అలాగే మా ఇంకో అబ్బాయి - పోతన. భక్తిని పోత పోసుకున్నాడు - తన ఎదలో. మావాడు వ్రాసింది కేవలం భాగవతం కాదు, దాన్ని చదివితే అందరం బాగవుతాం. కాబట్టి ఆ రచన పేరు ‘బాగవుతాం’ అని చెప్పాలనిపిస్తోంది నాకు. వాడు అందరివాడు. అందరికీ అందుబాటులో ఉండేవాడు. మావాణ్ణి సంభావించని వాడు - ఆత్మ లేని వాడేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికం అందరికీ కావాలి గదా! వాడి మందార మకరందాల అనుప్రాసల శైలియే - వాణ్ణి అందరివాణ్ణిగా చేసింది. ఇంకో కుమారుడున్నాడు. వాడే గోపన్న. వాడి దాశరథీ శతకం - నిజంగా భక్తి శతక భద్రాచలమే! శ్రీరాముడు అందరివాడేగా! అయితే ఆ శ్రీరామ నవమి వేళ పంచే పానకం - పానకం కాదర్రా! మా రామదాసుని కీర్తన సుధారాశియే! అప్పుడు మనం ప్రసాదంగా తినేవి కొబ్బరి పలుకులు కాదర్రా! ఇదిగో! ఈ భక్తి శతక భద్రాచల పద్యాల పలుకులే!
మా పిల్లల ప్రతిభనూ, వైశిష్ట్యాన్నీ గుర్తించిన రాజులూ, పోషించిన సంస్థానాలూ - ఎన్నో ఎనె్నన్నో ఈ పరగణాలో; మన కాకతి గణపతి దేవ చక్రవర్తే గదా - తిక్కన భారతీయ మేధా దీప్తిని గుర్తించి, మనుమ సిద్ధి మనుగడకు రక్షణ సిద్ధిని సమకూర్చింది. ఇక - గద్వాల, పాలమూరు సంస్థానాలను గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అవధానాదులకు బ్రహ్మరథం పట్టాయా? లేదా? ‘వచ్చిండన్నా - వచ్చాడన్నా - వరాల తెలుగూ ఒకటేనన్నా’ అని పాటల మంజరుల సమైక్య ‘జ్ఞానపీఠం’ అయిందెవరో నేను వేరే చెప్పాలా? ఈ ‘విశ్వంభర’కు? వాడు మా అబ్బాయే గదా! ‘నా తెలంగాణ - కోటి రతనాల వీణ’ అని వీరోద్రేక ‘కృష్ణ’మై, స‘దాశరధి’యై గర్జించిన ఆచార్యుడురా! నా మరో పుత్రుడు - మావాడి ‘ఒక్కొక్క సిరాచుక్క - లక్ష మెదళ్ల కదలిక’!
ఇంకోమాట చెప్పమంటావురా! నాన్నా! మా అబ్బాయి ప్రతివాడూ - అంటే యుగకర్తగా చెప్పదగిన మా ప్రతి అబ్బారుూ, అమ్మారుూ ‘ఆది’కవులేరా! కవయిత్రులేరా! అంటే వారు ఆయా ప్రక్రియలకు ‘ఆది’గా అంటే ‘నమూనా’గా నిలిచేలా రచనలు చేసి ఉంటే. మీ కందరికీ తెలిసిందే! దర్జాగా చొక్కాను కుట్టడానికి దర్జీవాడికి మనం ఒక చొక్కాను ‘ఆది’గా ఇస్తాం కదా! అదిగో... అలా అచ్చ తెలుగు పదమైన ‘‘ఆది’’ లక్షణం కలిగినవారురా! నా పిల్లల్లో చాలామంది - అసలు - అన్ని రచనా ప్రక్రియల మూలాల కుదురు - ఆ గోదావరీ ప్రసన్న రుచిరార్థ సూక్తి నిధియైన సారమతియేరా!
అరే! కన్నా! రచన ఏదైనా - ఎప్పటిదైనా - దృశ్యమైనా, శ్రవ్యమైనా, అది - జీవితాన్ని బాగు చేసేదిగా ఉండాలిరా! సామాజికంగా, రాజ్యాంగపరంగా, కళాత్మకంగా, పారమార్థికంగా, సామాన్యుడికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి ‘అందేశ్రీ’లు కలిగి ఉండాలిరా! రచనలు; ఈ అయిదు రోజుల సంరంభాలన్నీనూ - అన్నివిధాలా - అక్షరంగా - విజ్ఞానానంద శరజ్జ్యోత్స్నల ప్రవాహాల సౌభాగ్య నగర చంద్రశేఖరంగా విరాజిల్లాలిరా! ఆదర్శ మార్గశీర్షాలై సభలు - మార్గశీర్ష మాసంలో జరుగుతున్నాయి గదా!
చివరగా ఓ మాట - నా రూపమైన తెలుగు అక్షరాల సంఖ్య ఏ ప్రాంతంలోనైనా ఏభైయారే కానీ - ఏభైయేడో అక్షరం ఉన్నదటరా? కనుక - వాడకంలోనూ పఠన పాఠనాల్లోనూ, ఆధికారిక వ్యవహారాల్లోనూ అందరూ సమదర్శనులు కండిరా! ఈ తిరునాళ్లు మూడునాళ్ల ముచ్చట కారాదురా! ఈ స్ఫూర్తి అభ్యుదయపథంలోకి అందరమూ ముందడుగు వేసే విధంగా ఉండాలిరా ప్రతి ఒక్కరమూ భాగస్వాములమై సమైక్య స్వచ్ఛ స్వేచ్ఛా భారత నిర్మాణానికి తోడ్పడే రీతిగా ఈ ఉత్-సవాన్ని ఒక సవాలుగా తీసుకుందాం. రండి! అందరికీ ఇదే నా స్వాగతం! శుభం భూయాత్!

- డా. రామడుగు వెంకటేశ్వరశర్మ 9866944287