సబ్ ఫీచర్

గాడితప్పిన గ్రామపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణులకు కోటి ఆశలు కల్పిస్తూ గద్దెనెక్కిన సర్పంచ్‌లు గత మూడున్నరేళ్ల పాలనలో తమ పంచాయితీల ఆదాయ వనరులు పెంచటంలో ఘోరంగా విఫలమయ్యారు. వౌలిక సదుపాయాల కల్పన విషయంలో వారు గ్రామీణుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇదే సమయంలో కొంతమంది సర్పంచ్‌లు తమ సొంత ఆదాయం మెరుగుపడే విధంగా పంచాయితీ ఖర్చులను నిర్వహించారనేది చేదు నిజం. ప్రస్తుత సర్పంచ్‌ల పాలనాకాలంలో ఉపసర్పంచ్‌పై నాలుగేళ్ళ వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవటంతో అనేకచోట్ల ఉప సర్పంచ్ ముసుగులో సర్పంచ్‌లే పాలన చేస్తూ పంచాయితీల వ్యవస్థనే అవహేళన చేస్తున్నారు. వీధి లైట్ల నిర్వహణ, మంచినీటి గొట్టపు బావుల విద్యుత్ బిల్లులు పంచాయితీలే కట్టుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పంచాయితీ ఆదాయ వనరులమీదే వుంది. వివిధ మార్గాల ద్వారా పంచాయితీలకు అధికారులు ఆదాయం సమకూరుస్తుంటే, ఖర్చుల కోసం చెక్కులపై సంతకం పెడితే తమ బాధ్యత తీరిపోతుందని అనేకమంది సర్పంచ్‌లు భావిస్తున్నారు. గ్రామ పరిపాలన గాడిలో పడాలంటే ఇలాంటి ఆలోచనా విధానం వారిలో ముందుగా పోవాలి.
గతంలో దాదాపు యాభై శాతం మంది సర్పంచ్‌లు నామమాత్ర బాధ్యతలు నిర్వహించారన్నది నిష్ఠుర సత్యం. ఇలాంటివారి సంఖ్య ఇపుడు 75 శాతానికి పెరిగిందన్నది తాజా అంచనా. మన సర్పంచ్‌ల వ్యవస్థ పంచాయితీలకు ఆదాయ వనరులను ఏ మాత్రం మెరుగుపర్చేదిగా లేదు. గ్రామసీమల అభివృద్ధి కేవలం మాటలకు తప్ప చేతలకు దూరమనేది ఈ మూడున్నర సంవత్సరాల ‘సుపరిపాలన’ బట్టబయలు చేసి సర్పంచ్‌ల పాలనా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఇంకా మిగిలిన 15 నెలల పాలనా వ్యవధిలో వారు అద్భుతాలు చేస్తారని ఆశించటం అత్యాశే అవుతుంది.
గతసారి ఎన్నికల్లో 50 శాతం సర్పంచ్ పదవులను మహిళలకు కేటాయించారు. అనేకచోట్ల మహిళా సర్పంచ్‌ల భర్తలు, కుటుంబ పెద్దలు, కొడుకులు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారంటే- గ్రామ పాలనలో మహిళా సర్పంచ్‌లు నిర్వహించే క్రియాశీల పాత్రపై గతంలోనే సందేహాలు ముసురుకున్నాయి. కొన్నిచోట్ల గ్రామాల్లోని పెత్తందార్లు తమ వంట మనుషులను, పనిమనుషులను ఎన్నికల రంగంలోకి దింపి పంచాయితీలపై తమ పట్టు చేజారకుండా చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే పరిణామాలే ఇవన్నీ. వాస్తవానికి సర్పంచ్‌లకు ఉండే అధికారాలు నామమాత్రం. సొంత నిర్ణయం తీసుకుని రోడ్డుపై చిన్న గోతినైనా పూడ్పించలేని దుస్థితి వారిది. విద్యావంతులు, గ్రామ పాలనపై అవగాహన, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఉత్సాహవంతులు ఎన్నికైన గ్రామాల్లో తప్ప, ఇతర చోట్ల సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటిచోట్ల వ్యవహారాలన్నీ అధికారుల, పెత్తందార్ల ఇష్టప్రకారమే సాగిపోతుంటాయి.
పాలన వ్యవహారాలపై అవగాహన లేని సర్పంచ్‌లు కొందరు పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ విస్తరణాధికారి, డివిజనల్ పంచాయతీ అధికారుల చేతుల్లో కీలుబొమ్మలవుతున్నారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఖాతాల గణన సమయంలో జిల్లా ఆడిట్ విభాగం సర్పంచులను ఉక్కిరి బిక్కిరిచేస్తోంది. ఈ పరిస్థితులను సాకుగా తీసుకుని అభివృద్ధి పనుల విషయంలో స్థానిక గుత్తేదారులు చక్రం తిప్పుతుంటారు. విద్యుత్ సామగ్రి, పారిశుద్ధ్య పనిముట్లు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలే పంచాయితీ ఖర్చుల్లో ప్రధానంగా కనబడతాయి. పంచాయితీ నిధుల్లో 70 శాతం వీటికే ఖర్చవుతాయి. కొందరు సర్పంచ్‌లు, అధికారులు చేతివాటం ప్రదర్శించి సొమ్ములు మిగుల్చుకుంటూ ఉంటారు. కొనుగోళ్లలో అవకతవకలు బయటపడి ఎక్కువమంది సర్పంచ్‌లు చెక్‌పవర్ రద్దుకు, సస్పెన్షన్‌కు గురవుతున్నారు.
