సబ్ ఫీచర్

హాసమా..! పరిహాసమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలువెత్తు ప్రజాస్వామ్యానికి ప్రతీక మన పార్లమెంటు. రాజకీయాలకూ హాసకీయాలకూ కూడా. భజన, భంజనలతో పాటు జనరంజకంగా కూడా సాగే ప్రజాప్రతినిధుల మేధో విలాసానికీ, వికాసానికీ కూడా దర్పణం పడుతుంది. ఎంతటి తీవ్రాతి తీవ్రమైన విషయంపైన చర్చ జరుగుతున్నా అప్పుడప్పుడు వ్యంగ్య బాణాలతో హాస్య తోరణాలు కడుతూ పార్లమెంటుకు వనె్న తెచ్చిన వారెందరో. హాస్యానికీ, వ్యంగ్యానికీ తేడా తెలియక తికమకపడి నవ్వుల పాలైనవారూ ఉన్నారు. నవ్వుతూ ఏడ్పించిన వారూ ఉన్నారు. హాస్య స్ఫోరక వాగ్బాణాలు నవ్విస్తే, వ్యంగ్యాత్మక అస్త్రాలు నొప్పిస్తాయి. అంతేకానీ అవమానించవు. ఒకవేళ అవమానాస్పదంగా ఉంటే అది వ్యంగ్యమే కాదు. హాస్యం నవ్విస్తూ ఆలోచింపజేస్తే, వ్యంగ్యం విమర్శిస్తూ ఆలోచనలను రేకెత్తిస్తుంది. హాసం వికటాట్టహాసం కాకుండా, పరిహాసాస్పదం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసే సంఘటనే ఇటీవల పార్లమెంటులో జరిగింది. కప్పిపుచ్చిన వ్యంగ్యాన్ని అనవసరంగా విప్పి చెప్పి మోదీ పట్ల తన ‘్భక్త పరాయణత’ను నిరూపించుకునే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు చివరికి ప్రధానికి తలవంపులు తెచ్చాడు.
నిజానికి మొన్నీ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో విసిరిన వ్యంగ్య బాణాలు ఎవరికీ గుచ్చుకునేవేమీ కాదు. కానీ శ్రీమతి రేణుకాచౌదరి నవ్వుపై ‘రామాయణం సీరియల్ తర్వాత మళ్లీ అటువంటి నవ్వును చూస్తున్నా.. ఆవిడను ఏమీ అనకండి..’ అని రాజ్యసభ చైర్మన్‌తో అనడం వివాదాస్పదమయింది. ఒక మహిళను అవమానించినట్లుగా మారింది. దీనికి కారణం రేణుకా చౌదరి నవ్వును రామాయణం సీరియల్‌లో శూర్పనఖ నవ్వుతో పోలుస్తూ అత్యుత్సాహంతో, మోదీ పట్ల అతిభక్తితో బీజేపీ ఐటీ విభాగపు అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో! ప్రధాని మోదీ వ్యంగ్యాన్ని మరీ విప్పజెప్పిన ఈ సంఘటన- వ్యంగ్యాస్త్రాలు విసిరేవారికి ఒక గుణపాఠం.
నిజానికి రాజకీయాలే ఒక బ్రహ్మ పదార్థం. అది అర్థం కావడం సులభం కాదు. అటువంటి రాజకీయాల్లో ప్రజా సంక్షేమం ఎంత ఉందో పాలనా సంక్షోభం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవడమూ కష్టమే. ‘ఆ రాజు జనరంజకంగా పాలించాడు.. ఆ ప్రభుత్వం జనరంజకంగా పాలించింది..’ అని చెప్పుకోవడం మామూలే. అయితే పార్టీలేవైనా, ప్రభుత్వాలేవైనా, రాజకీయాలెన్నైనా అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో జనరంజకత్వం ఆయా నాయకుల చమత్కార సంభాషణలలో ప్రస్ఫుటవౌతూనే ఉంది.
1962లో చైనాతో యుద్ధం తర్వాత, చైనా భారత భూభాగాన్ని కొంత ఆక్రమించుకున్న సమయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకూ, సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియాకు మధ్య పార్లమెంటులో జరిగిన ‘మాటకుమాట’ హాస్యమూ, వ్యంగ్యమూ పండిన ప్రజాస్వామ్య రసగుళిక. ‘చైనా ఆక్రమించుకున్న భూమి మీద గడ్డిపరక కూడా మొలవదు.. పోతేపోనీ’ అన్న రీతిలో నెహ్రూ మాట్లాడితే, ‘అవును.. మీ తలమీద లాగానే’ అని నెహ్రూ బట్టతలను గుర్తు చేస్తూ లోహియా విసిరిన వ్యంగ్యాస్త్రం పార్లమెంటులో నవ్వులనే పూయించిందంటారు.
అప్పట్లో ఉత్తర ప్రదేశ్‌లో ఉక్కుమనిషిగా పేరుపొందిన చంద్రభాను గుప్తాకు కుడిభుజంగా ఉన్న బాబూ గోవింద్ సహాయ్ తన సహజ సిద్ధమైన వ్యంగ్య హాస్యోక్తులతో నాయకులనే కాదు, ప్రజలను కూడా ఎంతో ఉల్లాసపరచేవారు. జనసంఘ్ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేరుూ ప్రసంగించే సభల్లో కన్నా ఎక్కువగా సహాయ్ సభల్లోనే చప్పట్లు మార్మోగేవంటే అతిశయోక్తి కాదు.
