సబ్ ఫీచర్

పరిశోధనా భీష్ముడు భూపాలరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చిన్నతనంలో మాదన్న మహామంత్రిని కొందరు విమర్శించేవారు. మరికొందరు గొప్పగా చెప్పుకునేవారు. ఈ నేపథ్యంలో మాదన్నను గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. పరిశోధన చేసాను’ అని చెప్పే భూపాలరావుగారి మాటల్లో స్థితప్రజ్ఞ గుణం స్పష్టంగా కన్పిస్తుంది. ఆ కాలంనాటి విలువల పాటింపు, క్రమశిక్షణ ఆయనలో మమేకమైపోయాయి. కీర్తి వ్యామోహం లేదు. తన పరిశోధనల వలన నలుగురిలో పేరుప్రతిష్టలు రావాలన్న ఆసక్తి అసలే లేదు. ఇంటర్వ్యూకు సైతం ఆయన అంగీకరించే వారుకాదు. పత్రికలో తన పేరుగాని, ఫొటోకాని చూసుకోవాలన్న తాపత్రయం అసలే లేదు. మాదన్న మహామంత్రి చరిత్రపై అత్యంత ప్రామాణిక పరిశోధన జరిపిన మేధావి శ్రీ కొమరగిరి వేంకట భూపాలరావుగారు. తన అపూర్వ వ్యక్తిత్వంతో, అపార మేధాసంపత్తితో గోల్కొండ కోటను, రాజ్యాన్ని రక్షించి శతృదుర్భేద్యంగా మలచిన మహామంత్రి మాదన్న చరిత్రను ఎంతో శ్రమకోర్చి విశేష పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చారు శ్రీ భూపాలరావుగారు. తద్వారా మరుగున పడిన తెలంగాణ చరిత్రకు ముఖ్యంగా గోల్కొండ చరిత్రకు కప్పిన తెరను తీసారు. పరిశోధనా ప్రక్రియకు రాచమార్గం వేసారు. దీనికోసం ఒక ట్రస్ట్‌కూడా ఏర్పాటుచేసారు.
బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్న గోలకొండను లక్ష్మీనివాసంగా మార్చిన మేధావి మాదన్న అని ఘంటాపధంగా చెబుతారు భూపాలరావుగారు. దీనికొక కారణముంది. మరుగునపడిన మహామేధావి మాదన్నపై మహత్తరమైన పరిశోధన జరిపిన ఏకైక అనే్వషి ఆయన. కనీసం అర్ధశతాబ్ది కాలంపాటు ఆయన మాదన్న విశేషాల సేకరణలోనే కాలం గడిపారు. దేశంలో వారు సందర్శించని గ్రంథాలయం లేదు. అదే విధం గా ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి ఆయా గ్రంథాలయాలలో రోజుల తరబడి కూర్చుని సేకరించిన సమాచారంతో అత్యంత ప్రామాణికమైన గ్రంథాలని ప్రచురించారు.
వరంగల్ జిల్లా వేంకటాపురం గ్రామంలో కమలమ్మ, సీతారామారావు దంపతులకు ఏప్రిల్ 12న 1916లో జన్మించిన కొమరగిరి భూపాలరావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి చరిత్రలో ఎం.ఎ. పట్టాను బంగారు పతకంతో సహా పొందారు. విద్యార్థి దశనుంచే వివిధ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేవారు. 1950-52 సం.కాలంలో ముల్కీ ఉద్యమంలో వీరి పాత్ర శ్లాఘనీయం. ఈ కాలంలోనే మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావుగార్ల మద్దతుతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. భాషా నిలయం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించడమే గాకుండా సంచార గ్రంథాలయాన్ని, రిఫరెన్స్ విభాగాన్ని కూడా ఏర్పరచారు. అప్పటివరకు లేని ‘కేటలాగ్’ని సర్వాంగ సుందరంగా తయారుచేయించారు.
తెలుగు, సంస్కృతం, కన్నడం, మరాఠీ, హిందీ, ఉర్దూ, అరబ్బీ, పార్శీ, ఇంగ్లీష్, డచ్ మొ. భాషలలో విశేషమైన ప్రతిభ ఉంది. ఆయా భాషలలోని కవులందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు కూడా. తాను పనిచేసిన ప్రతిచోటా కూడా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు వసంతోత్సవాలను ఘనంగా జరిపించేవారు. ఆ సందర్భంలో దేశంలోని అన్నిరంగాలలోని నిష్ణాతులను పిలిపించి, సన్మానం చేసేవారు. వివిధ కళారూపాలను వారిచేత ప్రదర్శింప చేసేవారు. తద్వారా సామాన్య ప్రజలలో తమ సంస్కృతి పట్ల గౌరవాభిమానాలను పెంపుచేసారు.
