సబ్ ఫీచర్

తరగని వెలుగు.. మన తెలుగు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె లుగు భాషకు శుభోదయం.. తెలుగువాడికి నవోదయం.. యావత్ తెలుగు హృది ఆనందంతో పులకించే ఉత్తేజకర తరుణమిది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు నుడికారానికి పండుగ. తెలుగు అక్షరానికి నిండైన ఆశీస్సులందించాల్సిన క్షణమిది. ప్రపంచ తెలుగు మహాసభల తరుణం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ప్రతి తెలుగువాడు ఆత్రంగా, ఆత్రుతగా, ఆనందంగా వేయి కళ్లతో ఎదురుచూసిన శుభవేళ.. అమ్మ మాట ఎంత గొప్పదో.. అమ్మ భాషా అంతే గొప్పదని చాటిచెబుదాం. తెలుగుదనంలోని తీయందనాన్ని, తేటతెనుగు మాటలోని ఆత్మీయతను, కమ్మదనాన్ని స్పృశించని కవి లేడు. తెలుగు భాషా సౌరభంలో విహరించని రచయిత లేడు. తెలుగు తేజానికి, తెలుగు మాటకు ఉన్న పదును ఇది. కమ్మనైన భాషగా కమనీయమైన భావ వ్యక్తీకరణకు దీటైన పదజాలంతో కూడిన ఆత్మీయ భాషగా తెలుగు రాణించింది. అందుకే దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ తర్వాత మన అమ్మ భాషకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత. అలాగే అంతర్జాతీయంగా కూడా తెలుగువారు లేని దేశం లేదు. తెలుగు మాట్లాడని ప్రాంతమంటూ లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. తెలుగు ప్రాచీనత గురించి, మన భారత, రామాయణ, భాగవతాల గురించి, పురాణేతిహాసాల గురించి తెలియనివారు ఉండరనడం కూడా నిండైన నిజం. అందుకే ప్రపంచ తెలుగు మహాసభలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు తరలి వస్తారు. తెలుగు సొబగులను ఆస్వాదించడానికి, తెలుగు సంస్కృతిని, దాని వైభవాన్ని కళ్లారా చూసేందుకు తరలివస్తున్నారు. ఏ భాష అయినా పరిణతిని సాధించాలంటే అనేక దశలను దాటాలి. ఆ దశలన్నింటినీ దాటిన తెలుగు అందరికీ అనువైన భాషగా, సులువుగా మాట్లాడే పదజాలంతో కూడిన సుమధుర భాషగా - ఒక రకంగా చెప్పాలంటే ఇటలీ భాష అంత అందమైన భాషగా పేరొందింది. అందుకే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. నిజానికి పదకొండో శతాబ్దంలోని సాహితీ భాషగా తెలుగు ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. బౌద్ధ, అశోక శాసనాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉండటం ఆనాడే తెలుగు ఘనతకు పునాది పడింది. అనేక శాసనాలు తెలుగు ప్రత్యేకతను, తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇప్పటికే జగతికి చాటాయి. ప్రాంతమేదైనా ఆయా మాండలికాల సొగసుల్లో ఒదిగిపోయి మరింత అందాన్ని సంతరించుకునే సరళతరమైన భాష తెలుగు. ద్రవిడ భాషలనుంచి ఉద్భవించినప్పటికీ తెలుగు భాష శతాబ్దాల క్రితమే పూర్తి స్వేచ్ఛను స్వాతంత్య్రాన్ని, స్వీయ భావ ప్రకటనా రీతుల్ని సంతరించుకుంది. తెలుగు భాషా పటిమ, ప్రాశస్థ్యం, ఘనత అనేక రాజరికాలను ఎంతగానో ప్రభావితం చేసింది. గోల్కొండ కుతుబ్‌షాహీలు కూడా తెలుగు భాషా సొబగులకు మైమరిచిపోయారని చెప్పడం చారిత్రక వాస్తవం. ఆంగ్ల పాలకుల హయాంలో కూడా అనేక అధికారిక పత్రాలు తెలుగులోనే ప్రచురితమయ్యాయంటే ఈ భాషకు వారిచ్చిన ప్రాధాన్యత ఎంతటిదో స్పష్టమవుతుంది. నిజానికి 1920 ప్రాంతంలోనే ఇంగ్లీషు అధికారిక భాష అయినప్పటికీ మెట్రిక్యులేషన్ వరకు తెలుగు మాధ్యమంలోనే బోధన జరిగేది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావంతో తెలుగు భాషకు మరింత ప్రోత్సాహం లభించింది. అన్ని రంగాల్లోనూ దీని వినియోగం విస్తృతమైంది. ఆ విధంగా ప్రభుత్వాల ప్రోత్సాహంతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తెలుగు భాష సమగ్ర వికాసానికి, తెలుగు మాండలికాలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడానికి బలమైన పునాదే పడింది. కవులు, పండితులు, కళాకారులు, సాహితీవేత్తలు - ఇలా ఎందరో ఎందరో తెలుగు భాషకు పుష్టిని, తరగని యశస్సును ఆర్జించిపెట్టారు. వారి వేయి వెలుగుల అక్షర విన్యాసాలతో మన తెలుగు భాష మరింతగా పరిమళించింది. మాటైనా, పాటైనా, పద్యమైనా, గద్యమైనా, కందమైనా కూడా అద్భుతంగా అందర్నీ అలరిస్తుంది. అందుకే మన భాష భిన్న ప్రక్రియల్లో ఒదిగిపోయింది. భావస్ఫోరకతతో, భావ గాఢతతో, భావ విస్తృతితో అనిర్వచనీయ రీతిలో రాణించింది, మెప్పించింది. తెలంగాణ కవితా మాగాణంలో తెలుగు భాష మరింతగా సుసంపన్నమైంది. ఏ భాష అయినా రాణించడానికి, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటూ నిరంతర చైతన్యంతో శక్తివంతం కావడానికి ప్రధానంగా దోహదం చేసేది ప్రభుత్వ పరమైన చొరవ, చేయూత. తెలుగు మహాసభల సాక్షిగా మాతృ భాషోత్సాహం సర్వత్రా వెల్లి విరియాలి. కేజీ నుంచి పీజీ వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ తెలుగు పదాలు పోటీ పడి రాణించాలి. ప్రపంచ తెలుగు మహాసభలు ఇందుకు ప్రేరణ కావాలి. తెలుగు వెలుగులు నేల నలుచెరగులా విస్తరించేలా అర్భాటంగా, అట్టహాసంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఆచరణలో మరింత సుసంపన్నం కావాలి. తెలుగు వాళ్లుగా, మాతృభాషోభవ అంటూ మనమంతా ఇందుకు అంకితమవుదాం. మన శక్తియుక్తులన్నింటినీ రంగరించి తెలుగుకు వెలుగునిద్దాం.. ఆ వెలుగులో ఉజ్వల భవిత దిశగా పయనిద్దాం.

-బి.రాజేశ్వర ప్రసాద్