సబ్ ఫీచర్

‘అప్‌డేట్’ అవని మావోయిస్టులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల అధికార ప్రతినిధి ప్రతాప్ ఇటీవల ఒక వ్యాసంలో తమ పార్టీ జరుపుతున్న పోరాట ప్రభావాన్ని ఆకాశానికెత్తారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలతోపాటు మలయా, బర్మా, ఇండోనేషియా, కంపూచియా దేసాల్లోనేగాక జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రజలను కార్మికవర్గాన్ని తాము జరుపుతున్న పోరాటం ఉత్తేజపరుస్తోందని, స్ఫూర్తిగా నిలుస్తోందని రాశారు.
భారతదేశంలో కార్మికులు, రైతులు, ఆదివాసులు, విద్యార్థులు, మేధావులు ఉద్యమబాట పట్టారని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను ముందుకు తీసుకువెళుతున్నారని, ఈ అసమాన పోరాటం ప్రపంచవ్యాప్త ఉద్యమకారులను ఉత్తేజ పరుస్తోందని పేర్కొన్నారు. భారతదేశ, ప్రపంచ రాజకీయాల గురించి ఏమాత్రం పరిచయమున్నవారైనా ఈ అభిప్రాయాన్ని అభూతకల్పనగానే పరిగణిస్తారు. ఇలా తమనితాము గొప్పశక్తిగా, బలమైన పార్టీగా ప్రకటించుకుంటే హుందాగా ఉండదు.
ప్రతాప్ పేర్కొన్న దేశాల్లో వేళ్లమీద లెక్కించదగ్గ వ్యక్తులకు ఆకర్షించినంత మాత్రాన మొత్తం ఆయా దేశాల కార్మిక-కర్షకులను ఆకర్షించినట్టు, ఉత్తేజపరిచినట్టు కాదు. అయినా తమది అద్భుత పార్టీగా, గొప్ప భవిష్యత్ ఉన్న పార్టీగా తమకి తాము చిత్రించుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది తప్ప వాస్తవం అవదు. వాస్తవేమిటో ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతటా ప్రజలు మార్క్సిజాన్ని పక్కనపెట్టి, పారిశ్రామిక విప్లవాలు తీసుకొచ్చిన సాంకేతికతను ఆలింగనం చేసుకొని, ప్రజాస్వామ్య పద్ధతిలో పురోగమన దిశలో పయనిస్తున్నారు. ఏ సోషల్ మీడియాలోకి వెళ్లి పరిశీలించినా, ఇంటర్నెట్‌లోకి వెళ్లి శోధించినా వాస్తవం బోధపడుతోంది. ఈ సౌలభ్యం ఉన్నదని కూడా విస్మరించి అర్ధ శతాబ్దం క్రితం మాదిరి వాస్తవాల్ని పరిశీలించకుండా ప్రకటిస్తే ఎలా? 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం విప్పారుతున్న తరుణంలో మావోయిస్టులు ఇలా ప్రపంచాన్ని ఉత్తేజ పరుస్తున్నామని అవాస్తవాల్ని ప్రకటించడం భావ్యం కాదు, భావదారిద్య్రం తప్ప.
భారత ప్రజలపై సామ్రాజ్యవాదం, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం, బడా భూస్వామ్యం అనే మూడు పర్వతాలు పెనుభూతంగా ఉన్నాయని, వాటిని కూకటివేళ్లతో పెకిలించివేయకుండా భారత ప్రజలకు విముక్తి లేదని చెబుతూ తమ పార్టీ ప్రజలను ఆ విముక్తి పథంలో నడిపిస్తోందని, ఈ విధానం ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని అన్నారు. భారత ప్రజలు భూస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం కింద నలిగిపోతున్నారన్న విశే్లణ ఎంత శాస్ర్తియమైనదో, ఎంత వాస్తవికమైనదో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు.
ఇలా వంద సంవత్సరాల క్రితపు భావజాలాన్ని ఏమాత్రం జారిపోకుండా గట్టిగా పట్టుకుని, కాపాడుకుంటూ అవసరమైనప్పుడు ఇలా అక్షరరూపం ఇచ్చి మావోయిస్టులు ఎంతకాలం ప్రజలను మభ్యపుచ్చుతారు? ఈ ప్రశ్న ఎవరైనా వేస్తారన్న వెరపు సైతం లేకుండా అవాస్తవాలనే శాస్ర్తియమని విశ్వసించి రచనలు చేస్తేఎలా? వాస్తవానికి కొలంబియా మావోయిస్టు గెరిల్లాలు (్ఫర్క్) చేతులెత్తేసి, ఆయుధాలు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి జనజీవన స్రవంతిలో కలసిపోయిన సంగతిని ప్రస్తావించే ధైర్యం ప్రతాప్‌కు లేదు. భారత మావోయిస్టులకన్నా, నక్సలైట్లకన్నా ముందునుంచే ఫార్క్ గెరిల్లాలు మావోయిజం వెలుగులో పోరాడి చివరికి తత్త్వం బోధపడి ఆయుధాలను విసర్జించారు. ఇదికదా వాస్తవ పరిస్థితి. ఫిలిప్పైన్స్, పెరు తదితర దేశాల్లోనూ మావోయిస్టు భావజాలంగలవారు పలచనయ్యారు.
