సబ్ ఫీచర్

మార్క్సిజం ఓ అజ్ఞానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని కారల్ మార్క్స్ రెండుగా వర్గీకరించారు. ఒకటి శ్రామిక వర్గం, రెండవది పెట్టుబడిదారీ వర్గం. గతమంతా వర్గాల మధ్య పోరాటం సాగిందని ఆయన సిద్ధాంతీకరించారు. మనుషుల సమూహాలే సమాజం. వీరిలో కనిపించేవి సహజసిద్ధమైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలు. అటు శ్రామికుల్లో, ఇటు పెట్టుబడిదారుల్లో ఇవి దర్శనమిస్తాయి. అందరిలోనూ ఇవి కనిపించినప్పుడు మానవ సమూహాలను రెండు వర్గాలుగా విభజించడంలో మాన్యత ఏమేరకుంటుంది? ఆ విభజన ఎలా శాస్ర్తియం? మానవ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని తేల్చేయడం సబబేనా?
భారతదేశం విషయానికొస్తే సమాజంలోని వ్యక్తుల్లో అరిషడ్వర్గాలతోపాటు భక్త్భివం దండిగా కనిపిస్తుంది. మానవ జీవితంలో ఉత్పత్తిలో, సంబంధాల్లో, చైతన్యంలో వీటి ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఉత్పత్తి సంబంధాలకు దూరంగా ఉంటూ స్వావలంబనతో జీవించే ఆదివాసీల్లో, గిరిజనుల్లోనూ భక్త్భివం దండిగా కనిపిస్తోంది. అరిషడ్వర్గాలు సరేసరి! ఇలాంటి జీవితం గడిపేవారు అన్ని దేశాల్లో దర్శనమిస్తారు. ఆదిమ కమ్యూనిజం ఛాయల్లో వారంతా కాలం గడుపుతున్నారు. వారి సంఖ్య తక్కువేమి కాదు. వారిలోనూ వర్గాలను చూద్దామా? వారి ఉత్పత్తులు నాగరిక సమాజానికి ఎంతో కొంత అందుతున్నాయి, నాగరిక సమాజ ఉత్పత్తుల్లో అవసరమైన ఉప్పు, నూనెలు తదితరమైనవి స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియను సైతం శ్రమ దోపిడీ చట్రంలోకి లాగి విశే్లషించడం సరైనదేనా? మార్క్స్ పేర్కొన్న రెండు వర్గాల సూత్రీకరణ, వర్గ పోరాట వాదన ఆదివాసీ సమాజంలో పని చేయడం లేదు. మరి గతమంతా వర్గ పోరాటాల చరిత్ర అని ఎలా దబాయిస్తారు? విచిత్రమేమిటంటే.. భారత ఉపఖండం ముఖ్యంగా భారత్ ఓ చీకటి ఖండంగా కారల్‌మార్క్స్ వ్యాఖ్యానిస్తూ అమెరికా పత్రికలో రెండు వ్యాసాలు రాశారు. మార్క్స్ పుట్టకముందే భారతదేశం ప్రపంచానికి దీపదారిగా వెలిగింది. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో వివిధ దేశాల విద్యార్థులు జ్ఞానం పొందిన విషయాన్ని, సైన్స్, గణితం, ఖగోళ శాస్త్రం తదితర రంగాల్లో అగ్ర భాగాన నిలిచిన అంశాన్ని, అద్భుత సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని పట్టించుకోకుండా ఉజ్వల చరిత్రను గుర్తించకుండా ఇండియా ఓ చీకటి ఖండమని వ్యాఖ్యానించిన మార్క్స్ విశే్లషణా పటిమ, ‘జ్ఞానం’ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన దృక్కోణం ఎంత విశాలమైనదో అవగతమవుతుంది. ఆ జ్ఞానం, అవగాహన ఆధారంగానే ఆయన రెండు వర్గాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన ఎంత పసందైనదో గత 170 సంవత్సరాల చరిత్ర చెబుతూనే ఉంది. తన విశే్లషణ, రూపొందించిన సిద్ధాంతం శాస్ర్తియమైనదని, సైన్స్ అంతటి గొప్పదని ఆయన గొప్పలు పోయారు. ఆయన వీరాభిమానులయితే పట్టపగ్గాలు లేకుండా వీర విహారం చేశారు, చేస్తూనే వున్నారు.
