సబ్ ఫీచర్

రాయితీలు స్వల్పం.. జనహితమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాకర్షక పథకాలు మెండుగా ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ప్రజాహితమే ముఖ్యమన్న భావనను ప్రతిబింబిస్తూ మోదీ సర్కారు సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దేశ ప్రజానీకంలో అసమానతలను తగ్గించటంపై దృష్టిపెట్టి, సామాజిక భద్రతకు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం పూనుకుంది. పన్ను ఎగవేతకు మార్గాలను మూసివేసి, సబ్సిడీలను అవసరమైన వారికే పరిమితం చేయటం, పన్ను రాయితీలను తగ్గించటం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టు బడ్జెట్ తేటతెల్లం చేస్తోంది.
మార్కెట్ల పతనం దేనికి సంకేతం?
బడ్జెట్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తే సంపన్న వర్గాలకు అనుకూలంగా ఆ ప్రతిపాదనలు ఉన్నాయని అర్థం. ఈసారి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మొదలెట్టగానే కొంతసేపు మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. పన్నుల ప్రతిపాదనలు తెలిపిన తర్వాత సూచీలు కుదుపులకు లోనయ్యాయి. సెనె్సక్స్ 450 పాయింట్ల వరకు పతనమైంది. ప్రసంగం ముగిసాక 290 పాయింట్ల వరకు పెరిగి చివరకు 58.36 పాయింట్లు నష్టంతో లావాదేవీలు ముగిసాయి. స్టాక్‌మార్కెట్లను తీవ్రంగా నిరాశపర్చినది మూలధన లాభాల పన్ను. లక్షలకు పైబడ్డ లాభాలపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్నును విధించారు. ఇది మదుపరులకు నచ్చలేదు. కాని ఇది పురోగామి చర్య. గత ఏడాది పెద్దపెట్టుబడిదారులు, పెద్ద కంపెనీల వారు రూ.3,67,000 కోట్లమేరకు స్టాక్‌మార్కెట్ల లావాదేవీలపై లాభాలు ఆర్జించారు. ప్రభుత్వానికి ఆ లాభాల కారణంగా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. కనుక ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1 నుండి జరిగే అన్ని లావాదేవీలపై మూలధన లాభాల పన్ను విధించారు. సంపన్న వర్గాలు వారు వ్యతిరేకిస్తారని తెలిసి కూడా ఈ పురోగామి చర్యలుకు పూనుకోవటం నిజంగా సాహసమే.
చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం
కార్పొరేటు పన్ను మన దేశంలో ప్రస్తుతం 30 శాతంగా ఉంది. దీన్ని తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. ఇతర దేశాలలో కార్పొరేటు పన్నులు మన దేశంలో కంటే తక్కువగా ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించటానికి దేశాల మధ్య ఉన్న పోటీ వలన ఈ పన్నును తగ్గించటం తప్పనిసరి. గత ఏడాది 50 కోట్ల మేర టర్నోవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే 25 శాతం కార్పొరేటు పన్నును వర్తింపచేశారు. ఈ ఏడాది ఈ పరిమితిని 250 కోట్లకు పెంచారు. దానితో ఆరులక్షల కంపెనీలకుగాను 59,300 కంపెనీలకు కార్పొరేటు పన్ను 25 శాతం అయింది. మిగిలిన 7000 కంపెనీలు చాలా పెద్దవి. వారి టర్నోవర్ ఏడాదికి లక్షల కోట్లలో ఉంటుంది. కాలక్రమంలో వాటికి కూడా దీనిని వర్తింప చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ చర్య చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఊరట.
నల్లధనం కట్టడికి యత్నం
గత ఏడాది పెద్దనోట్ల రద్దు తర్వాత ఆశించినంత మేర నల్లధనం బయటపడలేదు. బ్యాంకులు, ఉన్నత అధికార వర్గాలవారు నల్లకుబేరులతో చేతులు కలపటంలో ఆచరణలో ఆ పథకం విఫలమైనట్లుగా కనపడింది. కానీ, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల వలన పన్ను చెల్లింపుదారులు పెరిగారు. పెద్దనోట్లు రద్దు తర్వాత కార్పొరేటు పన్ను ద్వారా రాబడి పెరగలేదు. అయితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారుల సంఖ్య 8.27 కోట్లకు చేరింది. 120 కోట్ల మంది ఉన్న దేశంలో కేవలం 7 శాతం మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. జీఎస్‌టి ప్రవేశపెట్టిన తర్వాత వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా, కార్పొరేటు పన్ను ద్వారా కూడా రాబడి పెరిగింది. అన్ని లావాదేవీలు నమోదు అవుతుండటంతో వచ్చిన ఆదాయపుపన్ను ఎగవేత వ్యాపారులకు కష్టంగా మారింది. అంతకుముందు ఉన్న అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఇప్పుడు వారు చెల్లిస్తున్న ఒకేఒక పన్ను వస్తుసేవల పన్ను. దాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించటం ముదావహం.
