సబ్ ఫీచర్

అర్థం కాని పదబంధాలతో తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంగులు ఆర్భాటాలు ఏవీ లేకుండా మన పిల్లలకు చక్కని తెలుగు నేర్పే నాథులే కరువయ్యారు. తప్పులు లేకుండా మన తెలుగును చక్కగా ప్రచురించి మన పిల్లలకు అందచేయాలన్న బాధ్యతను విస్మరించారు. నాలుగో స్తంభంవారు (ఆంధ్రభూమి మాత్రం కాదు) సాంకేతిక సమస్యల వలన పూర్తి నిడివి వార్తలతో అక్షరమొక వరుసలో సున్న మరొక వరసలో ప్రచురించవలసి రావడాన్ని అర్ధం చేసుకోవచ్చు. పనివేళల్లో క్రికెట్ చూడటాన్ని గురించి రాయటానికి ‘‘పనికి ‘ఆట ‘కం’’ వెనుక గల సున్నాను ఎలా ఉచ్చరించాలో సృష్టికర్తలైన ఘటోత్కచుని ఘన శిష్యగణానికే తెలియాలి. ఆటంకంలోని ‘ఆట’ను విడదీసిన ఘనాపాఠిలను ఎలా సత్కరించాలి? వీరే ‘‘రైతు నో‘టమాట’ పడిపోతూ ఉందని’’ గిట్టుబాటు ధర లేని టమాటా గురించి రాస్తారు.
అలాంటిదే ‘‘పట్టా పగ్గాల్లేకుండా విక్రయాలు’’ అన్న వాక్యం. ఇందులో ‘‘పట్టా’’ అన్న పదం భూమికి సంబంధించిన అంశం. మిడిసిపడే వ్యక్తిత్వానికి వాడే పదబంధం ‘‘పట్టపగ్గాల్లేవు’’ అన్నది. పట్టా కనపడింది. పగ్గం రాతల రాయళ్ల చేతిలో ఉంది రెండు కలిపి ముడివేసి తమ ప్రజ్ఞను బయటపెట్టుకునే అవకాశం దొరికిందని వినియోగించి రేపటి యువత మీదకు తప్పుల తడక పదబంధం వదిలిపెట్టారు. రైళ్ల సమ్మె (లేదా బస్సు) ఆగదని చెప్పడానికి ‘‘్భరథ చక్రాలు ఆగవు’’ అన్న వాక్యం ‘‘్భరత’’ అన్నది ఒప్పు పిల్లల్లారా! అంటే మమ్మల్ని చవటను చూచినట్టు చూస్తారు. ‘‘అల ‘వాట్స్’ మారితేనే ఆదా’’ ఇది విద్యుత్ పొదుపుకోసం ఇచ్చిన షాక్. మగవారిని మృగాలతో పోలుస్తూ ఉన్నామని మురిసి ముప్పందయిన వ్యక్తి సృష్టి ‘మృగాళ్లు’ అన్న పదం. మృగాలు ప్రకృతికి భిన్నంగా ఏనాడూ ప్రవర్తించలేదు. అవకాశం లభిస్తే అధర్మానికి ఒడిగట్టే మానవులను మృగాలతో పోలిక తెచ్చి వాటి పరువు తీయటమెందుకు? ఏదో సాంకేతిక లోపాల్ని తెలియజేయడానికి వాడిన పద రాజము ‘‘సాంకేతికమక’’. ఆంగ్ల భాషాభివృద్ధికి ఆంగ్ల పత్రికలను, తెలుగు భాషాభివృద్ధికి తెలుగు పత్రికలు చదవమని చెప్పే వారు. ఇలాంటి పద ప్రయోగాల తెలుగు చదివితే ఎర్రగడ్డకో లేక వైజాగ్‌కో చేరటం ఖాయం.
అందము, ఆరోగ్యము, వంటలు, ఇలా ఒకటా రెండా? ఎందులో చూచినా పీక పిసికి చంపాలన్నంత కోపం వచ్చే పదాలే. ‘‘నా పెదవవులు కాస్త లావుగా ఉన్నాయి. కొంచెం చూడబుల్‌గా ఉండేలా ఎలాంటి లిప్‌స్టిక్ వాడాలి?’’ అన్న ధర్మసందేహం ఒక ధరణీధరవర సుకుమారికి. ‘చూడదగ్గ’ అన్న అతి చక్కని పదబంధం ఉండగా ఇదా వాడేది? తలనెప్పి, ఖచ్చితము, శాఖాహారము, బుద్ధి మాంధ్యులు, ఆశ్ఛర్యము, ఉడిపి (ఉడుపి) వంటి అచ్చుతప్పు పదాలు సరి అయిన పదాలుగా చలామణి అయిపోతూ ఉన్నాయి. మాంగళ్యం, కళ్యాణం అనేవే సరి అయినవని రాస్తూ ఉన్నారు.
