సబ్ ఫీచర్

వైకాపాకు అగ్నిపరీక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే తమ అజెండా అని అన్ని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టిడిపికి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంత నిబద్ధత అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి నామామాత్రమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ పార్టీ పునరుజ్జీవనం అసాధ్యం. బిజెపి పరిస్థితి కూడా ఇంతే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి లేదా వైకాపా మాత్రమే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. టిడిపికి ఉన్న సంస్థాగత నిర్మాణం వల్ల గతాన్ని విశే్లషిస్తే కొన్నాళ్లు అధికారానికి దూరమైనా ఆ పార్టీ చెక్కుచెదరలేదు. కాని వైకాపా పరిస్థితి అందుకు విభిన్నం. వచ్చే ఎన్నికలు వైకాపాకు జీవన్మరణ సమస్యే. 2014 వరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ ఈ రోజు తెరమరుగైంది. ఇక నామమాత్రంగా ఉనికిని చాటుకుంటూ వస్తున్న బిజెపి ఏపీ రాజకీయాల్లో నిలదొక్కుకుంటుందా? లేదా? అనేది వచ్చే ఎన్నికల తర్వాత తేలుతుంది. వైకాపాకు ఒక వేళ వచ్చే ఎన్నికల్లో భంగపాటు ఎదురైతే ఆ మేరకు రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు బిజెపి లేదా కాంగ్రెస్ పోటీపడతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి సంవత్సరాల్లో ఆవిర్భవించిన వైకాపా వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కని పక్షంలో మనుగడ సాధించగలదా ?
టిడిపి 1982లో కాంగ్రెస్ వ్యతిరేకతపై ఆవిర్భవించింది. వైకాపా కూడా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత ఎఐసిసి అధ్యక్షురాలు రాహుల్ గాంధీ వ్యతిరేకతతో పురుడు పోసుకున్నదే. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో మాత్రమే టిడిపి, వైకాపా పార్టీల అండదండలు అవసరమవుతాయి. తమ మద్దతుతోనే కేంద్రంలో ఏదైనా పెద్దపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితి ఉంటే, మంత్రిపదవులు దక్కుతాయనే ఆకాంక్షతోనే ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైకాపాకు వచ్చే ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. 2019 ఎన్నికల్లో వైకాపా అదికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు పణంగా పెట్టకతప్పదు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్దేశంతోనే ఇప్పటికే పాదయాత్రను చేపట్టారు. సగటున రోజుకు 12 కి.మీ చొప్పున జగన్ నడస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉంది. అప్పుడు టిడిపి వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా నెలకొని ఉంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉంటూ పాదయాత్ర చేశారు. బహుముఖ నాయకత్వం వల్ల పార్టీ విస్తరణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ, పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం చూసుకునేందుకు చాలా మంది నాయకులు ఉండేవారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడం, సోనియాగాంధీ అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల వైఎస్ పాదయాత్రకు ఆటంకాలు ఎదురుకాలేదు. పాదయాత్రలతో జనంలో మమేకం కావచ్చు. కానీ, పార్టీని నడిపిస్తూ, మరోవైపు పాదయాత్ర చేయడం సంక్లిష్టమైన సవాలు. ఒకవైపుకోర్టు కేసుల్లో విచారణలకు హాజరవుతూ, మరో వైపు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ, పాదయాత్ర చేయడం ఆషామాషీ కాదు. విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ మనోనిబ్బరం కోల్పోకుండా, రాజీపడకుండా, తాను నమ్ముకున్న దారిలో సాహసంతో అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే రాజనీతి, చతురత అవసరం. ఈ కోణంలో నుంచి చూస్తే జగన్ ఇంకా వెనకబడే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. పాదయాత్ర బదులు బస్సుయాత్ర చేపడితే బాగుండేదన్న అభిప్రాయంతో కొంత మంది పార్టీనేతలు సూచించారు. గత ఎన్నికల ముందు కూడా జగన్, షర్మిల కూడా పాదయాత్రలు చేశారు.