నల్గొండలో ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఆ మార్గాన జ్ఞానపీఠ గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వెళుతున్నారని తెలిసింది. వెంటనే వెళ్ళి తాముచేస్తున్న కవితా గోష్టికి రమ్మని ఆహ్వానించారు. దానికి వారు ‘తెలంగాణలో కవిత్వమేమిటయ్యా’ అని అన్నారు. కాని భూపాలరావుగారు పట్టు వదలలేదు. చివరకు వారు వచ్చారు. సభ మొదలుకాగానే భూపాలరావుగారు లేచి విశ్వనాథవారి రచనలన్నింటిని సూక్ష్మంగా పరిచయం చేసి, వారి రామాయణ కల్పవృక్షం గురించి సోదాహరణంగా సమీక్ష చేసారు. అపూర్వమైన వీరి వాగ్ధాటికి, పాండిత్యానికి ముగ్ధులైపోయిన విశ్వనాథవారు లేచి భూపాలరావుగారిని కౌగలించుకొని ‘‘తెలంగాణలో, అందునా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత సాహిత్య పరిజ్ఞానమా?’’అంటూ ప్రశంసించి తన మెడలోని పూమాల తీసి రావుగారి మెడలో వేసారు.
తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల బెడద ఎప్పుడూ ఎక్కువే. వారి కారణంగా నష్టపోయిన సామాన్య కుటుంబాలవారిని ఒకచోట చేర్చి వారికి ప్రభుత్వపు భూములలో ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతులు సంపాదించి పెట్టారు. అంతేకాదు ఆవిధంగా ఏర్పడిన కొత్త గ్రామానికి తగిన వౌలిక సదుపాయాలను కూడా సమకూర్చారు. చితికిపోయిన తమపట్ల చూపిన ఈ ఆదరణకు ఆ గ్రామ ప్రజలు కృతజ్ఞతతో ఆ గ్రామానికి ‘్భపాలపల్లి’ అని పేరుపెట్టుకున్నారు.
నల్గొండలో ఉద్యోగంలోనే ఇంకో విశేషం జరిగింది. జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అప్పుడు కేంద్రంనుంచి వచ్చిన కమిటీ ఆ పనులను రహస్యంగా పర్యవేక్షిస్తున్నది. వారు వచ్చిన విషయం తెలియని భూపాలరావుగారు తమ పనిని నిజాయితీగా నెరవేర్చారు. వీరి నిబద్ధతకు, నిజాయితీకి, క్రమశిక్షణకు, ముఖ్యంగా ఇచ్చిన సమయంలోనే పనిని పూర్తిచేయగలిగిన ప్రతిభకు కమిటీవారు పూర్తిగా సంతృప్తిచెందారు. వారు కేంద్రానికి తమ నివేదికను పంపారు. ఫలితంగా 1960లో నాటి రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ విశిష్టసేవాపతకం భూపాలరావుగారిని వరించింది.
తన తర్వాతి తరంవారికి పరిశోధనలో ఎంతో విలువైన సమాచారం అందించిన సహృదయులు రావుగారు. మాదన్న మీద పరిశోధనతోపాటు రామాయణం మీదకూడా వీరు జరిపిన పరిశోధన నభూతో నభవిష్యతి. దాదాపు 30సం వత్సరాల పరిశోధన ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామాయణాలన్నింటిని వడబోసి రచించిన అపూర్వగ్రంథం ‘కౌతిప్పలో కమ్మని కాసారం’అన్న పేరుగల రామాయణం.
ఇంత పరిశోధన జరిపినా ప్రచార ఆర్భాటాలకు వారు ఎప్పుడూ దూరమే. ఆనాటి తరంవారి విలువలకు, ప్రజ్ఞాపాటవాలకు, పాండిత్యానికి కొమరగిరి వేంకట భూపాలరావుగారు కొండంత నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే వారిలో 1940వ దశకంనాటి సగటు నిజాం రాష్ట్ర మేధావి కన్పిస్తారు. ఈరోజుతో వారికి వంద సంవత్సరాలు నిండాయి. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి పరిశోధనా స్ఫూర్తి నల్గురికి మార్గదర్శనం చేస్తూనే ఉంది. వారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరమంతా వారు ఉద్యోగం చేసిన ఊళ్ళలో జరుగుతాయి. ఈ అపూర్వ పరిశోధనా భీష్మునికి, ట్రస్ట్ ఈ శత జయంతి సందర్భంగా శతాధిక వందనాలు అర్పిస్తున్నది.

- డా.వై.కృష్ణకుమారి సెల్: 9885451014