ప్రపంచవ్యాప్త వామపక్షాలకు, వామపక్ష తీవ్రవాదులకు ఉత్తేజాన్నిచ్చిన లాటిన్ అమెరికా దేశాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో అందరికీ తెలుసు. క్యూబా సైతం అమెరికాతో చేతులు కలపి పనిచేస్తోంది. వెనిజులాలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. కాంబోడియాలో మావోయిస్టు భావజాలం గల నాయకులకు అక్కడి ప్రభుత్వం భారీ శిక్షలు విధించింది. అక్కడి ప్రజలు ఆ ఆలోచనలనుంచి పూర్తిగా బయటపడ్డారు. నేపాల్ మావోయిస్టుల పరిస్థితి ప్రపంచం ముందు ఉంది. వారిప్పుడు అక్కడి పార్లమెంట్ లాబీల్లో కనిపిస్తున్నారు. కానీ ప్రతాప్ మాత్రం తన రచనలో నేపాల్ కార్మిక-కర్షకులను సైతం తమ పోరాటం ఉత్తేజపరుస్తోందని పేర్కొనడం విడ్డూరంగాక ఏమవుతుంది? అతిశయం అనిపించకుండా మరేమనిపించుకుంటుంది?
ఇలా అతిశయం, అవాస్తవాలతో పొద్దుపుచ్చితే ఆ పార్టీకి విశ్వసనీయత ఉంటుందా? తమది దేశవ్యాప్త పార్టీగా ప్రకటించుకుని ఇలా తప్పుడు అవగాహనను ప్రజల్లో కలిగించడం భావ్యమా? బర్మా పేరు మయన్మార్‌గా మలయా పేరు మలేసియాగా కంపూచియా పేరు కాంబోడియాగా మారి దశాబ్దాలవుతున్నా పాత పేర్లనే పేర్కొనడమంటే మావోయిస్టు నాయకులు ‘అప్‌డేట్’ కావడానికి ఇష్టపడటం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ప్రపంచ పరిణామాలను పట్టించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది.
భారతదేశానికి అనుసరించిన వ్యూహం.. ఎత్తుగడలను భారతదేశంలో ప్రస్తుతం ఆచరణలో పెడుతూ అది కాస్త ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను ఉత్తేజ పరుస్తోందని పేర్కొనడం హాస్యాస్పదం. ఏడు దశాబ్దాల క్రితపు వ్యూహం - ఎత్తుగడలు, భావజాలం, ఆలోచనలు ఇప్పుడు నాల్గవ పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లుతున్న సమయంలో ఉత్తేజకరంగా కనిపించడం, భావించడం ఎంతటి అమాయకత్వం?
చైనా, భారతదేశాల మధ్య అనేక సామ్యాలున్నప్పటికీ కీలకమైన దేశకాలమాన పరిస్థితులు ప్రధానమన్న అంశాన్ని బొత్తిగా పట్టించుకోకుండా ప్రజల ధనప్రాణాలతో చెలగాటమాడటం ఆహ్వానించదగ్గ అంశమవుతుందా?
దేశవ్యాప్తంగా ప్రతిఘటన ప్రాంతాలు, గెరిల్లా జోన్‌లు, గెరిల్లా బేస్‌ల నిర్మాణం, బేస్ ఏరియాల ఏర్పాటు, బలమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నిర్మాణం.. అంటూ పచ్చని అడవులను ఎర్రబార్చడం, ఆదివాసీలను బలి తీసుకోవడం, అమాయకుల చేత ఆయుధాలు పట్టించడం, కాలం చెల్లిన అమాయకుల చేత ఆయుధాలు పట్టించడం, కాలంచెల్లిన తమ సిద్ధాంతాలకు వారిని ఆహుతి చేయడం పూర్తిగా అన్యాయం.. అధర్మం.
ఉన్న ప్రజాస్వామ్యాన్ని విస్మరించి లేని భూస్వామ్యం, ధనస్వామ్యం, దళారీ సామ్రాజ్యవాదం పేర ఆటవిక పద్ధతిలో అడవులకే పరిమితమై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోజురోజుకు బలోపేతమవుతున్న నగర-పట్టణ, ఉత్పత్తి రంగాలను మార్క్స్ ప్రవచనాలతో ప్రక్షాళన చేస్తామనుకోవడం పేరాశ మాత్రమే..
ప్రపంచవ్యాప్తంగా ప్రజాజీవితం ఓ కొత్త కక్ష్యలో పరిభ్రమిస్తోందన్న సంగతిని గమనించకుండా, అటువైపు దృష్టి సారించకుండా, డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చిన విప్లవాన్ని గమనంలోకి తీసుకోకుండా, మానవ ఆలోచనల్లో వచ్చిన మార్పులను పసిగట్టకుండా తమకు తోచిన విధంగా ప్రణాళికలు రచించుకుని, ఊహాలోకాల్లో విహరిస్తూ 2050 సంవత్సరం నాటికి ఎర్రకోటపై ఎర్రజండా ఎగరేస్తామని బీరాలు పలకడం భారత ప్రజలను మోసగించడమే, వారిని తప్పుదోవ పట్టించడమే అవుతుంది.
అభివృద్ధికి దూరంగా ఉన్న బడుగు-బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, వారు సాధికారతతో జీవించాలంటే సాయుధ పోరాటం, గెరిల్లా జోన్లు, బేస్ ఏరియాలు ఏర్పాటు చేయడం కాదు, వారి జ్ఞాన పరిధిని విస్తరించడం, స్వయంగా తమ హక్కులను, బాధ్యతలను తాము గుర్తించడం.. ఈ కీలకమైన అంశాన్ని విస్మరించి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని పాచిపోయిన సిద్ధాంతాలను వల్లెవేసినా వారు సాధికారతను సాధించలేరు. సాధికారతను సాధించడానికి మించిన సాయుధ పోరాటం ప్రపంచంలో మరొకటి లేదు!

-వుప్పల నరసింహం.. 9985781799