ఆదాయ వనరులకు గండి..
గ్రామాలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. చిత్తశుద్ధి కరువవడంతో అనుభవం పండిన సర్పంచులు సైతం ఈ విషయంలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. ఇంటి పన్ను, కుళాయిల పన్నులను సైతం పూర్తిశాతం వసూలు చేసుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద కర్మాగారాలు, మిల్లుల యజమానులు ప్రలోభాలతో సర్పంచ్‌లను దారిలోకి తెచ్చుకుని ఆస్తిపన్నుకు ఎగనామం పెడుతున్నారు. గ్రామపెద్దలకు భయపడి, వారి విశాలమైన భవంతులకు తక్కువ ఇంటిపన్ను వసూలు చేస్తున్న దాఖలాలు అనేకం. నీటి పన్నులు సైతం బడాబాబుల నుంచి జమ కావు. వాహన పన్ను జోలికైతే అసలే వెళ్లరు. వృత్తిపన్ను వసూళ్లలో అక్రమాలు కోకొల్లలు. తన విజయానికి సహకరించిన వర్గాల నుంచి రావాల్సిన పన్ను వసూళ్లపై సర్పంచ్‌లు ఉదాసీనంగా ఉండటం పరిపాటిగా మారుతోంది.
సంతల నుంచి ఆదాయం వసూలు చేయడం లేదు. గ్రామాల్లో బండ్లు, సైకిళ్లపై తిరుగుతూ అమ్మకాలు చేసే వారి నుంచి పన్నుల వసూలు అంతంత మాత్రమే. పచ్చిక బయళ్ళు, రోడ్డు మార్జిన్లు, చెరువు గట్లపై ఫలవృక్షాల వేలం పాటల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ధాన్యం, అపరాల అమ్మకంపై కనీస కొలగారం రుసుం వసూలు చేయడం లేదు. ముఖ్యంగా చేపల చెరువుల వేలం పాటల్లో నూటికి 70 శాతం అక్రమాలు జరుగుతున్నాయి. బలమైన చేపల వేట సంఘాల ఒత్తిళ్లను సర్పంచ్‌లు తట్టుకోలేకపోతున్నారు. పంచాయితీకి లక్ష రూపాయల పన్ను కట్టేబదులు పది లేదా ఇరవై వేల రూపాయలిచ్చి సర్పంచ్‌ని దారిలోకి తెచ్చుకోవచ్చుననే దృక్పథం ప్రబలింది. గ్రామాల్లోని కిరాణా, ఎరువుల దుకాణాలు, హోటళ్ల నుంచి పన్నులు వసూలు చేసుకోవచ్చు. కానీ, ఆ దిశగా దృష్టి సారించేవారు కొందరే. అనేక చోట్ల ఇప్పటికీ పంచాయితీకి పైసా పన్ను కట్టకుండా ఇష్టారాజ్యంగా ఇళ్లు కట్టుకోవచ్చనే పరిస్థితి ఉందంటే ఆదాయానికి ఏ మేరకు గండి పడుతోందో అర్థం చేసుకోవచ్చు.
పట్టణాలకు 30-40 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో సైతం ఇళ్ల స్థలాల లే అవుట్లు వేస్తున్న రోజులివి. వాటికి సంబంధించి భూమి మార్పిడి రుసుములు వసూళ్లు చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక బట్టీలు, చేపల చెరువుల తవ్వకం, పాడి పరిశ్రమ శీతలీకరణ కేంద్రాలు, ఆయిల్ మిల్లులు, పప్పుల మిల్లులు, రైసు మిల్లులకు సంబంధించి కూడా పన్ను వసూళ్లు పూర్తి స్థాయిలో జరగటం లేదు. మేజర్ పంచాయితీల్లోని సినిమా హాళ్ళు, ఐస్‌క్రీమ్ సెంటర్లు, హోటళ్లు, పాన్ షాపులు, మిక్చర్ బండ్లు, తాకట్టు వ్యాపారాలు, సెల్‌టవర్లు, వీడియోగేమ్ కేంద్రాలు, ఇటుక బట్టీలు నుంచి సైతం పన్నుల వసూళ్లు అటకెక్కాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంచాయతీలకు అన్ని రకాల పన్నులు విధిగా వసూలయ్యే విధానాలు రూపొందించాలి. పన్ను వసూళ్లపై దృష్టి సారించని, ఆదాయానికి గండికొట్టే సర్పంచ్‌లను బాధ్యతల నుంచి తప్పించాలి. నిర్దిష్ట విధి విధానాలు రూపొందించి వాటిని కట్టుదిట్టంగా అమలు చేసే వ్యవస్థలు వచ్చినపుడే పంచాయితీల ఆదాయ వనరులు మరింత మెరుగవుతాయి. అప్పుడే ‘జాతిపిత’ మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కల సాకారమవుతుంది.

-పుట్టా సోమన్న చౌదరి somannaputta@gmail.com