సబ్ ఫీచర్

రైతుకు కుడిఎడమల దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రైతేరాజు.. అన్నదాత.. జనం ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు’.. ఇలా ఎన్నో రకాలుగా సమాజంలోని అన్ని వర్గాల వారూ రైతన్నలను పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఈ పొగడ్తలది ఒక కోణం. మరో కోణంలో చూస్తే కర్షకుల కష్టాలు, వారు అనునిత్యం ఎన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నదీ మనకు అవగతమవుతుంది. సమాజంలో రైతులు మాత్రమే పలురకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. మిగతా వృత్తులను నమ్ముకున్న వారు ఎంతోకొంత లాభసాటిగానే జీవించగలుగుతున్నారు. ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నప్పటికీ రైతులు పంటలు పండించకుంటే ప్రజలు ఆకలితో అల్లాడిపోక తప్పదు. ‘పంట లేని దేశం మంట లేకుండా మండుతుంద’నే సామెత ఇందుకు తార్కాణం. పలురకాలుగా దోపిడీకి గురికావటం వల్ల అన్నదాత నష్టాలను నెత్తినెత్తుకొంటున్నాడు. రుణబాధలు, అవమానాలు భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
మద్దతు ధరల నిర్ణయంతోనే రైతు దోపిడీకి గురి కావడం మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ఏ పంటకూ గిట్టుబాటుగా లేదన్న విషయం జగమెరిగిన సత్యం. ఏ పంట వేసిన రైతైనా తనకు గిట్టుబాటు కావాలని కోరుకుంటాడు. 26 పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తుంది. ఈ కనీస మద్దతు ధరలు రైతుల ఖర్చులకు సరిపోయే విధంగా వుండటం లేదు. ఫలితంగా రైతు నష్టాల బారినపడి అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. సామాన్యులకు మాత్రమే కాదు, అతిరథ మహారథులకు సైతం అంతుపట్టని పద్ధతి మద్దతు ధరల నిర్ణయంలో ఉంటుంది. ఒక పారిశ్రామికవేత్త ఓ విమానం లేదా ఓ యంత్రం తయారు చేసినా దాని ధరను అతను నిర్ణయించుకొంటాడు. గుండు సూది తయారు చేసినా దాని ధరనూ ఉత్పత్తిదారే నిర్ణయించుకొంటాడు. ఇలా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ వస్తువును ఉత్పత్తి చేసినా, దాని పెట్టుబడి, శ్రమశక్తి, నిల్వ సమయంలో వడ్డీలను మాత్రమే కాకుండా, లాభం కూడా చేర్చి ధర నిర్ణయిస్తారు. దాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. కానీ, రైతులు చెమటోడ్చి పండించే పంటకు శ్రమశక్తి పరిగణనలోకి రాదు. పెట్టుబడి కూడా చాలని విధంగా మద్దతు ధర నిర్ణయించటం, అన్నదాతలను ఆర్తనాదాలకు గురిచేయటం ఎంతవరకు సమంజసం?
అరకొరగా నిర్ణయించిన మద్దతు ధర అయినా ప్రతి రైతుకు అందుతుందా? అంటే అదీ లేదు. రైతులు పండించిన పంటనంతా మద్దతు ధరకు కొనుగోలు చేయగల యంత్రాంగం మన ప్రభుత్వాల వద్ద లేదు. పంటను దళారులకు అమ్ముకొనే దుస్థితి కొనసాగుతుంది. దళారి అడిగిన ధరకు అమ్ముకోవలసిన దుర్గతిలో రైతులున్నారు. దీనితో అనివార్యంగా దోపిడీకి రైతు గురవుతున్నాడు.
ఇక వ్యవసాయానికి అవసరమైనది ఏది కొనాలన్నా రైతు దోపిడికి గురవుతూనే వున్నాడు. ఎరువులు, పురుగు మందుల ధరల నిర్ణయంపై ప్రభుత్వాలకు ఏ విధమైన అధికారాలు లేవు. (ఒక్క యూరియా మినహా) ఉదాహరణకు పురుగు మందుల విషయం తీసుకొందాము. 100 యం.యల్. మందు రెండువేల రూపాయల వరకు వుండటం రైతులకు అనుభవమే. ఆ 100 యం.యల్.మందు తయారీకి 500 రూపాయలు కూడా ఖర్చవదని నిపుణులు చెపుతున్నారు. అయినా, రెండువేల రూపాయలు ముద్రించి బజారుకు పంపుతున్నారు. ఏ కంపెనీ మందులకు ఎక్కువ కమీషన్ వస్తుంటే, వాటినే వ్యాపారులు రైతులకు అంటగడుతున్నారు. మందుల ఉత్పత్తిదారుల లాభం, వ్యాపారుల లాభం కలిపితే వ్యయం కన్నా ఎన్నో రెట్లు అధికంగా వుంటుంది. ఇది మరో రకం దోపిడీ. ఇక ఎరువులు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కొరత అనివార్యం అవుతోంది. ఈ కొరత సహజ సిద్ధం కాదు. కృత్రిమంగా సృష్టించిన కొరత. కంపెనీల నుంచి తమకు అందిన సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టించటం సర్వసాధారణమైపోయింది. సరఫరా జరిగిన ఎరువులను కట్టుదిట్టంగా రైతులకు అందించే వ్యవస్థ మనకు లేదు. అందుకవసరమైన యంత్రాంగం కూడా లేదనే చెప్పాలి. రైతు తన అవసరాల మేరకు వ్యాపారి చెప్పిన ధరకు కొనాల్సిందే. లేదంటే పంటలను రక్షించుకునే పరిస్థితి ఉండదు. కృత్రిమ కొరత సృష్టించి అదనపు ధర వసూలు చేయటం మరో దోపిడీ. నకిలీ విత్తనాలను అంటగట్టటం మరో దోపిడీ. ఇటీవల మరో దోపిడి వెలుగు చూసింది. ఎరువుల బస్తా సహజంగా 50 కిలోలు వుంటుంది. కంపెనీలో తయారైనపుడే తూకం వేసి, బస్తాపై బరువును ముద్రిస్తారు. లీగల్ మెట్రాలజీ శాఖ ఇటీవల నిర్వహించిన దాడుల్లో మరో దోపిడీ బట్టబయలైంది. ఓ ప్రముఖ ఎరువుల కంపెనీపై 14 కేసులు, ఇతర కంపెనీలపై 11 కేసులు నమోదయ్యాయి. బస్తాలో వుండాల్సిన ఎరువుకన్నా కిలో నుంచి రెండున్నర కిలోల తక్కువగా వుండటం అధికారుల సోదాల్లో బట్టబయలైంది. ఎరువుల బస్తాల్లో తరుగుదల కేవలం ఒక్క జిల్లాకు పరిమితం కాలేదు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తక్కువ తూకంతో వున్న ఎరువుల బస్తాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి.

-దాసరి ఆళ్వార స్వామి సెల్: 93938 18199