ఇక సాంకేతిక విప్లవం వచ్చాక ఆ పదాలన్నీ యథాతథంగా ఆంగ్లంలోనే చెబితేనే నిరక్షరాస్యులైనా అర్ధం చేసుకోగలిగే దశకు చేరుకున్న తర్వాత కూడా ముఖపుస్తకమని, అంతర్జాలమని అనువాదాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు. సాంకేతిక పరికరాలేవీ స్వదేశీయం కానప్పుడు పనిగట్టుకుని తెలుగు అనువాదాలెందుకు? వ్యాకరణ విరుద్ధంగా వైరి సమాసాలను తయారుచేసినా ఉచ్చరించడానికి సులువుగా వినసొంపుగా వ్యతిరేకార్ధముకాకుండా అనుకున్న అర్థమే స్ఫురించాలి. అలా విరుద్ధార్ధము కలిగించే పదమే ‘అగ్నిమాపక యంత్రము’. ఈమధ్య చాలామంది దీనిని తప్పు అని వేలెత్తి చూపుతున్నారే తప్ప ఎందుకు తప్పుగా మారిందోనని చెప్పడం లేదు. వేలమందికి నష్టం వాటిల్లేటప్పుడు ఒకరికి హాని జరిగినా తప్పులేదన్నట్టు గంటలు మోగించుకుంటూ అమితమైన వేగంతో వెళ్లే ఫైరింజన్లను ‘గంటలబండి’ అనేవారు. అంతవరకు బాగానే ఉంది. మరి అతి ప్రయాసతో చేసిన ఈ ‘అగ్నిమాపక యంత్రం’ ఏమిటి? ఇందులో ‘అగ్ని’ సంస్కృత పదం. ‘మాపు’ అన్నది అచ్చతెలుగు పదం. ‘మాపు’ అనే పదానికి అర్థం నాశనము చేయు లేదా నిర్మూలించు. అంటే అగ్నిమాపు యంత్రం అంటే చాలు. ఏ మహానుభావుడో మాపకము అన్న పదాన్ని తెలియక వాడి ఉండవచ్చు (మాపకము=కొలుచుట) మన శతకకర్త పేర్కొన్నట్టు పదుగురాడు మాటే ప్రమాణం అవుతున్నది తప్పే అయిననప్పటికీ. అందుకే వైరి సమాసాలే అయినా అర్ధం సరిగ్గా ఉంటే చాలు.
‘త’ ‘క’ ‘ప’ ‘ము’ ఈ విడి అక్షరాలను క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదాలవుతాయి. ‘పతకము’ అంటే ఒక కంఠాభరణ విశేషము. అదే పదంలో రెండో అక్షరాన్ని దీర్ఘంగా పలికితే జండా, మహా ప్రాణంగా పలికితే ఎత్తుగడ, మొదటి అక్షరమే దీర్ఘంగా ఉచ్చరిస్తే ‘పాపము’ అని ఇలా వేర్వేరు అర్థాలు వస్తాయని నేడు తెలుగు చదివే చాలామంది పిల్లలకు తెలియదు. ‘పరపతి సంఘం’ అన్న మాటను చదివిన శ్రీమాన్ తిరుమల రామచంద్రగారి తల్లి ‘పరుల పతి కోసం మీరెందుకు సంఘం పెట్టాలి? వారి తిప్పలేవో వారు పడతారు కదా! అన్నదట. ప్రపంచీకరణ, క్రమబద్దీకరణ, హేతుబద్దీకరణ, బలోపేతం, రుణమేళా, ఏకీకృతం, ఏకగవాక్ష ఇలా ఎవరికీ సరిగా అర్థం కాని అనువాద పదాలు అవసరమా? అలాంటిదే ‘అత్యాచారము’ అన్న పదం. ఇది రెండు పదాల కలయిక. అతి+ ఆచారము. సంధి ప్రకారం చూచినా అలా ఉచ్చరించడం తప్పే. అంటే అతి అన్న పదం ఎక్కువ అన్న అర్థాన్ని సూచిస్తే ఆచారము అన్న పదం సంప్రదాయము అన్న అర్థాన్ని సూచిస్తుంది. మరి ఆ మాటకు అర్థం ఏమవుతుంది? చేయకూడని పని చేసినాడన్న అర్థంతో ‘అ’కృత్యము’ అన్న పదం వాడొచ్చు అని ఒక్కరంటే ఒక్కరికి కూడా తోచలేదా? వినాళగ్రంథులు చక్కని పదం ఉండగా ‘వితంతు గ్రంథులు’ అని పాఠ్య బోధన కూడా తమ నెత్తినే మోస్తున్న పత్రికలు రాస్తున్నాయి.