టిడిపితో పోల్చితే వైకాపా సంస్థాగతంగా ఇంకా బలపడాల్సి ఉంది. టిడిపిలా వైకాపా క్యాడర్ పార్టీ కాదు. టిడిపిని వ్యతిరేకించేవాళ్లలో చాలా మంది గత్యంతరం లేక వైకాపా వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ చాలా మటుకు వైకాపాకు మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి, రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బిజెపి మంత్రులు బయటకువచ్చేశారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రానున్న రోజుల్లో వైకాపాను, నిన్నటి వరకు మిత్రపక్షంగా ఇపుడు వైరి పక్షంగా మారిన బిజెపిని లక్ష్యంగా చేసుకుని టిడిపి విమర్శల తీవ్రతను పెంచింది. తమ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసింది, ఏమి చేయబోతున్నామనే దానిపై ప్రజలకు విడమర్చి చెప్పే బలమైన నాయకత్వం భాజపాలో లేదు. బిజెపితో ఎవరు జతకలిపినా ‘ప్రజా ద్రోహులే’ అనే రీతిలో టిడిపి ప్రచారం మొదలు పెట్టింది. ఇంకా పార్లమెంటు ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఈలోగా విభజన హామీల్లో కొన్నింటిని అమలు చేసినట్లు ప్రకటిస్తే బిజెపి పట్ల ప్రజలకు ఉన్న ఆగ్రహం తీవ్రత తగ్గుతుంది. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి విపక్ష వైకాపాకు దగ్గరవుతుందనే భయం టిడిపికి అంతర్లీనంగా ఉంది. ప్రజలకు ప్రయోజనం కలిగించే ఎటువంటి ప్రకటనలు చేయకుండా, ఇదే ధోరణిని బిజెపి కొనసాగించే పక్షంలో ఆ పార్టీతో చేతులు కలిపే సాహసం వైకాపా చేయదు. రాజకీయాల్లో బిజెపి సొంతంగా నిలదొక్కుకునేందుకు ఇదే మంచి సమయం. హామీలు కాకుండా, ప్రయోజనం కలిగించే చర్యలను కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకుంటే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే అవకాశం భాజపాకు ఉం టుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరులో పార్టీ కార్యాలయం శంకుస్ధాపన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. రానున్న రోజుల్లో తన పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. తన కార్యక్షేత్రాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చి అక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తారా? లేదో? చూడాలి. జనసేన ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో ఆ పార్టీ అజెండా ఖరారు కానుంది. కొత్త పార్టీల రాక వల్ల ఆంధ్ర రాజకీయ పార్టీల్లో ప్రజాస్వారుూకరణ విస్తరిస్తుంది.
చప్పగా సమావేశాలు..
ఆంధ్ర, తెలంగాణల్లో అసెంబ్లీ సమావేశాలు చప్పగా నడుస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష వైకాపా సమావేశాలను బహిష్కరించింది. ఈ నిర్ణయం వైకాపాకు మంచి కంటే చెడు చేసేదని చెప్పవచ్చు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అసెంబ్లీ వెలుపల ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై ధ్వజమెత్తడం అభిలషణీయం కాదు. ఈ విషయమై ఆ పార్టీ అధినేత జగన్‌కు సలహాదారులు సరైన సూచనలు ఇవ్వలేదని చెప్పవచ్చు. పాదయాత్ర వల్ల జగన్ అసెంబ్లీకి రాకపోయినా, మిగిలిన ఎమ్మెల్యేలను సభకు పంపవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పటిష్టమైన వ్యూహంతో ముందుకెళుతోంది. తెలంగాణలో బహుముఖ పార్టీలకు స్థానం ఉన్నా, టిఆర్‌ఎస్‌కు దీటైన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇక్కడ టిడిపి ఉనికిని కోల్పోయింది. బిజెపి మాత్రం టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగలేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనివల్ల కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తెలంగాణలో శాసనసభ సమావేశాలు బాగా జరుగుతున్నాయనే పేరుంది. తొలిరోజు ఘటనతోనే అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలు ఇక తంతుగా ముగుస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన కాంగ్రెస్ ఈ రోజు అన్ని శక్తులను కూడదీసుకుంటోంది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బస్సుయాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికైతే ఇంటాబయట ఎదురులేదు. ఆయన పాలన అప్రజాస్వామికంగా ఉందని, హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు జనం మద్దతు లభిస్తోంది. తెలంగాణలో ప్రజాస్వామిక హక్కుల సాధన, ఉద్యమాల ప్రభావం ఎక్కువ. ఇక్కడ నిర్బంధం ఏ రూపంలో ఉన్నా ప్రజలు నిలదీస్తారు.

-కె.విజయశైలేంద్ర 98499 98097