సబ్ ఫీచర్

అమరత్వానికి సోపానం శివరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆదిభిక్షువువాణ్ణి ఏమి కోరేది? బూడిదిచ్చేవాణ్ణి ఏమి అడిగేది’’ అంటాడో సినీ కవి. నిందాపూర్వకగా శివతత్త్వాన్ని చెప్పే శివస్తుతి అది. జీవుడికి నిజంగా ఏది అవసరమైనదో ఆ స్థాయిని, స్థానాన్ని, ఆ విభూతిని, ఆ యోగాన్ని అందించేవాడు, అందివ్వగలిగినవాడు ఆ పరమశివుడు.
విభూతి తత్త్వమే ముఖ్యంగా సంక్షిప్తంగా శివతత్త్వం. ఇంకే రూపానికి మార్పులేని ఆఖరి అమరత్వ స్థితి విభూతి. అటువంటి స్థితికి జీవుణ్ణి చేరువ చేసేది శివతత్త్వం. ‘‘మహాశివుని తత్త్వం - జీవుల జీవితాలలో.. నడకలో, నడతలో అణువణునా, అడుగడుగునా తారాడే ప్రతిరోజు, ప్రతిక్షణం.. మనకి ‘మహాశివరాత్రే’ అంటాడో మహనీయుడు. మనస్సంకల్పతత్త్వమే అసలైన శివతత్త్వం. మనస్సుని మనం ‘లయం’ చేసుకోవాలి, చేసుకోగలగాలి. శివత్త్వానికి, శివుని తత్త్వానికి మనల్ని దగ్గర చేసే మహోత్కృష్టమైన హిందూ పర్వదినమే మహాశివరాత్రి. మహాశివరాత్రి చంద్రమానం ప్రకారం- మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజవుతుంది. చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు మహాశివరాత్రి. మనసుకి కూడా చద్రునికి ఉన్న 16 కళలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు 15 కళలు లీనమై పోయి (చతుర్దశి కాబట్టి) ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది. భగవచ్చింతన చేత మిగిలి ఉన్న ఆ ఒక్క కళని కూడా ఎక్కువగా సాధన చేసి మనోనిగ్రహం సాధించి ఫలితంగా దైవాన్ని మనం చేరుకోగలం. మనసులోని కల్మషం తొలగించుకోవటం ద్వారా ‘శవాన్ని’ ‘శివం’గా మార్చుకోగలగటమే మహాశివరాత్రి సందేశం. మార్చుకోవటమే మహాశివరాత్రి మహత్వం. దైవత్వంలో లీనమవ్వటం కోసం దైవ చింతన చేయటమే మహాశివరాత్రి పర్వదినాన మన కర్తవ్యం. మహాశివరాత్రినాడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెప్తోంది. లింగం సృష్టికి సంకేతం. బ్రహ్మము యొక్క చైతన్య ఫలిత సంకేత రూపమే లింగం. లింగం ఏదీ తనలో దాచుకోదు. ఏదీ తనతో ఉంచుకోదు. అన్నిటినీ వదిలించుకుంటుంది. అందుకే లింగం జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి మంగళకరమైన రాత్రి. చీకటిలో ‘మంగళకరం’ ఏమిటి? ఎలా ఉండగలుగుతుంది? గాఢమైన అజ్ఞానంలో జ్ఞానాన్ని మేల్కొలుపు చేసుకోవడమే మంగళకరం. మేల్కొపటమే ఆ మంగళకరం. త్రిమూర్తితత్వాన్ని ఏకత్వం కావించుకున్నపుడే, మానవత్వం మంగళత్వం అవుతుంది. మహాశివరాత్రి రోజున ప్రధానంగా మారేడు దళాల్ని శివుడికి సమర్పణ చేస్తాం. రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేస్తాం. జాగరణం అంటే ఏదో రకంగా రాత్రంతా తెలిసి ఉండటం కాదు. ప్రకృతిలో నిద్రాణంగా వున్న శివశక్తిని శివపూజ అభిషేకాలు, అర్చనలు శివలీలా కధా పారాయణలతో, భజన లీలా శ్రవణాదులతో రాత్రంతా మేల్కొలిపి సర్వాన్ని శివస్వరూపంగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణం. శివపూజలో సాయుజ్యం, శివభజనలో సామీప్యం, శివుని విషయాలు ప్రసంగించడంలో సాలోక్యాన్ని, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరాచార్యులు చెబుతారు. ఈ నాలుగింటిని సాధించుకోవటానికి మనం చేసే ప్రత్యక్ష సాధనే శివరాత్రి జాగరణం. ఒక వేటగాడు జీవనోపాధికోసం వేటికి వెళ్లాడు. రోజంతా ఏ జంతువూ దొరకలేదు. రాత్రి కూడా మారేడు చెట్టుపైకి ఎక్కి కూచున్నాడు. జంతువుకోసం చూస్తున్నాడు. అతనికి తెలియకపోయినా, అతడు చెట్టుపైనుంచి రాల్చిన బిల్వపత్రాలన్నీ, కిందనున్న స్వయంభువుగా ఉన్న శివలింగంపై పడ్డాయి. ఆ కారణంగా ఆ వేటగాడు స్వర్గప్రాప్తిని ముక్తిని పొందుతాడు. ఇది మహాశివరాత్రి మహత్మ్యాన్ని చెప్పే మహాశివరాత్రి వ్రతకథ.
‘శివుడు’ని శంకరుడు అని కూడా అంటాం. ‘శం’ అనగా చిదానందం, ఆత్మానందం వగైరా. ‘కర’ అనగా అందించేవాడు అని అర్థం. ఆత్మానందాన్ని, చిదానందాన్ని, సచ్చిదానందాన్ని, బ్రహ్మానందాన్ని, అద్వైతానందాన్ని అందించేవాడు శంకరుడు. సకల ఐశ్వర్య స్వరూపుడు శివుడు. అందుకే ‘శివుడ్ని’ ఈశ్వరుడు అని కూడా అంటాం. క్షీరసాగర మథనం సమయంలో హలాహలం ఉద్భవించింది. ఆ హలాహలాన్ని తన యోగశక్తిచేత తన గొంతులో బందీ చేస్తాడు శివుడు. ఫలితంగా మచ్చ ఏర్పడింది. కంఠం నీలంగా మారిపోయింది. అందుకనే ఆయన్ని ‘నీలకంఠుడు’ అని కూడా పిలుస్తాం. హలాహలం మ్రింగిన ఆ వేడిని శివుడు తట్టుకోవడానికి శివునికి నిరంతరంగా అభిషేకం చేయాలి. ఇది మరో పురాణం ఆధారంగా మహాశివరాత్రి కథ. మొత్తంగా శివత్వాన్ని, శివతత్త్వాన్ని అందించే అతి విశిష్టమైన మహోత్కృష్టమైన పర్వదినం మహాశివరాత్రి. సకల ఐశ్వర్యాలను అందించే శివత్వాన్ని అర్థం చేసుకుందాం. అమరత్వాన్ని అందించే శివతత్త్వాన్ని అవగతం చేసుకుందాం. శివత్త్వాన్ని, శివతత్త్వాన్ని ఆరగిద్దాం. అనుభవిద్దాం. శివతత్త్వంలో మన జీవితాలను పండించుకుందాం. పండగ చేసుకుందాం.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669