సబ్ ఫీచర్

ఆలోచన-భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది ఆగకుండా మారే క్షేత్రం. ముఖ్యంగా ఈనాడు ఆర్థిక, సామాజిక సమస్యలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని పోయాయి. రేపటికి కావాల్సిన జ్ఞానం ఏ పుస్తకంలోనూ లేదు. అది కేవలం మనిషి ఆలోచనలోనే ఇమిడి వున్నది. ఆ ఆలోచనను ప్రేరేపించటమే, ఆ ఆలోచనను సున్నితంగా పనిచేయించటమే తరగతి గది లక్ష్యంగా మారింది. పుస్తక పఠనమే ప్రధానమైతే గురువే ప్రధానమవుతాడు. ఆలోచన ప్రధానమైపుడు విద్యార్థి ప్రధానమవుతాడు. తరగతి గదికి ఇరుసు విద్యార్థులు. తరగతి గదికి మూల విరాట్టులు పిల్లలే.
విద్యార్థుల్లో బాల్యం నుంచి ఆలోచనలను పెంచటమే తరగతి గది ప్రధాన లక్షణం. ఎంతోమంది అక్షరం కూడా తెల్వకుండా ఆలోచనలు చేయడం లేదా? గొప్ప చిత్రకారులుగా, క్రీడాకారులుగా తయారుకాలేదా? గొప్ప శిల్పకారులుగా తయారుకావటం లేదా? విద్యార్థుల్లో కాల్పనిక శక్తి (క్రియేటివ్ థింకింగ్)ని పెంచడమే తరగతి ముందున్న సవాల్. ఇది పసిపాపల లేత మెదళ్ల నుంచే ఆరంభం కావాలి. అక్షరం కన్నా ఈనాడు భావనే ప్రధానం. భావనను చెక్కటం, కల్పించటం, దానికి నీళ్లు పోయటం అదే మన కర్తవ్యం. విద్యార్థిపై కాలం ఎన్ని సవాళ్లు విసురుతుందో గురువుపైన కూడా ఆ సవాళ్లుంటాయి. గురువులు ఆలోచనాపరులై విద్యార్థులను ఆలోచింపజేయాలి. గురువు అయస్కాంతం అయితే విద్యార్థి ఆకర్షితులవుతారు. తరగతి గది ఆలోచనల క్షేత్రం కావాలి. గురుశిష్యుల ఆలోచనలు తరగతి గదికి శక్తినిస్తాయి. విద్య ఈనాడు ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తున్నది. తరగతి గది ఆవిష్కరణలకు కేంద్రం అవుతున్నది.
భావనను, ఆలోచనను బహిర్గతం చేయడమే నేడు ప్రపంచం ముందున్న సవాల్. ప్రతిరోజూ తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులనుద్దేశించి- ‘ఆలోచించి చెప్పండి’ అంటాడు. ఆలోచన అంటే ఏమిటి? ఆలోచన బహిర్గతం ఎలా అవుతుంది? ఈ రెండు కూడా చిక్కు ప్రశ్నలే. ఉపాధ్యాయులు విద్యార్థుల ముందు సమస్యలు పెడతారు. కానీ పరిష్కారాలు చూపరు. ఈ సమస్యలు పిల్లల మెదళ్లలో తిరుగుతూ ఉంటాయి. దానికి ప్రతిఫలంగానే కొత్త ఆలోచనలు వస్తాయి. ఉపాధ్యాయులు కొందరి నుంచి తక్షణమే సమాధానాలు కోరుతారు. పిల్లలు కూడా ఏదో ఒకటి సమాధానం చెబుతారు. అడిగిన ప్రశ్నను పిల్లలు తమ మనస్సులో ధ్యానం చేసుకుంటుంటారు. ఆ ధ్యానం నేపథ్యంలోనే కొన్నిసార్లు తమ స్నేహితులతో మాట్లాడుకోవడం జరుగుతుంది. కొందరు గంటల తరబడి ఒంటరిగా ఆ సమస్యలను తమ మెదళ్లలోనే తిప్పుకుంటూ ఆలోచిస్తారు. దానే్న సాధన అంటారు. ధ్యానంతో సాధన జరుగుతుంది. ఇదే నిజమైన లెర్నింగ్.
ఉపాధ్యాయులు చెప్పిన సమాచారం లెర్నింగ్ కాదు. దానిపై పెట్టిన సాధనే లెర్నింగ్. సాధన పూర్తిగా వ్యక్తిగతమైనది. ఇచ్చిన సమాచారాన్ని అదే విధంగా ఉంచరు. అదే ప్రశ్నను పిల్లలు ఎన్నోసార్లు తన మెదళ్లలో తిప్పుతారు. ఆ విశే్లషణలో విద్యార్థి తను అనుకున్న అర్థాన్ని ఆధారం చేసుకుని ఎత్తుగడలు వేస్తాడు. ఆ ఎత్తుగడలకు కావాల్సిన పరికరాలను ఆలోచిస్తాడు. దాన్ని కాగితం మీద అప్పుడు పెడతాడు. ఉపాధ్యాయుడు కాగితం మీద విద్యార్థి పెట్టిందే చూస్తాడు. విద్యార్థి మెదడులో జరిగిన ప్రక్రియే నిజమైన ఆలోచన. అది తప్పా? ఒప్పా? అనేది ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. తప్పయితే ఎందుకు తప్పు? అని ఆలోచించటం మాత్రమే కాదు, దానిలోంచి ఒప్పులోకి వచ్చేందుకు కృషి చేస్తారు. ప్రశ్న వేయగానే సమాధానం ఆశించటం తొందరపాటు. కొన్నిసార్లు విద్యార్థి వేసిన ఎత్తుగడలను తన స్నేహితులతో చెప్పుకుంటారు. ఆ సంభాషణే విద్యార్థికి కొత్త తోవ చూపుతుంది.
గతంలో సమాచారం ప్రధానం. ఇపుడు ఆలోచన ప్రధానం. చదువు లక్ష్యం ఆలోచింపజేయటం కానీ ఆన్సర్‌ను రప్పించుకోవటం కాదు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సహాయకారే కానీ మార్గదర్శి కాదు. మార్గదర్శి అయితే తన ఆలోచనను వదిలి ఉపాధ్యాయుడు ఆలోచనలను పట్టుకుంటాడు. టీచర్ గైడ్ కాదు. విద్యార్థుల భావనలను ప్రోత్సహించే ప్రేరకులు ఉపాధ్యాయులు. 21వ శతాబ్దం ఉపాధ్యాయుల, విద్యార్థుల పని స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఇపుడు తరగతి గది ఆవిష్కరణల జలపాతంగా మారింది.

- చుక్కా రామయ్య