వేతన జీవులకు వెసులుబాటు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభుత్వేతర వేతన జీవుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారికి కొంత వెసులుబాటును ఈ బడ్జెటులో కలిగించి ఉండవలసింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెరుగుతుందని, పన్ను శ్లాబులలో, పన్నురేట్లలో అనుకూలమైన మార్పులు వస్తాయని ఆశించిన ఉద్యోగస్తులకు ఆశాభంగం అయింది. బహుశా బడ్జెటుపై చర్చ సందర్భంగా పన్నురేట్లను ఆర్థికమంత్రి సవరించవచ్చు లేదా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కొంత పెంచవచ్చు. వయోధికులు బ్యాంకులలో, పోస్ట్ఫాసులలో దాచుకునే మొత్తాలపై వచ్చే వడ్డీ ప్రస్తుతం 10వేలు దాటితే పన్ను పరిధిలోకి వస్తుంది. ఆ పరిమితిని 50 వేలకు పెంచటం వయోధికులకు ఉపశమనం. జీవిత బీమా సంస్థలో 7.5 లక్షల వరకు మదుపు చేసుకొనేందుకు ఉన్న ప్రస్తుత పరిమితిని 15 లక్షల వరకు పెంచి, నికరంగా వార్షిక వడ్డీ శాతం 8 శాతం వచ్చేటట్లు చేశారు.
రబీ పంటలకు ఇప్పటికే వర్తింపు చేసిన కనీస మద్దతు ధర పెంపును ఇప్పుడు ఖరీఫ్ పంటలకు వర్తింపచేయటంతో దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లయింది. ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు అయేటట్లు కనీస మద్దతు ధర నిర్ధారించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలుకు నోచుకోకపోయినా 1 1/2 రెట్లు అదనంగా కనీస మద్దతు ధరను పెంచటానికి నిర్ణయించటం ముదావహం. అయితే, రైతులలో కేవలం 5.8 శాతం మంది మాత్రమే దాని వలన లబ్ది పొందనున్నారు. వ్యవసాయ ఋణాల లక్ష్యం వచ్చే ఆర్థికానికి 10 శాతం అంటే 11 లక్షలకు పెంచటం, పాడి రైతులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వటం, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు, పరిమళ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, తదితర చిన్న ఉత్పత్తిదారులకు సహకారం, నేరుగా వినియోగదారులకే అమ్ముకోవటానికి వీలుగా 22 వేల గ్రామ సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేయటానికి సంకల్పం, కౌలు రైతులకు రుణ సౌకర్యం అందించేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నీ గ్రామీణ భారత వికాసానికి దీన్‌దయాళ ఉపాధ్యాయ స్ఫూర్తి నుండి చేసినట్లు కనపడుతుంది.
ఆయుష్మాన్ భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 10 కోట్లమంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరే ఈ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం క్రింద ఏడాదికి 5 లక్షలమేర పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోపాటు ఆరోగ్య, స్వస్థత కేంద్రాలు ద్వారా సమగ్ర ఆరోగ్య పరిరక్షణ సేవలను అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరుచుతున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు. గ్రామీణ పేద ప్రజలను ఉద్దేశించి యోచన చేసిన ఆరోగ్య పథకాలు ప్రజలకు మేలు చేసేవే.
వౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
జాతీయ రహదారుల అభివృద్ధికి, గ్రామీణ రహదారులకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదల ఇళ్ళ నిర్మాణానికి, రైల్వేల ఆధునీకరణకు, రైల్వే ప్రయాంకుల భద్రతకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. 2019 నాటికి దాదాపు కోటి ఇళ్ళు నిర్మాణానికి, పట్టణ ప్రాంతాలలో 37 లక్షల ఇళ్ళు నిర్మాణానికి పూనుకొనటం సాహసమే. 9వేల కిలోమీటర్లకు పైగా పొడవైన జాతీయ రహదారులను నిర్మాణం చేయాలని సంకల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగా వౌలిక వసతులు విస్తరణ కార్యక్రమంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి.
అమలు జరిగేనా?
గ్రామీణ భారతం రుణశయ్య మీద ఉంది. బడ్జెటులో సింహభాగం రూ.14.34 లక్షల కోట్లు గ్రామ ప్రాంతాలలోనే ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. 3.17 లక్షల కిమీ మేర రహదారులు, 51 లక్షల కొత్త ఇళ్ళు, 1.86 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, 1.75 కోట్ల ఇళ్ళకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. పథకాలు అమలైతే గ్రామీణ భారతం స్వర్ణ్భారతం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. సామాజిక భద్రతకు, ప్రజారోగ్యానికి, నల్లధనం అదుపునకు, స్వావలంబన సాధనకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలు నిజంగా అభినందనీయమే. ప్రభుత్వ యంత్రాంగపు సామర్థ్యాన్ని నమ్ముకొని ఇవన్నీ కార్యరూపం దాల్చి ప్రజలకు చేరుతాయని మోదీ అనుకుంటే ఆయన పప్పులో కాలువేసినట్లే!

-డా. బి.సారంగపాణి