సబ్ ఫీచర్

మూతపడుతున్న ప్రభుత్వ బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు విద్యనందించడానికి, విద్యావ్యాప్తికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం లభించడం లేదు. అన్నిరకాల సౌకర్యాలతో పాఠశాలలు నిర్వహిస్తున్నా, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు అందిస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. ఆంగ్ల విద్యపై మోజులో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడంవల్ల నేడు ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుండటంతో మరికొన్ని పాఠశాలలు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలకు చాలామంది పిల్లలు దూరమవుతున్నారు.
విద్యాశాఖ పలు సక్సెస్ స్కూళ్ళలో 6నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల విద్యాబోధన చేపడుతున్నప్పటికీ పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కలగటం లేదు. ఈ రకంగా సక్సెస్ పాఠశాలలు కూడా విజయం సాధించడం లేదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలంలో 15 ఉన్నత పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 47 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, ఇప్పటివరకు ఆరు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. మరో పది ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపు మాత్రమే ఉంది. ఇందులో వచ్చే విద్యాసంవత్సరంలో కొన్ని పాఠశాలలు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని కాసులపల్లి, మారేడుగొండ గ్రామ పరిధిలోని వెంకట్రావ్‌పల్లి, జగన్నాథపురం, కనగర్తి పరిధిలోని ఈదులపల్లి, పాలితం పరిధిలోని నేతకానిపల్లి, చందపల్లి పరిధిలోని పెద్దమ్మనగర్ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. రాంపల్లి, శ్రీరాంనగర్‌లోని పాఠశాలలో ఇద్దరు, దావన్నపల్లిలో నలుగురు,గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి, నిమ్మనపల్లి పాఠశాలలో పది లోపు విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు తక్కువగా ఉన్న మరో పది పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే యేడాది మరిన్ని పాఠశాలలు మూసివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం మండలంలోని రాఘవాపూర్, అప్పన్నపేట, నిట్టూర్, తుర్కల మద్దికుంట తదితర ఉన్నత పాఠశాలలు 6నుండి 10వ తరగతి వరకు సక్సెస్ స్కూల్ పేరుతో ఆంగ్ల విద్యాబోధన చేపడుతున్నారు. ఇందులోనూ పూర్తిస్థాయిలో విజయం సాధించకపోవడంవల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అప్పన్నపేటలో మినహా దాదాపు అన్ని పాఠశాలల్లో 50 మంది లోపు విద్యార్థులు మాత్రమే సక్సెస్ పాఠశాలలో చదవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో సరైన బోధన లేకపోవడం వల్లనే తాము ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాథమిక దశలోనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని వారు కోరుతున్నారు. అలాగే ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, ఇతర సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం విద్యావిధానంలో మార్పులు తీసుకురాకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అందరికి అనుకూలంగా ఉండే విద్యావిధానాన్ని అమలుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పటిష్టమైన చర్యలు చేపడితే ప్రభుత్వబడులను మూసివేయాల్సిన పరిస్థితి రాదు. కాని అలసత్వం, నిర్లక్ష్యం విద్యావ్యవస్థను పీడిస్తున్నాయ. వీటి ఫలితమే ప్రస్తుతం నేటి దుస్థితికి కారణం. ప్రభుత్వ బడిలోనే ఉమ్మడి విద్య సాధ్యమవుతుంది. అలసత్వం ఈ లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది.

- గుండు రమణయ్య