సబ్ ఫీచర్

భగవంతుని చూసిన తాపసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జాతీయతపై రామకృష్ణ పరమహంస ప్రభావం అపారం. హిందూమతంలోని మూఢనమ్మకాలు, అధిక సంప్రాదాయాలను కొంతవరకు తొలగించి, హిందూమతాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాల సవాళ్లకు ధీటుగా నిలబెట్టిన మహనీయుడు రామకృష్ణుడు. అన్ని మతాల సారాన్ని ఆమూలాగ్రంగా ఆస్వాదించడం లక్ష్యంగా అవిరళ కృషి చేసి సిద్ధి పొందిన తాపసి ఆయన. అన్ని మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవ రీత్యా మొదటి సారి ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు.
1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో ధార్మిక పేద బ్రాహ్మణులైన క్షుదీరాం, చంద్రమణీ దేవికి జన్మించారు. బాల్యంనుండీ ప్రకృతి ఆరాధకునిగా, సాధు సజ్జన ప్రసంగాలలో ఆసక్తి కనబరుస్తూ, వారికి సేవలందించేవాడు. ఉపనయనం కాగానే మొదటి భిక్ష ఒక శూద్ర యువతి వద్ద పొందుతానని మాటిచ్చి, పట్టుబట్టి, ఎందరు చెప్పినా వినక, యువతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, సాంప్రదాయ మార్పుకు శ్రీకారం చుట్టాడు.
తండ్రి మరణానంతరం పెద్దన్న రాంకుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, పౌరోహిత్యం చేస్తున్న క్రమంలో, రాణి రాషమొణి అనే యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించగా, రాంకుమార్ పూజారిగా, రామకృష్ణుడు దేవతను అలంకరించేవారు. రాంకుమార్ మరణించాక ఈయనే పూజారిగా మారాడు. గుడిలో ఉన్నది రాతి విగ్రహమా? లేక సజీవమా తెలుసుకునేందుకు రేయింబవళ్ళు చేసిన కఠోర ప్రార్థన ద్వారా అమ్మవారి దర్శనభాగ్యం కలిగింది. మనిషికి చేసేలాగే విగ్రహానికి సేవలు చేసేవాడు. అన్ని మతాల పరమ సత్యాన్ని గ్రహించాడనే ప్రచారంతో అన్ని మతాలవారూ ఆయన దర్శనానికి వచ్చేవారు. తోతాపురి అనే సాధువు అద్వైతాన్ని బోధించారు. తద్వారా మూడు రోజులలోనే నిర్వికల్ప సమాధిని పొందిన మహనీయుడు. భగవత్, ఆత్మసాక్షాత్కారం పొంది, తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాల సాధన ద్వారా ఫలితం పొందారు. ఆత్మజ్ఞాన అభ్యాసంతో పిచ్చివాడైనాడని పుకారులో, మూడుమైళ్ళ దూరాన గల జయరాంబాటి గ్రామానికి చెందిన రాంచంద్ర ముఖర్జీ ఇంటి ఐదేళ్ళ శారదాదేవితో పెళ్ళి జరిగింది. తాను నేర్చిన విద్యలన్నీ ఆమెకు నేర్పి, ఆమె గ్రహణ శక్తికి అచ్చెరువొంది, ఆమెను త్రిపుర సుందరి శక్తిగా, సాక్షాత్ కాళికాదేవిలా పూజించడం ప్రారంభించాడు. వారి సంబంధం సామాన్యులకు అర్థంకాని ఆధ్యాత్మిమైనది. అకాలంలోనే ఆయన పరమహంసగా పిలువబడినాడు. వివేకానందుడు భగవదనుగ్రహం పొందినవారికోసం తిరిగి, చివరకు రామకృష్ణుడిని కలిసి, భగవంతున్ని మీరు చూసారా మహాత్మా అని ప్రశ్నించి, సానుకూల సమాధానం పొందారు. క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురై చనిపోయే ముందు తన ఆధ్యాత్మిక శక్తులన్నీ వివేకానందునికి ధారవోసి, 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందారు.
అనంతరం 16మంది శిష్య గణానికి వివేకానందుడు సారథ్యం వహించాడు. కేశవచంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణుని సమకాలీన ఆరాధకులు. సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులలో దైవత్వం, అన్ని మతాల సారం ఒక్కటే...కామం, స్వార్థం, కాంచనాల నుండి విడివడితే భగవంతుడిని పొందవచ్చునని, భగవంతుడిని చేరడానికి మతాలు కూడా మార్గాలే నని ఆయన బోధించారు. భారత జాతీయతపై ఆయన ప్రభావం అనిర్వచనీయం.
రామకృష్ణ మిషన్ ఆయన బోధనలను ప్రచారం చేస్తూ, సన్యాసుల పరంపరను కొనసాగిస్తునే ఉంది. మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడని, కామము, అసూయ రెండు భగవంతుని దర్శనానికి శతృవులని, గృహస్తులు శ్రద్ధగా ప్రార్థిస్తే భగవంతుని దర్శనం సాధ్యమేనని, జ్ఞానం ఐకమత్యానికి, అజ్ఞానం కలహానికి హేతువులని రామకృష్ణుని ప్రవచనాల సారాంశాలు.

- సంగననట్ల రామకిష్టయ్య