తత్వవేత్త హెగెల్‌కు చెందిన గతితర్క భౌతిక వాదాన్ని, ఆర్థిక శాస్తవ్రేత్త ఆడమ్‌స్మిత్ రచనలోని శ్రమ సిద్ధాంతాన్ని స్వీకరించి వాటిని మార్క్స్ తన ఆలోచనలకు అనుగుణంగా అన్వయించుకుని, వెంటనే సమాజాన్ని సంపూర్ణంగా మార్చాలన్న ఆత్రంతో సమాజంలో చిచ్చుపెట్టాడు. సమాజంలో ఆడమ్‌స్మిత్‌కు, హెగెల్‌కు ప్రజలు కనిపిస్తే కారల్ మార్క్స్‌కు మాత్రం రెండువర్గాలు కనిపించాయి. శ్రమ సిద్ధాంతంలోని చెమట వాసన ఆయనకు దోపిడీగా ద్యోతకమైంది. ఇలా అందమైన పదబంధాలతో చరిత్రను తవ్వి పోసినంతమాత్రాన అది సైన్స్ కాదు, శాస్ర్తియం అసలే కాదు. హేతువును, క్షేత్రస్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తన ఊహాలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు పెద్దపీట వేసి వాటిని సమాజంపై రుద్దడానికి అమానవీయ పద్ధతిలో, ముతక రీతిలో ‘వర్గకసి’ని ప్రేరేపించి రెచ్చగొట్టడం గొప్ప తత్వవేత్త లక్షణం ఎలా అవుతుంది? మార్క్స్ కన్నా ముందు సమాజాన్ని ఎందరో తత్వవేత్తలు వ్యాఖ్యానించారు, భాష్యం చెప్పారు తప్ప సమస్యలకు పరిష్కార మార్గం చూపలేదని మార్క్స్ మాత్రమే పరిష్కార మార్గం చూపి ధన్యుడయ్యాడని ఆయన అభిమానులు, వీరాభిమానులు ఇప్పటికీ ఊరేగుతూ ఉన్నారు. మార్క్స్ కన్నా ముందే, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ప్రచురించకముందే అమెరికాలో కమ్యూన్ల ద్వారా సమాజంలో సోషలిజం తీసుకొచ్చే ప్రయత్నం రాబర్ట్ ఓవెన్స్ నాయకత్వంలో బలంగా జరిగింది. మార్క్స్ విశే్లషణ, ప్రతిపాదన, గతి తార్కిక భౌతికవాదం, ఆర్థిక అంతరాల వెనుకగల దోపిడీ అవగాహన అంతా ‘పస’లేనిదని తేలిపోయింది.
భూమ్యాకర్షణ శక్తి సిద్ధాంతమంతటి శాస్ర్తియం, సైన్స్ అంతటి సరళమైన, నికార్సయిన సిద్ధాంతంగా కీర్తించిన ఆ భావజాలం ఎక్కడా సైన్స్ మాదిరి రుజువుకాలేకపోయింది. భూమ్యాకర్షణ సిద్ధాంతం అన్ని దేశాల్లో ఒకేలా కనిపిస్తుంది . కాని మార్క్సిజం మాత్రం ఏ దేశంలోనూ రుజువుకాలేదు. భారత్ ఆ సిద్ధాంతం వేళ్ళూనుకోలేక వెలవెలబోయింది. తొమ్మిది దశాబ్దాలు తీవ్రంగా ప్రయత్నించినా, త్యాగాలు చేసినా, ప్రజలను ఊచకోత కోసినా, రక్తకాసారాలు సృష్టించినా ప్రయోజనం కనిపించలేదు. మరి ఆ సిద్ధాంతాన్ని సైన్స్ అని ఎలా అంటాం?