1967 ఎన్నికల్లో జనసంఘ్ ‘హిందూ రాష్ట్రం, జాతీయవాదం, గోవధ నిషేధం’ నినాదాలుగా బరిలో దిగింది. జనసంఘ్‌ను ఎదుర్కోవడానికి సహాయ్ రంగంలోకి దిగారు. కానీ ఒక్కసారి కూడా జనసంఘ్ పేరెత్తకుండానే పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలతో దాడి సాగించారు.
‘ఈ జనసంఘీయులు ఒక్క భారతదేశం లోనే కాదు, పాకిస్తాన్‌లో కూడా ఉన్నారు. అక్కడి జనసంఘీయులు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని పెట్టుకున్నారు. వాళ్లు- ఇదేం పాకిస్తాన్?! ఒక్క తాజ్‌మహల్ లేదు, ఢిల్లీ జామా మసీదు లేదు, ఎర్రకోట లేదు అంటూ వాపోతుంటారు. ఇక్కడి జనసంఘీయులు ఇదేం హిందుస్తాన్?! జాతీయ పతాకం భగవాధ్వజం కాదు, రంజిత్‌సింహ్ కోట (లాహోర్‌లో ఉంది) లేదు అంటూ ఏడుస్తుంటారు’ అని సహాయ్ చెప్పే వ్యంగ్యోక్తులకు జనం విరగబడి నవ్వేవారు.
వాజ్‌పేరుూ అయితే కాంగ్రెస్‌ను తన హాస్యోక్తులతో వణికించి నవ్వించేవారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత మాటిమాటికీ పాకిస్తాన్ సరిహద్దును ఉల్లంఘిస్తూ వచ్చినపుడు ఏమీ చేయని కాంగ్రెస్‌పై వాజ్‌పేరుూ తన సహజ శైలిలో ఎద్దేవా చేసేవారు. ‘పాకిస్తాన్ గీత దాటితే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తూ లేఖ రాసేసిందిగా’ అనేవారు. 1969లో సౌదీలోని షబ్బాత్ నగరంలో ముస్లిం దేశాల సమ్మేళనానికి అప్పటి కేంద్ర మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను కేంద్ర ప్రభుత్వం పంపించింది. అయితే ఆయనను సమ్మేళనంలో పాల్గొననీయ లేదు అక్కడి ప్రభుత్వం. ఈ సంఘటనపై వాజ్‌పేరుూ ‘కిక్ ఇండియా’ పరిస్థితి వచ్చేసిందని ఒక్కమాటలో విమర్శించారు.
పార్లమెంటులో అందరి కంటే ఎక్కువగా హాస్యోక్తుల జల్లు కురిపించింది పీలూ మోదీయే. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైలు చేయలేదు. దీనిపై ఇందిరాగాంధీ ఆయనను వెనకేసుకు వచ్చింది. జగ్జీవన్ రామ్ ఏదో మర్చిపోయారని సమర్థించింది. వెంటనే పీలూమోదీ లేచి ‘ఈ మరపు ఎప్పటి నుంచో? దేశ సరిహద్దులు గుర్తున్నాయో లేదో..’ అన్నారు.
ఒకసారి ఆనాటి ప్రధాని వీపీ సింగ్ సభలోకి తనకు అలవాటైన కుచ్చుటోపీ లేకుండా ప్రవేశించారు. దానికి కారణం- కుచ్చుటోపీ జంతువుల పట్ల క్రూరత్వానికి చిహ్నమని మేనకా గాంధీ చెప్పి ఒప్పించడం. టోపీ లేకుండా సభలోకి వచ్చిన వీపీ సింగ్‌ను ‘ఇదేమిటి? ఇలా వచ్చార’ని ఒక ప్రతిపక్షనేత ప్రశ్నిస్తే- ‘టోపీలో ఏముంది? ముఖ్యమైనది టోపీ కాదు, దాని కింద ఉండేది (బుర్ర)’అని జవాబిచ్చి అందరినీ నవ్వించారు.
ఇటీవలి కాలంలోనేతే, లాలూ ప్రసాద్ యాదవ్ తన సహజ శైలితో పార్లమెంటును ఎడాపెడా నవ్వించిన సంగతి అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఒకసారి రైల్వే మంత్రిగా ఉన్న లాలూ యాదవ్ తన సహచర మంత్రిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో గలభా జరిగింది. ‘సరే.. శాంతించండి.. నా మాటల్ని ఉపసంహరించుకుంటాను’ అనడంతో నవ్వులే మిగిలాయి. అల్లరి ఆగింది.
నవ్వవు జంతువుల్
నరుడు నవ్వును
నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు
కొన్ని నవ్వులెటు తేలవు
కొన్ని నవ్వులు విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసమున్ విరజిమ్ము
విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు
వ్యాధులకున్ మహౌషధుల్
కాబట్టి నవ్వించేవారు నవ్వులపాలు కాకుండా తమను తాము నియంత్రించుకోవాలి.

- శర్మద