ఇక ప్రజలను అప్రమత్తం చేయడానికి టీవీలో వచ్చే వైద్య సలహాలలో ఒకరు ‘మలద్వార్’ అని అంటే నేనే సరిగా వినలేదేమో అనుకున్నా ఐదారుసార్లు అదే పలికేసరికి అరికాలి మంట నెత్తికెక్కింది. రివ్యూ పిటిషన్ అన్న పదం యథాతథంగా చెప్పినా అర్థం చేసుకోగలిగినప్పుడు ‘సమీక్షా అర్జీ’ అన్న అర్థంకాని రెండు భాషల దుష్ట సమాసం సృష్టించాల్సిన అవసరం ఉందా? ఒక బ్యాంక్ మేనేజరు గారు ఒక కుగ్రామంలో స్ర్తిలను ఉద్దేశించి ‘‘స్వయం ఉపాధివల్ల మీరు స్వతంత్రంగా జీవించవచ్చు. మా బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’’ అని ముగించి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా కూర్చున్నాడట. అరగంట గడిచినా ఎవరూ ముందుకు రాలేదట. ఆఖరుకు ఒక పెద్దామె ముందుకు వచ్చి ‘‘సారూ రుణాలు అవి మాకేంటికి? యాదన్న యాపారం పెట్టుకుంటాం. మీ బ్యాంకి నుంచి లోను యిప్పిచ్చండి సారూ’’ అన్నదట. రుణం అన్న మన పదం కంటే ఆంగ్లంలోని ‘లోన్’ అన్న పదం అర్థమైంది సులభంగా. భావ వ్యక్తీకరణనే భాష వినియోగం. ఇదేదో చమత్కారం కోసం రాయలేదు. వాస్తవ సంఘటనే. ‘చార్ క్రోస్ పర్ బదలే పానీ ఆఠ్ క్రోస్ పర్ బదలే బాణీ’ నాలుగు క్రోసులకు నీరు మారుతుంది. ఎనిమిది క్రోసులకు బాణీ (్భష) మారుతుంది అన్న హిందీ సామెత.
నేటి పత్రికలలోని ఈ కొత్త పదబంధాలు ఏ నిఘంటువులలోనూ కనబడవు. ‘‘తెలుగు అకాడమీ’’ వారు ఇలాంటి చక్కని పదబంధాలతో ఒక నిఘంటువు ప్రయత్నం చేస్తే ఎంతోమందికి ఉపాధి కల్పించినవారవుతారు. ‘‘తెలుగు సాహితీ సంఘము’’ అని మార్పు చేయలేరా? ఏ ఎండకాగొడుగు పట్టే తెలుగు అకాడమీ వారు ఇప్పుడు తెలుగు భాషలో ఒక ఏస (యాస)గా ఉన్న తెలుగును తెలంగాణా భాష అని అంటున్నారు మేధావులనిపించుకుంటున్నవారే. భాషకు ఏసకు తేడాలేదా? ఇక పైగా తెలంగాణ భాషను రక్షించవలసిన సమయం ఆసన్నమయిందని పంచెలు పైకెగగట్టుతూ ఉన్నారు. నిరక్షరాస్యులున్నంతవరకు అన్ని ప్రాంతాల యాసలు జీవనది లాగా సజీవంగా విలసిల్లుతూనే ఉంటాయి అన్న సంగతి విస్మరిస్తూ ఉన్నారు.
ఒక చిన్న వివరణ. ఎండ మారినట్లల్లా గొడుగులు ఎవరూ మార్చరు. రాజ లాంఛనాలలో గొడుగు కూడా ఒక భాగం. ఇప్పటి కాషాయ, పసుపు, గులాబి కండువాల్లాగే ఎవరి రాజ్యానికి వారికి ప్రత్యేకమైన గొడుగు ఉంటుంది. అంటే ఎవరి అండన (ఆశ్రయంలో) ఉంటే వారి గొడుగే పట్టటం సహజం. ‘అండ’ అన్న పదం క్రమేణా ఎండగా మారింది.

-ఆయి కమలమ్మ