బానిస సమాజం అనంతరం ఫ్యూడల్ సమాజం ఏర్పడిందని, అనంతరం పెట్టుబడిదారీ సమాజం పురుడు పోసుకుందని, తరువాత కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడుతుందని మార్క్స్ ప్రధాన విశే్లషణ, వింగడింపు. బానిస సమాజం కన్నా ముందు దశ అయిన ఆదిమ కమ్యూనిజం మాదిరి కొత్తగా వ్యవస్థ ఏర్పడుతుందనడం ఊహ మాత్రమే! తన ఊహకు ఎంత గతి తర్కం అద్దినా, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యాలను బలంగా చూపినా పెట్టుబడిదారీ విధానం అనంతరం కమ్యూనిజం ఆవిర్భవిస్తుందని భావించడం పూర్తిగా అశాస్ర్తియం, అమాయకత్వం, భావ దారిద్య్రం. ఆదిమ కమ్యూనిజం, బానిస సమాజం, ఫ్యూడల్ సమాజం, పెట్టుబడిదారీ సమాజం అనంతరం మరో కొత్త సమాజం ఏర్పడే అవకాశాలున్నాయే తప్ప కారల్ మార్క్స్ ఊహించిన కమ్యూనిస్టు వ్యవస్థ పురుడుపోసుకుంటుందని పేర్కొనడం పూర్తిగా అజ్ఞానం. మార్క్స్ పేర్కొన్న గతి తర్కం ప్రకారమైనా పెట్టుబడిదారీ వ్యవస్థలోంచి కొత్త సమాజం ఏర్పడుతుందే తప్ప దానికి పూర్తిగా విరుద్ధమైన కమ్యూనిజం పురుడుపోసుకునే అవకాశాలు కనిపించవు. వర్తమానంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఫ్యూడలిజం ప్రారంభ దశలో తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉబికి వస్తుందని ఎవరూ ఊహించలేదు. మార్క్స్ మాత్రం పెట్టుబడిదారి విధానం ప్రారంభదశలోనే తరువాత కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడుతుందని ఊహ చేసి, దానికో సిద్ధాంతం సృష్టించడం, తనదైన తర్కాన్ని ముందుకు తీసుకురావడం ఎంతటి అజ్ఞానమో ఇట్టే పసిగట్టవచ్చు. అలా కమ్యూనిజం ఏర్పడుతుందని పేర్కొనడం జ్యోతిష్యం, జాతకం చెప్పడం లాంటిదే అవుతుంది తప్ప భూమ్యాకర్షణ శక్తి సిద్ధాంతం లాంటి శాస్ర్తియత కాదు, సైన్స్ అసలే కాదు. కాని నిర్లజ్జగా మార్క్స్, ఆయన అభిమానులు మార్క్సిజం శాస్ర్తియమని దబాయించడం దారుణం. అన్నిరంగాలలో సైన్స్, టెక్నాలజీ పరిఢవిల్లుతున్న సమయంలో ఈ రకంగా మూర్ఖంగా వాదించడం పూర్తిగా అనాగరికం. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులను సాధికారతవైపు నడిపిస్తోందని నిపుణులు చెబుతున్నా చెవిన పెట్టకపోతే ఎలా?
మరో విచిత్రమేమిటంటే.. కమ్యూనిస్టు వ్యవస్థలో వర్గాలు లుప్తమవుతాయని, అప్పుడు ఘర్షణ ఉండదని, గతి తర్కానికి తెర పడి దానికి ఆస్కారం లేక మరో వ్యవస్థ ఉబికి వచ్చే అవకాశం లేదని, ఆ వ్యవస్థనే ఆఖరిదవుతుందని మార్క్స్ చెప్పడం ఎంతటి అజ్ఞానమో ఆలోచనా శక్తిగల వారు ఇట్టే పసిగట్టవచ్చు. మానవాళికి కమ్యూనిజమే ఆఖరి మజిలీ అని చెప్పడం ఎంతటి భావ దారిద్య్రమో ఎవరైనా ఊహిచవచ్చు. ఇది పూర్తిగా అజ్ఞానం, అసంబద్ధం, మానవుడి శక్తిసామర్థ్యాలను అవహేళన చేయడం.. మార్క్స్ అందుకు తెగించి తన సిద్ధాంతాన్ని లోకం మీదికి వదిలాడు. అది సృష్టించిన అల్లకల్లోలానికి, ఊచకోతలకు పది కోట్లకుపైగా ప్రజలు కన్ను మూశారు. మరి ఇది ఏ రకంగా ఆహ్వానించే భావజాలమవుతుంది? ఏ రకంగా శ్రామిక వర్గ శ్రేయోసిద్ధాంతమవుతుంది? అలాంటి సిద్ధాంతం అజ్ఞానానికి మారుపేరుగాక మరేమవుతుంది?

-వుప్పల నరసింహం 99857 81799