సబ్ ఫీచర్

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సాయం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి జలాలను సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ కార్యాచరణలో చురుగ్గా ముందుకు సాగుతున్నారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరీ జలాల సద్వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను, నిధులను అందజేస్తోంది. ఏపీలో పోలవరం నిర్మాణానికి సవరించిన అంచనాల మేరకు 2013-14లోనే రూ.58,320 కోట్ల వ్యయాన్ని కేంద్రం భరించవలసి వుంది. రెండు రాష్ట్రాలకూ జీవనాడి లాంటి ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయహోదా స్థాయితో పాటు నిధులిచ్చి ఆదుకోవటంలో కేంద్రం నిర్లక్ష్యవైఖరి స్పష్టమవుతూనే వుంది. రూ.80,500 కోట్ల అంచనా వ్యయంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించలేదు. కేంద్రంలో బీజేపీ సర్కారు సారధ్యానికి యింతవరకు మద్దతు ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి తెదేపా మంత్రులిద్దరూ రాజీనామా చేయడం, తెలంగాణ సీఎం కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు నిర్ణయించడం సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్రం నుంచి కీలకమైన అనుమతులు పొందడం, భారీ ప్రాజెక్టులు కొనసాగించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పెనుసవాల్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017-18లోనే తెలంగాణ ప్రభుత్వం రూ.10,470 కోట్లు ఖర్చుపెట్టింది. పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.9,000 కోట్లు కేటాయించింది. ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు 13,053.91 కోట్లు ఖర్చుకాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత రూ.7,918.04 కోట్లు ఖర్చయ్యింది. కేంద్రం ఫిబ్రవరి వరకు కేవలం రూ.4,932.26 కోట్లు ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు తిరిగి రావాలంటే, సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదించాల్సి వుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చుపెట్టి, తరువాత కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటానికి ఎంతో సయోధ్య అవసరం. 80వేల, 60వేల కోట్ల భారీ అంచనాల వ్యయం వున్న ఈ రెండు ప్రాజక్టుల నిర్మాణం కేంద్ర సహకారం లేనిదే పూర్తికావటం కష్టం. భూసేకరణ పునరావాసం, గిరిజన, దళిత నిరుపేద వర్గాలు వలసలతో వేదనలు అనుభవించవలసి వుంది. తిండి గింజలు పండించే రైతాంగానికి, గోదావరి జలాల సద్వినియోగం వల్ల కరువుకాటకాలు దరిచేరని సస్యసాఫల్యత సాధించవచ్చు. రైతులు అవస్థల పాలైనందున తెలంగాణకు కాళేశ్వరం ఒక భగవదత్తమైన వరంగా భావించవలసి వుంది. చిన్న రాష్టమ్రైనా సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దేశంలో ఎక్కడా సాహసించని బృహత్తర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో తెరాస ప్రభుత్వం ముందంజ వేస్తోంది. ఇప్పటికే రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టింది. జాతీయ హోదా ఇవ్వవలసినదిగా సీఎం కేసీఆర్ పదే పదే కేంద్రాన్ని అర్థిస్తున్నారు. 2016లోనే తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు స్వయంగా ప్రతిపాదనలు సమర్పించారు. అనుమతులు, ప్రశంసలకు కొదువలేదు. ఇంతలో ‘్థర్డ్‌ఫ్రంట్’ అంశం రంగ ప్రవేశం చేసింది. తాజా రాజకీయ పరిణామాలు ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
రికార్డు స్థాయిలో భారీ బడ్జెట్‌లు అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్రం రాజకీయ ఆధిపత్యం, రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలిగించే పరిస్థితులు జాతి సంక్షేమానికి తప్పక అవరోధం కలిగిస్తాయి. కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసే సత్కృషిలో భాగంగా తెరాస ప్రభుత్వం- బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఏ రాష్ట్రంలోనూ లేనంతగా రూ.25వేల కోట్లు కేటాయించింది. కాళేశ్వరం పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి నీటిని మళ్ళించే పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకొనే ఈ బృహత్తర ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావలసి వుంది. ఇక, పోలవరం ప్రాజక్టును 2019 జూన్ నాటికి పాక్షికంగాను, డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో పూర్తిచేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు.
కావేరికీ గోదారి నీళ్లు- కాకి లెక్కలు..
‘హర్మొన్’ డాక్ట్రిన్ ప్రకారం, శతాబ్దం క్రితమే అంతర్జాతీయంగా నదులపై ఆధిపత్యం దేశాధికారానికి వర్తిస్తుంది. ఇటీవల సుప్రీం కోర్టు మానవులకు, జంతువులకు తాగునీటి అవసరాలకు జీవప్రాధాన్యత దృష్ట్యా, రాష్ట్రాల మధ్య నదులు ప్రవహిస్తున్నా నదులను జాతీయ సంపదగా పరిగణించాలని, ఏ రాష్ట్రానికీ ఏ నదిపైనా సంపూర్ణ హక్కులు లేవని స్పష్టం చేసింది. వర్షాధారమైన, ఇతర కరువుపీడిత ప్రాంతాలు నీటిని తరలించుకోవచ్చు కాని ఇరుగుపొరుగు రాష్ట్రాల అవసరాలను కాదనే హక్కు ఏ రాష్ట్రానికీ లేదు. గోదావరి-కృష్ణానదుల అనుసంధానంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన నదుల అనుసంధాన ప్రక్రియలో కావేరికీ గోదావరి జలాలను తరలించాలట! గోదావరిలో మిగులు జలాలు లేవంటున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. దక్షిణాది నదుల నీటి సమస్యల పరిష్కారానికి కేంద్రం ద్వీపకల్ప నదులపై దృష్టి సారిస్తోంది. గోదావరిని కృష్ణా, పెన్నా, కావేరీకి తరలించే ప్రణాళిక తల ఎత్తింది. మహానది, గోదావరి అనుసంధాన ప్రతిపాదనతో ఒడిశా- మహానదిలో లభ్యత జలాలు లేవని వ్యతిరేకిస్తోంది. తమ కోటాను తేల్చకుండా నీటి తరలింపును తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నదుల అనుసంధానం భాగంగా గోదావరిలోని 247 టీ.ఎం.సీలు కావేరీకి తరలించాలని కేంద్ర జలవనరులశాఖా మంత్రి నితిన్‌గడ్కరీ పట్టుదలతో వున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అకినేపల్లి బ్యారేజీ నుంచి కాకుండా పోలవరం నిర్మాణం తరువాత పైడిపాకల నుంచి ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరీ గ్రాండ్ ఆనకట్టకు వ్యాపోస్ నివేదిక ప్రకారం తరలించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్నాటక అన్ని రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా గోదావరిలో నీటి లభ్యతను కాకిలెక్కల ఆధారంగా కాకుండా హైడ్రాలజీ సర్వే సక్రమంగా నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
గోదారి-కావేరీ అనుసంధానానికి 49వేల కోట్లు అంచనావ్యయం కాగా, పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డిపీఆర్) తయారు చేయాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కుదరాలి. పోలవరం, కాళేశ్వరం పూర్తిచేస్తేనే, నీటి లభ్యత గురించిన కాకిలెక్కలు తేలిపోతాయి. అప్పుడే తెలుగు రాష్ట్రాలకు జల సౌభాగ్యం.

- జయసూర్య సెల్: 94406 64610